AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఆరు నెలలుగా చుక్క కూడా ముట్టలేదు.. ఐపీఎల్ 2026 ముందు స్టార్ స్పిన్నర్ సంచలన నిర్ణయం

IPL 2026 : టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్, ఐపీఎల్ లెజెండ్ యుజ్వేంద్ర చాహల్ తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు ఆయన తన అలవాట్లను మార్చుకున్నానని, ముఖ్యంగా గత ఆరు నెలలుగా మద్యం ముట్టలేదని వెల్లడించారు. ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టి, జట్టుకు తన వంతు 150 శాతం సహకారం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చాహల్ పేర్కొన్నారు.

IPL 2026  : ఆరు నెలలుగా చుక్క కూడా ముట్టలేదు.. ఐపీఎల్ 2026 ముందు స్టార్ స్పిన్నర్ సంచలన నిర్ణయం
Yuzvendra Chahals Commentary
Rakesh
|

Updated on: Mar 19, 2026 | 9:54 AM

Share

IPL 2026 : ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన యుజ్వేంద్ర చాహల్, తన కెరీర్‌లో కొత్త దశలోకి అడుగుపెట్టారు. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన చాహల్, తన ఫిట్‌నెస్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. “గత ఆరు నెలలుగా నేను మద్యం సేవించడం మానేశాను. ఇప్పుడు నాకు 35 ఏళ్లు. నా శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం నా మొదటి ప్రాధాన్యత. ఒక సీనియర్ ప్లేయర్‌గా ఐపీఎల్ బరిలోకి దిగుతున్నప్పుడు, నన్ను చూసి కుర్రాళ్లు ఏదో ఒకటి నేర్చుకోవాలి. అందుకే 150 శాతం ఎఫర్ట్ పెట్టి జట్టును గెలిపించాలనుకుంటున్నాను” అని చాహల్ వివరించారు.

చేజారిన ఐపీఎల్ టైటిల్

2025 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) తరపున ఆడిన చాహల్, ఫైనల్ వరకు వెళ్లినా టైటిల్ గెలవలేకపోవడంపై తన ఆవేదన వ్యక్తం చేశారు. గత సీజన్‌లో కేకేఆర్‌తో మ్యాచ్ తర్వాత తన పక్కటెముక ఫ్రాక్చర్ అయ్యిందని, ఆ తర్వాత చేతి వేలు కూడా విరిగిందని ఆయన వెల్లడించారు. “గాయాల వల్ల సెమీఫైనల్, ఫైనల్‌లో నేను సరిగ్గా లెగ్ స్పిన్ వేయలేకపోయాను. అందుకే ఈ ఏడాది నా బాడీపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాను” అని చెప్పారు. ఆర్సీబీతో జరిగిన ఆ ఫైనల్‌లో పంజాబ్ కేవలం 6 పరుగుల తేడాతో ఓడిపోవడం చాహల్‌ను ఇప్పటికీ వెంటాడుతోంది.

మార్కో జాన్సెన్ లేకపోవడం పెద్ద మైనస్

పంజాబ్ కింగ్స్ ఫైనల్‌లో ఓడిపోవడానికి ప్రధాన కారణం స్టార్ పేసర్ మార్కో జాన్సెన్ అందుబాటులో లేకపోవడమేనని చాహల్ అభిప్రాయపడ్డారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఆయన సౌతాఫ్రికా వెళ్లడంతో పంజాబ్ ఒక మంచి బౌలర్‌ను, హిట్టర్‌ను కోల్పోయిందని అన్నారు. “జాన్సెన్ ఉండి ఉంటే ఫలితం కచ్చితంగా వేరేలా ఉండేది. ఆయన బౌలింగ్‌లోనే కాదు, చివర్లో రెండు మూడు సిక్సర్లు కొట్టడంలో కూడా దిట్ట. ఈసారి ఆయన ఫుల్ ఫామ్‌లో ఉండటం మా జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్” అని చాహల్ ధీమా వ్యక్తం చేశారు.

రికార్డుల కింగ్ మళ్లీ వస్తున్నాడు

నవంబర్ 2025లో డెంగ్యూ, చికన్ గున్యా బారిన పడి అనారోగ్యంతో బాధపడిన చాహల్, ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. 2013 నుంచి ఐపీఎల్ ఆడుతున్న ఆయన, ఇప్పటివరకు 172 మ్యాచ్‌ల్లో 221 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన బౌలర్‌గా కొనసాగుతున్నారు. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ తరపున ఫైనల్స్ ఆడినా, ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండి ట్రోఫీని ముద్దాడే అవకాశం రాలేదు. ఈసారి పంజాబ్ కింగ్స్ తరపున ఆ కల నెరవేర్చుకోవాలని చాహల్ పట్టుదలతో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us