25 కోట్లు పోస్తే ఐరెన్ లెగ్‌లా మారాడు.. 7 కోట్లతో వచ్చి లక్కీ హ్యాండయ్యాడు.. ఫ్రాంచైజీల పాలిట విలన్లు, హీరోలు వీళ్లే
IPL Most Expensive Players: క్రికెట్ అనేది కేవలం డబ్బుతో ఆడే ఆట కాదని, సరైన ప్రణాళిక, ప్రతిభకు ఇచ్చే ప్రాధాన్యతతోనే విజయాలు సాధ్యమని ఐపీఎల్ 2026 సీజన్ నిరూపించింది. కోట్ల రూపాయల బ్రాండ్ ఇమేజ్ కంటే, జట్టు అవసరాలకు తగ్గట్టు తక్కువ ధరలో దొరికే మధ్యతరగతి ఆటగాళ్లే అసలైన మ్యాచ్ విన్నర్లుగా మారుతారని జేసన్ హోల్డర్ ప్రదర్శన ఫ్రాంచైజీలకు కనువిప్పు కలిగించింది.

ఐపీఎల్ వేలంలో కోట్ల రూపాయలు కుమ్మరిస్తేనే విజయాలు దక్కుతాయనే నమ్మకాన్ని ఐపీఎల్ 2026 సీజన్ పూర్తిగా తలకిందులు చేసింది. భారీ ధర పలికిన ఆటగాళ్లు చాపచుట్టేయగా, కేవలం రూ. 7 కోట్లకే దక్కిన ఓ వెస్టిండీస్ ఆల్రౌండర్ తన అద్భుత ప్రదర్శనతో లీగ్‌లోనే అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కోట్ల వర్షం.. కానీ ఫలితం శూన్యం..!
అబుదాబి వేదికగా జరిగిన మినీ వేలంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ. 25.20 కోట్లు వెచ్చించి కేమరాన్ గ్రీన్‌ను కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా గ్రీన్ రికార్డు సృష్టించాడు. అదే జట్టు మతీషా పతిరానా కోసం రూ. 18 కోట్లు ఖర్చు చేసింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ అన్‌క్యాప్డ్ ఆటగాళ్లయిన కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌లపై తలా రూ. 14.20 కోట్లు పోసింది. కానీ, తీరా సీజన్ ముగిసేసరికి ఈ భారీ కొనుగోళ్లు ఫ్రాంచైజీలకు తీరని నిరాశనే మిగిల్చాయి. భారీ బడ్జెట్ పెట్టిన కోల్‌కతా ఏడో స్థానంతో, చెన్నై ఎనిమిదో స్థానంతో లీగ్ దశలోనే ఇంటిబాట పట్టాయి.
గుజరాత్‌కు దక్కిన ‘కోహినూర్’ వజ్రం జేసన్ హోల్డర్..
భారీ ధరలు పలికిన స్టార్ ఆటగాళ్లు విఫలమైన వేళ, గుజరాత్ టైటాన్స్ స్మార్ట్ ప్లాన్ వర్కవుట్ అయింది. కేవలం రూ. 7 కోట్ల బేరానికి దక్కిన వెస్టిండీస్ మాజీ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఈ సీజన్ మొత్తానికే బెస్ట్ పికప్‌గా నిలిచాడు. లీగ్ సగటు ఎకానమీ రేటు 10.26గా నమోదై, బౌలర్లకు చుక్కలు కనిపించిన ఈ సీజన్‌లో హోల్డర్ కేవలం 7.34 ఎకానమీతో 8 మ్యాచ్‌ల్లోనే 13 వికెట్లు పడగొట్టాడు. కష్టసమయాల్లో జట్టుకు అండగా నిలుస్తూ ప్రత్యర్థి భాగస్వామ్యాలను దెబ్బతీశాడు. ఒక విశ్లేషణ ప్రకారం, రూ. 7 కోట్ల పెట్టుబడికి హోల్డర్ ఏకంగా రూ. 11.98 కోట్ల విలువైన ప్రదర్శనను జట్టుకు తిరిగించాడు. అంటే గుజరాత్‌కు దాదాపు రూ. 4.98 కోట్ల నికర లాభం చేకూరింది.
గ్రీన్ ప్రదర్శన బాగున్నా.. ఆ ధరతోనే కష్టాలు..!
కోల్‌కతా ఆటగాడు కేమరాన్ గ్రీన్ 322 పరుగులు, 7 వికెట్లతో పర్వాలేదనిపించినా, అతనికి పెట్టిన రూ. 25.20 కోట్ల ధరకు ఆ ప్రదర్శన ఏమాత్రం సరిపోలేదు. అతని ఆట విలువ రూ. 12.71 కోట్లుగా తేలింది, అంటే కేకేఆర్ అతడి వల్ల రూ. 12.49 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఇక గాయాల కారణంగా పతిరానా ఒకే ఒక్క మ్యాచ్ ఆడగా, లీమ్ లివింగ్‌స్టోన్ కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. వీరి కోసం ఖర్చు చేసిన దాదాపు రూ. 39.40 కోట్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. లక్నో సూపర్ జెయింట్స్ చివరి నిమిషంలో బరిలోకి దించిన జోష్ ఇంగ్లిస్ మాత్రమే ఐదు మ్యాచ్‌ల్లోనే 262 పరుగులు చేసి పెట్టిన ధరకు న్యాయం చేశాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
