అంతరిక్షంలో అద్భుతం.. చంద్రుడిపై మట్టిలో బంగాళదుంపల సాగు సక్సెస్!
చంద్రుడిపై మానవ నివాసాన్ని ఏర్పాటు చేయాలనే శాస్త్రవేత్తల కల సాకారమయ్యే దిశగా మరో కీలక అడుగు పడింది. జాబిల్లి ఉపరితలంపై ఉండే మట్టిని పోలిన కృత్రిమ మట్టిలో శాస్త్రవేత్తలు విజయవంతంగా బంగాళదుంపలను పండించారు. నాసా (NASA) సహకారంతో ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ ఘనత సాధించారు.

చంద్రుడిపై మానవ నివాసాన్ని ఏర్పాటు చేయాలనే శాస్త్రవేత్తల కల సాకారమయ్యే దిశగా మరో కీలక అడుగు పడింది. జాబిల్లి ఉపరితలంపై ఉండే మట్టిని పోలిన కృత్రిమ మట్టిలో శాస్త్రవేత్తలు విజయవంతంగా బంగాళదుంపలను పండించారు. భవిష్యత్తులో సుదీర్ఘకాలం పాటు చంద్రుడిపై ఉండే వ్యోమగాములకు అక్కడే ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునేందుకు ఈ ప్రయోగం మార్గం సుగమం చేయనుంది. నాసా (NASA) సహకారంతో ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. కృత్రిమంగా తయారు చేసిన ఐదు రకాల చంద్రుడి మట్టిలో.. త్వరగా పంటకు వచ్చే ‘మోడోక్’ (Modoc) రకం బంగాళదుంపలను సాగు చేసినట్టు వెల్లడించారు.
చంద్రుడి మట్టిలో సాగుకు సవాళ్లు..?
చంద్రుడి ఉపరితలం మొత్తం ‘రెగోలిత్’ (Regolith) అని పిలిచే పొడిబారిన రాళ్లు, దుమ్ముతో నిండి ఉంటుంది. భూమిపై ఉండే మట్టిలా ఇందులో ఎలాంటి సేంద్రియ పదార్థాలు ఉండవని.. ముఖ్యంగా మొక్కల పెరుగుదలకు అత్యవసరమైన నైట్రోజన్ ఇందులో అసలు కనిపించదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీనికి తోడు పంటలకు హాని చేసే రాగి వంటి హెవీ మెటల్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పరిశోధకులు ఒక వినూత్న ఆలోచన చేశారు. చంద్రుడి నమూనా మట్టిలో వానపాములతో తయారు చేసిన ‘వర్మీ కంపోస్ట్’ (సేంద్రియ ఎరువు) కలిపారు.
వర్మీ కంపోస్ట్ అనేది.. వానపాములు సేంద్రీయ వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా ఉత్పత్తి అయ్యే పోషకాలు అధికంగా ఉండే పదార్థం. అయితే కంపోస్ట్ కలపకుండా నాటిన మొక్కలకు అసలు వేర్లు గానీ, దుంపలు గానీ రాలేదట. కానీ కేవలం 5 శాతం వర్మీ కంపోస్ట్ కలపగానే మొక్కలకు వేర్లు వచ్చి దుంపలు ఊరడం మొదలయ్యాయని.. అదే 30 శాతం కంపోస్ట్ కలిపినప్పుడు భూమిపై పండిన బంగాళదుంపలతో సమానంగా దిగుబడి వచ్చినట్టు తెలిపారు. కాగా చంద్రుడి మట్టిలో నైట్రోజన్ ఉండదు కాబట్టి అదనపు పోషకాలు కలపకుండా అక్కడ ఏ పంటా పండదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అమెరిక్ గోయర్ స్పష్టం చేశారు.
జాబిల్లిపై ఆహార ఉత్పత్తి..
ఇక అంతరిక్ష యాత్రల్లో ఆహార అవసరాలు తీర్చడానికి బంగాళదుంపలు ఎంతో అనువైనవి. తక్కువ స్థలంలోనే ఎక్కువ కేలరీలను అందించడంతో పాటు ఇందులో పొటాషియం, విటమిన్-సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చంద్రుడిపైనే వీటిని పండించగలిగితే, భూమి నుంచి మోసుకెళ్లే ఆహార నిల్వల భారం వ్యోమగాములకు భారీగా తగ్గుతుంది. కృత్రిమ చంద్రుడి మట్టిలో పండిన ఈ బంగాళదుంపల్లో పోషక విలువలు ఏమాత్రం తగ్గలేదని పరీక్షల్లో తేలింది. దుంపల్లో సహజంగా ఉండే విషపూరిత పదార్థాల స్థాయి కూడా పెరగలేదు. అయితే, కొన్ని నమూనాల్లో భార లోహాల శాతం స్వల్పంగా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఈ ప్రయోగం అంతరిక్ష చరిత్రలో కీలక మలుపు అయినప్పటికీ, దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ సాగును నేరుగా చంద్రుడిపై కాకుండా, భూమిపై ఉన్న గ్రీన్‌హౌస్‌లో, కృత్రిమ మట్టిలో చేశారు. చిన్న కుండీలలో పెంచడం వల్ల పండిన బంగాళదుంపలు కేవలం 10 గ్రాముల కంటే తక్కువ బరువుతో చాలా చిన్నవిగా ఉన్నాయి. పెద్ద కుండీలలో పెంచితే మనం మార్కెట్లో చూసే సాధారణ సైజు బంగాళదుంపలు పండుతాయని.. ఆ దిశగా తదుపరి ప్రయోగాలు చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ బంగాళదుంపలను ల్యాబ్ పరీక్షలకు మాత్రమే ఉపయోగించామని, ఇంకా ఎవరూ రుచి చూడలేదని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.
