వీడియో గేమ్ కోసం ఆఫీసుకి డుమ్మా కొట్టకుండా కంపెనీయే ఇచ్చిన పెయిడ్ హాలిడే!
GTA 6 launch: ఉదయం ఆఫీసుకు వెళ్లాలి.. సాయంత్రం ఇంటికి వచ్చాకే గేమ్స్ ఆడాలి.. ఇదీ చాలా మంది ఉద్యోగుల పరిస్థితి. కానీ ఓ కంపెనీ మాత్రం ఉద్యోగుల కోసం ఈ రూల్‌ను మార్చేసింది. నచ్చిన వీడియో గేమ్ ఆడేందుకు ఏకంగా ఒక రోజు జీతంతోసెలవు ప్రకటించింది. అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7 వేల మంది ఉద్యోగులకు! GTA 6 కోసం ఎదురుచూస్తున్న గేమింగ్ ప్రియులకు ఈ వార్త నిజంగా పండగే. ఇంతకీ ఈ ఆఫర్ ఇచ్చిన కంపెనీ ఏది? ఉద్యోగులు ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవు తీసుకోవచ్చా?

Logi Game Day: సాధారణంగా ఉద్యోగులు ఆఫీసుకు సెలవు అడిగితే బాస్‌లు పని గురించి ప్రశ్నిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్! ఉద్యోగులు వీడియో గేమ్స్ ఆడేందుకు కంపెనీయే ప్రత్యేకంగా సెలవు ఇస్తోంది. పైగా ఆ రోజు జీతం కూడా కట్ చేయరు. ప్రముఖ టెక్నాలజీ సంస్థ లాజిటెక్ (Logitech) తన ఉద్యోగుల కోసం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా సంస్థలో పనిచేస్తున్న సుమారు 7 వేల మంది ఉద్యోగులకు ఒక రోజు అదనపు పెయిడ్ లీవ్ ప్రకటించింది. ఈ ప్రత్యేక సెలవుకు ‘లాగి గేమ్ డే’ (Logi Game Day) అని పేరు పెట్టింది. ఫుల్‌టైమ్ ఉద్యోగుల నుంచి ఇంటర్న్‌ల వరకు అందరికీ ఈ అవకాశం కల్పించింది. అంటే ఉద్యోగులు తమకు నచ్చిన వీడియో గేమ్ ఆడేందుకు ఒక రోజు ఆఫీసు పనులకు దూరంగా ఉండొచ్చు!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన గేమ్ GTA 6 దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ సిరీస్‌లో కొత్త గేమ్ నవంబర్ 19న లాంచ్ అయింది. గేమర్స్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే లాజిటెక్ తన ఉద్యోగులకు గేమింగ్ డే ప్రకటించింది. అయితే ఈ సెలవును GTA 6 ఆడటానికే ఉపయోగించాలనే నిబంధన లేదు. ఉద్యోగులకు నచ్చిన ఏ గేమ్ అయినా ఆడొచ్చు. తమకు అనుకూలమైన రోజున ఈ సెలవును తీసుకోవచ్చు. కాకపోతే 2027 నవంబర్‌లోపు దాన్ని వినియోగించుకోవాలి. అంటే GTA 6తో పాటు ఇతర గేమ్స్ ఆడాలనుకునే వారికి కూడా ఇది మంచి అవకాశం.
గేమ్స్ ఆడితే పెరిగే పని సామర్థ్యం
వీడియో గేమ్స్ అంటే సమయం వృథా చేయడమేనని చాలా మంది భావిస్తుంటారు. కానీ లాజిటెక్ ఆలోచన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గేమింగ్ వల్ల ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుందని కంపెనీ నమ్ముతుంది. లాజిటెక్ గేమింగ్ విభాగం జనరల్ మేనేజర్ రాబిన్ పిస్పానెన్ మాట్లాడుతూ, ఉద్యోగులు గేమ్స్ ఆడేందుకు వెచ్చించే సమయం, తిరిగి పనిలోకి వచ్చినప్పుడు వారి పనితీరును మెరుగుపరుస్తుంది అని అభిప్రాయపడ్డారు. నిరంతరం పని చేస్తూనే ఉండటం వల్ల గొప్ప ఫలితాలు రావని, మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ సరదాగా గడపడానికి కూడా సమయం ఉండాలని చెప్పారు.
కంపెనీ సీఈఓ హన్నెకే ఫేబర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గేమింగ్ అంటే సమయం వృథా చేయడమనే పాత ఆలోచనను వదిలేయాల్సిన సమయం వచ్చిందన్నారు. పని, ఆట.. ఈ రెండింటి మధ్య మంచి సమతుల్యత ఉంటే ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుందని అన్నారు.
బాస్‌లు సైతం గేమింగ్‌కు రెడీ!
ఈ గేమింగ్ సెలవు విషయంలో కంపెనీ ఉన్నతాధికారులు కూడా వెనక్కి తగ్గడం లేదు. లాజిటెక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మాటియో అన్వెర్సా తన సెలవు రోజున ఫోర్జా (Forza) గేమ్‌ను రేసింగ్ సిమ్యులేటర్‌తో ఆడాలని ప్లాన్ చేస్తున్నారు. చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఎలైన్ లైర్డ్ ఇప్పటికే తన సహోద్యోగులతో కలిసి బ్లాక్ బ్లాస్ట్ గేమ్‌లో పోటీపడుతున్నారు.
మరో మేనేజర్ తన భర్తతో జరిగే ఇంటి గొడవలను కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ద్వారా సరదాగా పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారు. ఇంకో ఉద్యోగి ఎల్డెన్ రింగ్ గేమ్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా ఒక్కొక్కరూ తమకు నచ్చిన గేమ్‌తో సెలవును ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
GTA 6 కోసం 15 లక్షల మంది ఉద్యోగులు సెలవు
గతంలో విడుదలైన GTA 5 ఇప్పటివరకు 23.5 కోట్లకు పైగా కాపీలు అమ్ముడైంది. ఇప్పుడు కొత్త గేమ్ కోసం అభిమానులు దాదాపు 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. దీంతో విడుదల రోజున చాలామంది ఉద్యోగులు ఆఫీసులకు డుమ్మా కొట్టారు. బార్సిలోనా ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ మోంటల్వో అంచనా ప్రకారం GTA 6 విడుదల రోజున అమెరికాలో దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవచ్చు. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు సుమారు 100 కోట్ల డాలర్ల మేర ఉత్పాదకత నష్టం వాటిల్లవచ్చని ఆయన అంచనా వేశారు. అయితే ఈ అంచనాపై మరో ఆర్థికవేత్త విక్టర్ మాథెసన్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ రోజు ఉద్యోగులు పనిచేయని గంటలను ఏడాదిలోని ఇతర రోజుల్లో భర్తీ చేసుకునే అవకాశం ఉందని అన్నారు.
మరోవైపు హెచ్ఆర్ సాఫ్ట్‌వేర్ సంస్థ బాంబూ హెచ్ఆర్ ప్రకారం.. నవంబర్ 19న సెలవుల కోసం వస్తున్న దరఖాస్తులు సాధారణ గురువారాలతో పోలిస్తే 9 నుంచి 17 శాతం పెరిగాయి. అమెరికాలోని కొన్ని సంస్థలు కూడా GTA 6 విడుదలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసాయి. కొన్ని చిన్న కంపెనీలు ఆ రోజు తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసాయి.
ఇక లాజిటెక్ సీఈఓ హన్నెకే ఫేబర్ నవంబర్ 19న శాన్‌జోస్‌లోని కంపెనీ కార్యాలయంలో జరిగే ప్రత్యేక గేమింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆఫీసునే గేమింగ్ లాంజ్‌గా మార్చి ఉద్యోగులతో కలిసి గేమ్స్ ఆడేలా ఏర్పాట్లు చేసారు. సాధారణంగా గేమ్స్ ఆడేందుకు సెలవు కావాలని ఉద్యోగులు బాస్‌లను అడుగుతారు. కానీ ఇక్కడ మాత్రం బాస్‌లే సెలవు ఇచ్చి మరీ గేమ్స్ ఆడమంటున్నారు. మరి మన దగ్గర కూడా ఇలాంటి ఆఫర్ ఇస్తే ఎంతమంది ఉద్యోగులు ఎగిరి గంతేస్తారో!