ఫుల్లుగా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు.. డైలీ ఒక్కటి తింటే రోగాలు కూడా భయపడతాయ్..
చలికాలంలో విరివిగా లభించే ఆరెంజ్ పండ్లలో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తికి మద్దతు లభిస్తుంది. చర్మం, గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. జ్యూస్ కంటే పండును నేరుగా తినడం మంచిది. ఆరెంజ్ తొక్కలతోనూ కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వీటి పోషక విలువలు, ఇతర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

ఆరెంజ్ అనగానే చాలామందికి నోరు ఊరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ పండు.. రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.. అందుకే, దీనిని సూపర్ ఫుడ్ గా పేర్కొంటారు. ఇవి కేవలం స్నాక్‌గా మాత్రమే కాకుండా, అనేక వంటకాల్లోనూ ఉపయోగించే ఒక ప్రముఖ పదార్థం.. ఇప్పుడు సంత్ర సీజన్ ప్రారంభమైంది. దీని ప్రయోజనాలు.. పోషకాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
ఆరెంజ్‌లో బోలెడంత ఫైబర్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో సుమారు 87% నీరు ఉంటుంది. విటమిన్ సి విషయానికి వస్తే, ఆరెంజ్‌లో ఇది పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అంతేకాకుండా, థయామిన్, విటమిన్ బి, ఫోలేట్, పొటాషియం వంటివి కూడా ఉంటాయి. కొద్దిపాటి ప్రొటీన్, సహజమైన చక్కెరలు ఉంటాయి. కొవ్వు చాలా తక్కువగా అంటే కేవలం 0.1% మాత్రమే ఉంటుంది. ఆరెంజ్‌లు సిట్రిక్ పండ్ల కోవలోకి వస్తాయి, వాటిలో ఉండే సిట్రిక్ ఆసిడ్ వల్ల వాటికి పుల్లని రుచి వస్తుంది.
రోగనిరోధక శక్తికి రక్షణ కవచం:
ఆరెంజ్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు, మినరల్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వీటిని తమ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటారు. చాలామంది ఆరెంజ్ జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటారు. అయితే, జ్యూస్ కంటే పండును నేరుగా తినడం మంచిది. ఎందుకంటే జ్యూస్‌లో ఫైబర్ కోల్పోతాము కాబట్టి, చక్కెర శాతం ఎక్కువగా ఉండి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ పండును తినడం వల్ల పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ప్రకృతి ఈ పండును ఎక్కువగా అందిస్తుంది. ఆరెంజ్‌లు తింటే జలుబు చేస్తుందని చాలామంది అనుకుంటారు, కానీ అది అపోహ మాత్రమే. విటమిన్ సి రోగనిరోధక శక్తికి చాలా అవసరం, ఇది జలుబు, ఫ్లూ వంటి సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి చలికాలంలో ఆరెంజ్‌లను అస్సలు మిస్ చేసుకోవద్దు.
చర్మానికి, జుట్టుకు మేలు:
చలికాలంలో చర్మం, జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తాయి. చర్మం పొడిబారి, నిర్జీవంగా మారుతుంది. ఆరెంజ్‌లలో ఉండే విటమిన్ సి (ఆస్కార్బిక్ ఆసిడ్) చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల వృద్ధాప్య లక్షణాలైన సన్నని గీతలు, ముడతలు తగ్గుతాయి. అంతేకాకుండా, సీతాఫలం వంటి సీజనల్ పండ్లతో పాటు ఆరెంజ్‌లను కూడా ఆహారంలో చేర్చుకుంటే చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చు:
ఆరెంజ్‌లను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి కూడా రక్షణ పొందవచ్చు. ఇందులో ఉండే ఆస్కార్బిక్ ఆసిడ్, బీటా కెరోటిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో పెరిగే అనవసరమైన కణాల పెరుగుదలను తగ్గిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. తద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
ఇతర ప్రయోజనాలు: ఆరెంజ్‌లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లతో పాటు ఫ్లేవనాయిడ్స్ కూడా మంచి నిద్రకు, జ్ఞాపకశక్తిని పెంచడానికి, నేర్చుకునే సామర్థ్యాన్ని వృద్ధి చేయడానికి దోహదపడతాయి. మంచి నిద్ర మనిషికి చాలా ముఖ్యం, అది మానసిక, శారీరక ఆరోగ్యానికి మూలం.
ఆరెంజ్ తొక్కల అద్భుతాలు:
ఆరెంజ్ పండు తొనలతో పాటు దాని తొక్కలు కూడా అనేక ప్రయోజనాలను అందిస్తాయి. తొక్కలను పారేయకుండా ఎండబెట్టి పొడి చేసి, సున్నిపిండిలో కలిపి లేదా ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇది బ్లాక్ హెడ్స్, మొటిమలు, డార్క్ సర్కిల్స్, పొడి చర్మం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
రోజువారీ ఆహారంలో ఆరెంజ్:
ప్రతిరోజూ ఒక గ్లాసు ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ అల్పాహారంతో తీసుకోవడం వల్ల తక్షణ శక్తితో పాటు మానసిక ఉత్సాహం లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఆరెంజ్ పండు అందరూ ఇష్టపడే రుచికరమైన పండు. ఇది చాలా చౌకగా, సులభంగా లభిస్తుంది. కాబట్టి ఈ సీజన్లో ఆరెంజ్‌లను తప్పకుండా మీ డైట్లో భాగం చేసుకోండి. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
