నెమలి జాతీయ పక్షిగా ఎలా మారింది..? చాలామందికి తెలియని చరిత్ర ఇదే..
నెమలి భారతదేశ జాతీయ పక్షిగా ఎలా మారింది? అనే ఆలోచన ఎప్పుడైన వచ్చిందా..? దానిని జాతీయ పక్షిగా ఎంపిక చేసే ప్రక్రియ అంత సులభంగా జరగలేదు. 1960లో టోక్యోలో జరిగిన ఓ సమావేశంలో పుట్టిన ఈ ఆలోచన, 1963 ఫిబ్రవరి 1న కార్యరూపం దాల్చింది. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు, సాంస్కృతిక ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నెమలిని ఎంపిక చేయడానికి వెనుకున్న అసలు కారణాలు ఇవే..

భారతదేశ జాతీయ పక్షి అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది అందమైన నెమలి. అయితే నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించే నిర్ణయం అంత సులభంగా జరగలేదు. ఈ రేసులో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, సారస్ క్రేన్ వంటి పలు పక్షులు పోటీపడ్డాయి. మరి అన్నింటినీ కాదని నెమలినే ఎందుకు ఎంచుకున్నారు? 1963లో తీసుకున్న ఆ చారిత్రక నిర్ణయం వెనుక ఉన్న కారణాల గురించి చాలా మందికి తెలియవు. జాతీయ పక్షిని ఎంపిక చేయాలనే ఆలోచన 1960 మే నెలలో టోక్యోలో జరిగిన అంతర్జాతీయ పక్షి సంరక్షణ మండలి సమావేశంలో మొదలైంది. భారత్‌లో ఈ బాధ్యతను అప్పటి మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడియార్ అధ్యక్షతన ఉన్న ఇండియన్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్‌కు అప్పగించారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను, ప్రజల మనోభావాలను సేకరించారు. ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ, అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సంరక్షణ దృష్ట్యా దాన్ని జాతీయ పక్షిగా చేయాలని సూచించారు. సారస్ క్రేన్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. కానీ సుదీర్ఘ చర్చల తర్వాత నెమలి వైపే మొగ్గు చూపుతూ 1963 ఫిబ్రవరి 1న అధికారిక ప్రకటన చేశారు.
నెమలిని ఎంచుకోవడానికి గల 5 కారణాలు..
దేశవ్యాప్త ఉనికి: జాతీయ చిహ్నం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదు. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కొన్ని ప్రాంతాలకే పరిమితం కాగా, నెమలి దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో.. అడవులు, గ్రామాలు, పొలాల్లో ప్రజలకు సుపరిచితమైన పక్షి.
సామాన్యులు సైతం సులభంగా గుర్తించడం: ఎంపిక చేసే పక్షిని సాధారణ ప్రజలు కూడా ఇట్టే గుర్తుపట్టాలని బోర్డు భావించింది. నీలిరంగు మెడ, తలపై విసనకర్ర లాంటి కిరీటం, కంటి కింద తెల్లటి మచ్చ, అందమైన పొడవాటి పురివిప్పే తోకతో నెమలి ప్రత్యేకంగా కనిపిస్తుంది.
పురాణాలు, సంస్కృతిలో ప్రాధాన్యత: భారతీయ సంప్రదాయంలో నెమలికి విశిష్ట స్థానం ఉంది. హిందూ పురాణాల ప్రకారం ఇది కార్తికేయుని వాహనం. శ్రీకృష్ణుని కిరీటంలోని నెమలి ఈక భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వంలో ఒక భాగం.
కళలు, వాస్తుశిల్పంలో చరిత్ర: శతాబ్దాలుగా ఆలయ శిల్పకళ, వస్త్ర డిజైన్లు, పురాతన నాణేలు, తపాలా బిళ్ళలలో నెమలి ఆకృతిని ఉపయోగిస్తున్నారు. ఇది కేవలం పక్షి మాత్రమే కాదు, మన దేశ కళా సంప్రదాయాలకు నిదర్శనం.
అందం, గౌరవం, జాతీయ స్ఫూర్తి: వర్షపు మేఘాలను చూసి పురివిప్పి నాట్యం చేసే నెమలి భారతీయ జానపద కథలు, నృత్య కళలలో భాగమైంది. దీన్ని అందం, గౌరవం, గర్వానికి చిహ్నంగా పరిగణిస్తారు.
జాతీయ పక్షి హోదా తర్వాత పెరిగిన రక్షణ
జాతీయ పక్షిగా ప్రకటించిన తర్వాత నెమలికి చట్టపరమైన రక్షణ మరింత బలోపేతమైంది. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్-1లో నెమలిని చేర్చారు. పులులకు ఉండే అత్యున్నత చట్టపరమైన రక్షణ నెమలికి కూడా వర్తిస్తుంది. వీటిని వేటాడితే కఠిన శిక్షలు ఉంటాయి. అంతేకాకుండా నెమలి ఈకలు, వాటితో తయారు చేసిన ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభుత్వం పూర్తి నిషేధం విధించింది.
