Free Wi-Fi వాడుతున్నారా? ఈ ఒక్క పొరపాటు మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోవడం గ్యారెంటీ
ప్రయాణాల్లో ఉన్నప్పుడు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, కాఫీ షాపులకు వెళ్లినప్పుడు ఉచిత Wi-Fi కనిపిస్తే చాలామంది వెంటనే కనెక్ట్ అవుతుంటారు. మొబైల్ డేటా ఆదా అవుతుందనే ఉద్దేశంతో ఎలాంటి ఆలోచన లేకుండా అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తారు. అయితే ఉచితంగా ఇంటర్నెట్ అందించే ప్రతి Wi-Fi సురక్షితమైనది కాదు. కొన్ని నెట్‌వర్క్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది. ముఖ్యంగా పాస్‌వర్డ్‌లు, ఈ-మెయిల్ వివరాలు, బ్యాంకింగ్ సమాచారాన్ని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కూడా అవసరమవుతోంది. ఇంట్లో ఉపయోగించే Wi-Fiతో పోలిస్తే బహిరంగ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే నెట్‌వర్క్‌ల భద్రత ఒకేలా ఉండకపోవచ్చు. తెలియని వ్యక్తులు ఉపయోగించే నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావడం వల్ల కొన్ని సందర్భాల్లో మన డేటా ప్రమాదంలో పడుతుంది. అందుకే ఫ్రీ Wi-Fi ఉపయోగించే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం ముఖ్యం.
పబ్లిక్ Wi-Fiతో డేటా ఎలా దొంగిలిస్తారు?
పబ్లిక్ Wi-Fiలో ఎదురయ్యే ప్రమాదాల్లో మ్యాన్-ఇన్-ది-మిడిల్ (Man-in-the-Middle) దాడి ఒకటి. ఈ విధానంలో హ్యాకర్లు వినియోగదారుడి ఫోన్‌కు, ఇంటర్నెట్‌కు మధ్యలో తమ పరికరాన్ని ఏర్పాటు చేసి సమాచారాన్ని గమనించేందుకు ప్రయత్నిస్తారు. నెట్‌వర్క్‌లో సరైన భద్రత లేకపోతే మనం పంపే డేటా వారి చేతికి చిక్కే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సురక్షితం కాని వెబ్‌సైట్లలో పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత వివరాలు నమోదు చేయడం ప్రమాదకరం. అయితే HTTPS వంటి ఎన్‌క్రిప్షన్ ఉన్న వెబ్‌సైట్లు సమాచారాన్ని రక్షించడంలో సహాయపడతాయి.
మరో ప్రమాదం నకిలీ Wi-Fi నెట్‌వర్క్‌లు. హ్యాకర్లు హోటల్, రైల్వే స్టేషన్ లేదా కాఫీ షాప్‌లోని అసలు Wi-Fi పేరును పోలిన నకిలీ నెట్‌వర్క్‌ను సృష్టించవచ్చు. పేరులో చిన్న తేడా గుర్తించకుండా దానికి కనెక్ట్ అయితే మన సమాచారాన్ని దొంగిలించేందుకు ప్రయత్నించవచ్చు. కొన్ని సందర్భాల్లో నకిలీ లాగిన్ పేజీల ద్వారా పాస్‌వర్డ్‌లు సేకరించడం, హానికరమైన వెబ్‌సైట్లకు మళ్లించడం వంటి చర్యలకు పాల్పడవచ్చు.
జాగ్రత్తలు తప్పనిసరి!
పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అయినప్పుడు బ్యాంకింగ్ లావాదేవీలు, ఆన్‌లైన్ షాపింగ్, కార్డు వివరాల నమోదు వంటి ముఖ్యమైన పనులకు దూరంగా ఉండటం మంచిది. అత్యవసరమైన ఆర్థిక లావాదేవీలు చేయాల్సి వస్తే సొంత మొబైల్ డేటాను ఉపయోగించాలి. అలాగే ఫోన్ సెట్టింగ్స్‌లో ఆటోమేటిక్ Wi-Fi కనెక్షన్ ఆప్షన్‌ను నిలిపివేయాలి. తెలియని నెట్‌వర్క్‌లకు ఫోన్ దానంతట అదే కనెక్ట్ కాకుండా ఇది సహాయపడుతుంది.
కనెక్ట్ అయ్యే ముందు ఆ ప్రదేశంలోని సిబ్బందిని అడిగి అసలైన Wi-Fi పేరు తెలుసుకోవాలి. వెబ్‌సైట్ అడ్రస్ HTTPSతో ప్రారంభమవుతుందో లేదో చూడాలి. అయితే తాళం గుర్తు కనిపించినంత మాత్రాన ప్రతి వెబ్‌సైట్ నమ్మదగినదని భావించకూడదు. ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, సెక్యూరిటీ ఫీచర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. అవసరమైతే విశ్వసనీయ VPN సేవను ఉపయోగించవచ్చు. పని పూర్తయిన తర్వాత పబ్లిక్ Wi-Fi నుంచి డిస్‌కనెక్ట్ అవ్వాలి. ఉచిత ఇంటర్నెట్ కోసం వ్యక్తిగత సమాచారం, ఆర్థిక భద్రతను ప్రమాదంలో పెట్టకూడదు.
