AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా మాట అస్సలు వినడు.. వాళ్ల మాటే వింటాడు: ఆర్యవీర్‌పై సెహ్వాగ్ కామెంట్స్..!

Aaryavir Sehwag Batting: అండర్-19 ఆసియా కప్ 2026లో 361 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్న కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్‌పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ఇది అతడి క్రికెట్ ప్రయాణంలో ఆరంభం మాత్రమేనని, ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని వ్యాఖ్యానించాడు.

నా మాట అస్సలు వినడు.. వాళ్ల మాటే వింటాడు: ఆర్యవీర్‌పై సెహ్వాగ్ కామెంట్స్..!
Virender Sehwag Son Aaryavir
Venkata Chari
|

Updated on: Nov 19, 2026 | 8:31 PM

Share

Aaryavir Sehwag Batting: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ సాధించిన ఘనతపై సంతోషం వ్యక్తం చేశాడు. అండర్-19 ఆసియా కప్ 2026లో అద్భుతంగా రాణించిన ఆర్యవీర్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన అతడు ఏకంగా 361 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఆర్యవీర్ ప్రదర్శనతో భారత్ అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే తన కుమారుడి విజయంపై ఆనందం వ్యక్తం చేసిన సెహ్వాగ్.. అతడి ప్రయాణం ఇప్పుడే మొదలైందని, ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని సూచించాడు.

కొడుకు విజయంపై తండ్రిగా గర్వంగా ఉంది..!

సతాక్ 50 టెన్నిస్ బాల్ టోర్నమెంట్ సందర్భంగా ఎన్టీటీవీ మాట్లాడిన వీరేంద్ర సెహ్వాగ్.. తన కుమారుడి ప్రదర్శనపై స్పందించాడు. అండర్-19 ఆసియా కప్‌లో ఆర్యవీర్ అద్భుతంగా ఆడటం, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకోవడం తండ్రిగా తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపాడు.

అయితే, ఈ విజయంతోనే సంతృప్తి చెందకూడదని కుమారుడికి చెప్పినట్లు వెల్లడించాడు. “ఆర్యవీర్ అండర్-19 ఆసియా కప్‌లో బాగా ఆడి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నందుకు తండ్రిగా చాలా సంతోషంగా ఉంది. కానీ ఇది అతడి ప్రయాణంలో కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని, ఈ విజయంతోనే సంతృప్తి చెందవద్దని అతడికి చెప్పాను” అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

ఢిల్లీ అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఆర్యవీర్..!

ఆసియా కప్ టోర్నమెంట్ ముగిసిన తర్వాత ఆర్యవీర్ మరో కీలక బాధ్యత చేపట్టనున్నాడు. ఢిల్లీ రాష్ట్ర అండర్-19 జట్టు శిబిరంలో పాల్గొననున్నాడు. అక్కడ నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. అంతేకాదు.. ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించనున్నాడు. దీంతో అతడిపై మరింత బాధ్యత పెరగనుంది.

యువ క్రికెటర్‌గా అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా నాయకత్వ లక్షణాలను కూడా పెంపొందించుకోవాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

ఆర్యవీర్ షాట్లు చూస్తుంటే నా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి..!

తన కుమారుడి బ్యాటింగ్‌లో కొన్ని షాట్లు తనకు పాత రోజులను గుర్తుచేస్తున్నాయని సెహ్వాగ్ ఆసక్తికరంగా చెప్పాడు. ఆర్యవీర్ ఆడే కొన్ని షాట్లు తన యవ్వనంలో ఆడిన విధానాన్ని గుర్తు చేస్తున్నాయని తెలిపాడు.

అయితే తన కుమారుడి విజయానికి పూర్తి క్రెడిట్ అతడి కష్టానికే దక్కుతుందని పేర్కొన్నాడు. “అతడిని బ్యాటింగ్ చేస్తుంటే చూడటం ఆనందంగా ఉంటుంది. కొన్ని షాట్లు నా చిన్ననాటి రోజులను గుర్తుచేస్తాయి. అయితే అతడి విజయానికి పూర్తి క్రెడిట్ అతడి కష్టానికే దక్కుతుంది. నిజం చెప్పాలంటే అతడు నా మాటల కంటే ఎక్కువగా తన కోచ్‌ల మాటలు వింటాడు” అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.

కోచ్‌ల మార్గదర్శకత్వంలో మెరుగవుతున్న ఆర్యవీర్..!

ఆర్యవీర్ ఆటతీరు మెరుగుపడటంలో పలువురు కోచ్‌ల పాత్ర ఉందని సెహ్వాగ్ వివరించాడు. ముఖ్యంగా రాజు శర్మ వద్ద అతడు శిక్షణ తీసుకున్నాడని తెలిపాడు. ఆ తర్వాత బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో వివిధ కోచ్‌ల దగ్గర ఆటలోని కొత్త విషయాలను నేర్చుకున్నాడని చెప్పాడు.

అండర్-19 ఆసియా కప్ సమయంలోనూ మరో కోచ్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందాడని వెల్లడించాడు. ఇలా వివిధ కోచ్‌ల నుంచి నేర్చుకుంటూ తన ఆటను మెరుగుపరుచుకుంటున్నాడని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

ఆసియా కప్‌లో ఆర్యవీర్ విధ్వంసం.. 361 పరుగులు..!

అండర్-19 ఆసియా కప్ 2026లో ఆర్యవీర్ సెహ్వాగ్ బ్యాట్‌తో పరుగుల వరద పారించాడు. ఐదు మ్యాచ్‌ల్లో 361 పరుగులు చేసి టోర్నమెంట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 160 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఫైనల్‌లోనూ 58 పరుగులు చేసి జట్టు స్కోరుకు ఉపయోగపడ్డాడు.

ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలతో టోర్నీని ఘనంగా ముగించిన ఆర్యవీర్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. తండ్రి వీరేంద్ర సెహ్వాగ్‌లాగే దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే సెహ్వాగ్ చెప్పినట్లుగా.. ఇది ఆర్యవీర్ క్రికెట్ ప్రయాణంలో తొలి అడుగు మాత్రమే. భవిష్యత్తులో సీనియర్ క్రికెట్‌లోనూ ఇదే స్థాయిలో రాణిస్తాడో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us