అసలు కలలు ఎందుకు వస్తాయి.. మెదడులో ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
మనం కళ్లు మూస్తే ఒక ప్రపంచం.. కళ్లు తెరిస్తే మరో ప్రపంచం.. ప్రతి రోజూ రాత్రి నిద్రపోయాక మన మెదడు మనకు తెలియకుండానే ఒక అద్భుతమైన సినిమాను ప్రదర్శిస్తుంది. అవే కలలు. కొన్ని కలలు మనల్ని నవ్విస్తాయి, మరికొన్ని భయపెడతాయి. అసలు ఈ కలలు ఎక్కడి నుంచి వస్తాయి? మెదడు వీటిని ఎందుకు సృష్టిస్తుంది? చాలా కలలు మేల్కొన్న తర్వాత ఎందుకు గుర్తుండవు? అనే విషయాలు తెలుసుకుందాం..

ప్రతిరోజూ రాత్రి మనం నిద్రపోయాక ఒక కొత్త లోకంలోకి వెళ్తాం. అక్కడ వింత వింత సంఘటనలు, ఎమోషన్లు, పాత జ్ఞాపకాలు అన్నీ కలిసి ఒక కథలా కనిపిస్తాయి. కానీ కళ్ళు తెరవగానే ఆ కథ అంతా ఆవిరైపోతుంది. అసలు మెదడు ఈ కలలను ఎందుకు సృష్టిస్తుంది? వాటిని ఎందుకు భద్రపరుచుకోదు? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సైన్స్‌ను ది డైలీ వై విశ్లేషించింది. కలలు ఎక్కువగా REM (Rapid Eye Movement) అనే నిద్ర దశలో వస్తాయి. ఈ సమయంలో మన మెదడు మనం మేల్కొని ఉన్నప్పుడు ఎంత చురుకుగా ఉంటుందో, దాదాపు అంతే వేగంగా పనిచేస్తుంది. మెదడులోని జ్ఞాపకశక్తి, భావోద్వేగ కేంద్రాలు ఈ దశలో అత్యంత యాక్టివ్‌గా ఉంటాయి.
మెదడులో ఏం జరుగుతుంది?
కలలు కంటున్నప్పుడు మెదడులోని కొన్ని భాగాలు వింతగా ప్రవర్తిస్తాయి. హిప్పోకాంపస్ ఆ రోజు జ్ఞాపకాలను ప్రాసెస్ చేస్తే, అమిగ్డాలా భావోద్వేగాలను పర్యవేక్షిస్తుంది. అందుకే కలలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ తార్కిక ఆలోచనలను నియంత్రించే ఈ భాగం నిద్రలో తక్కువ చురుకుగా ఉంటుంది. అందుకే కలల్లో ఎంత అహేతుకమైన విషయాలు జరిగినా మనకు అవి నిజమే అనిపిస్తాయి. మెదడులోని లాజిక్ ఎడిటర్ పాక్షికంగా నిలిపివేయబడటమే దీనికి కారణం. ఒక రకంగా చెప్పాలంటే.. మెదడులోని లాజిక్ ఎడిటర్ నిద్రపోతుండగా.. ఎమోషనల్ డైరెక్టర్ సినిమా చూపిస్తుంటాడు.
కలలు ఎందుకు మర్చిపోతాం?
మనం రాత్రికి సగటున 4 నుండి 6 కలలు కంటాం. కానీ నిద్రలేవగానే అవి మాయమవడానికి ప్రధాన కారణాలు.. రసాయనాల లోపం: REM నిద్రలో మెదడులో నోర్‌ఎపినెఫ్రిన్ అనే రసాయన స్థాయిలు పడిపోతాయి. జ్ఞాపకాలను భద్రపరచడానికి ఇది చాలా ముఖ్యం. ఇది లేకపోవడం వల్ల మెదడు కలను అనుభవిస్తుంది కానీ సేవ్ చేయలేదు.
హిప్పోకాంపస్ విరామం: జ్ఞాపకాలను నిక్షిప్తం చేసే హిప్పోకాంపస్ ఈ సమయంలో పూర్తి స్థాయిలో పనిచేయదు.
వాస్తవ ప్రపంచం: మనం మేల్కొన్న వెంటనే మెదడు చుట్టూ ఉన్న శబ్దాలు, వెలుతురుపై దృష్టి పెడుతుంది. ఈ కొత్త సమాచారం బలహీనమైన కలల జ్ఞాపకాలను వేగంగా తుడిచివేస్తుంది.
కొన్ని కలలు ఎందుకు గుర్తుంటాయి?
ఒకవేళ మీరు నేరుగా REM నిద్ర దశ నుండే మేల్కొంటే.. ఆ కల మీకు స్పష్టంగా గుర్తుండే అవకాశం ఉంది. అలాగే చాలా బలమైన భావోద్వేగాలతో కూడిన కలలు లేదా మన వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉన్నవి అమిగ్డాలా ప్రభావం వల్ల మెదడులో కాస్త బలంగా ముద్రించబడతాయి.
కలల వల్ల ప్రయోజనం ఏంటి?
శాస్త్రవేత్తల ప్రకారం.. కలలు కేవలం ఊహలు మాత్రమే కాదు. అవి మన మెదడుకు ఒక ఎమోషనల్ థెరపీ లాంటివి. ఆ రోజంతా మనం ఎదుర్కొన్న ఒత్తిడిని, భావోద్వేగాలను ప్రాసెస్ చేయడానికి, మెదడులోని అనవసర సమాచారాన్ని క్లీన్ చేయడానికి కలలు సహాయపడతాయి. మనం మంచం దిగేలోపే మాయమైపోయే ఈ కలలు, మన మెదడు ఎంతటి అద్భుతమైన యంత్రమో మరోసారి నిరూపిస్తున్నాయి.
