AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భగవద్గీత: పత్ర, పుష్పాలను ప్రీతితో స్వీకరిస్తాను..శ్రీకృష్ణుడి గొప్ప ఆధ్యాత్మిక సందేశం

Bhagavad Gita Quotes: భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఖరీదైన కానుకలు, భారీ పూజలు అవసరం లేదని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్పష్టం చేశారు. ఒక పత్రం (ఆకు), పువ్వు, పండు లేదా కొద్దిగా నీటిని భక్తితో సమర్పించినా స్వీకరిస్తానని చెప్పారు. భగవద్గీతలోని 9వ అధ్యాయం, 26వ శ్లోకం ప్రతి ఒక్కరికీ అందించే గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఏమిటి? దేవుడికి భక్తి ముఖ్యమా? సంపద ముఖ్యమా? తెలుసుకుందాం.

భగవద్గీత: పత్ర, పుష్పాలను ప్రీతితో స్వీకరిస్తాను..శ్రీకృష్ణుడి గొప్ప ఆధ్యాత్మిక సందేశం
Bhagavad Gita
Janardhan Veluru
|

Updated on: Nov 27, 2026 | 1:58 PM

Share

భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఖరీదైన పూజలు, విలువైన కానుకలు, భారీ నైవేద్యాలు సమర్పించాల్సిన అవసరం లేదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టం చేశారు. తనకు భక్తితో సమర్పించే ఒక చిన్న ఆకు(పత్రం), పువ్వు, పండు లేదా నీటిని కూడా తాను స్వీకరిస్తానని చెప్పారు. భగవద్గీతలోని తొమ్మిదో అధ్యాయం, 26వ శ్లోకం (9.26) భక్తి తత్వంలోని ఈ గొప్ప విషయాన్ని తెలియజేస్తుంది. అసలు ఈ శ్లోకం అర్థం ఏమిటి? భగవంతుడికి సమర్పించే కానుకల కంటే భక్తి ఎందుకు ముఖ్యమైనది? తెలుసుకుందాం.

భగవద్గీత 9.26 శ్లోకం ఇదే

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |

తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః ||

శ్లోకం అర్థం

భగవద్గీతలోని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు భక్తికి ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు. ఎవరైనా సరే తనకు ఒక ఆకు(పత్రం), పువ్వు, పండు లేదా నీటిని స్వచ్ఛమైన మనసుతో, భక్తితో సమర్పిస్తే దానిని తాను సంతోషంగా స్వీకరిస్తానని చెబుతున్నారు పరమాత్ముడు.

భగవంతుడికి భక్తే ముఖ్యం.. సంపద కాదు!

భగవద్గీతలోని ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు భక్తులు సమర్పించే బంగారం, వజ్రాలు, ఆభరణాలు, ఖరీదైన కానుకల గురించి ప్రస్తావించలేదు. సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే ఆకు, పువ్వు, పండు, నీటిని మాత్రమే ప్రస్తావించారు. దీని వెనుక గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఉంది. భగవంతుడిని ఆరాధించడానికి, ప్రసన్నం చేసుకోవడానికి ఖరీదైన కానుకలు సమర్పించాల్సిన అవసరం లేదు. మీరు సంపన్నులై ఉండాల్సిన అవసరం లేదు. భారీ ఖర్చుతో పూజలు చేయలేని వారు కూడా తమకు అందుబాటులో ఉన్న చిన్న వస్తువులతో భగవంతుడిని ఆరాధించవచ్చు. మీకు స్వచ్ఛమైన మనసు, భక్తితో సమర్పించే చిన్న కానుకలను కూడా భగవంతుడు ఎంతో ప్రేమతో స్వీకరిస్తారు.

ఇక్కడ ప్రధానమైనది మనం సమర్పించే వస్తువు విలువ కాదు. దానిని ఎంతటి భక్తితో, ఎంతటి స్వచ్ఛమైన మనసుతో సమర్పిస్తున్నామన్నదే ముఖ్యం. అందుకే చాలా మంది తమ ఇళ్లలో పూజా సమయంలో తులసి దళం, ఒక పువ్వు లేదా కొద్దిగా నీటిని భగవంతుడికి సమర్పిస్తారు.

హిందూ సంప్రదాయంలో వివిధ దేవతలకు ప్రత్యేకమైన పత్రాలు, పుష్పాలు సమర్పించే ఆచారం ఉంది. శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడికి తులసి దళాలను సమర్పిస్తారు. పరమశివుడికి బిల్వపత్రాలను సమర్పిస్తారు. వినాయకుడికి గరికను సమర్పించడం సంప్రదాయం. ఆంజనేయస్వామికి తమలపాకును సమర్పిస్తారు. ఈ సమర్పణల్లో వస్తువుల కంటే వాటిని సమర్పించే భక్తి, శ్రద్ధకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

కుచేలుడి కథలోనూ ఇదే భక్తి సందేశం

శ్రీకృష్ణుడికి అత్యంత సన్నిహితుడైన బాల్యమిత్రుడు సుదాముడు (కుచేలుడు) పేద బ్రాహ్మణుడు. ఒకసారి తన మిత్రుడిని కలవడానికి ద్వారకకు వెళ్లినప్పుడు ఆయన తనతో పాటు అటుకుల మూటను తీసుకెళ్లాడు. అది చాలా చిన్న కానుక కావడంతో శ్రీకృష్ణుడికి ఇవ్వడానికి సుదాముడు సంకోచించాడు. కానీ శ్రీకృష్ణుడు ఎంతో ప్రేమతో ఆ అటుకులను స్వీకరించి ఆనందంగా తిన్నాడు. ఈ కథ భాగవత పురాణంలో కనిపిస్తుంది. భగవద్గీత 9.26లో శ్రీకృష్ణుడు చెప్పిన భక్తి సూత్రానికి కుచేలుడి కథ ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.

భగవద్గీత 9.27లో మరింత గొప్ప సందేశం

భగవద్గీత తొమ్మిదో అధ్యాయంలోని 27వ శ్లోకంలో కూడా శ్రీకృష్ణుడు భక్తి గురించి మరింత విస్తృతంగా వివరించారు. మనం చేసే ప్రతి పని, తినే ఆహారం, సమర్పించే కానుక, చేసే దానం, ఆచరించే తపస్సు అన్నింటినీ తనకు అర్పణగా భావించాలని సూచించారు. అంటే పూజా సమయంలోనే కాకుండా మన రోజువారీ జీవితంలో చేసే ప్రతి పనిని కూడా భగవంతుడికి అంకితం చేయాలన్నది ఈ శ్లోకంలోని అంతరార్థంగా ఉంది.

అందుకే..ప్రతిరోజూ ఉదయం పూజ సమయంలో ఒక పువ్వు, తులసి దళం లేదా కొద్దిగా నీటిని భగవంతుడికి సమర్పించవచ్చు. ప్రత్యేకమైన మంత్రాలు తెలియకపోయినా మనసులోని భావాన్ని మన భాషలోనే తెలియజేయవచ్చు. ఒకవేళ ప్రయాణంలో ఉండి పూజ చేయడానికి అవకాశం లేకపోయినా మనసులోనే భగవంతుడిని స్మరించుకుంటూ సమర్పణ భావనను కలిగి ఉంటే సరిపోతుంది. పూజ చేస్తున్నప్పుడు మనసు ఇతర ఆలోచనలతో నిండిపోకుండా, సమర్పించే వస్తువుపై, భగవంతుడిపై ఏకాగ్రత ఉంచడం ముఖ్యం.

మొత్తంగా భగవద్గీత 9.26 మనకు ఇచ్చే సందేశం ఒక్కటే. భగవంతుడిని చేరుకోవడానికి సంపద, హంగులు, ఆడంబరాలు అవసరం లేదు. స్వచ్ఛమైన హృదయం, నిజమైన భక్తి ఉంటే చాలు.

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే