Nasha Mukt Bharat: డ్రగ్స్ రహిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని మైత్రివనం వద్ద నిర్వహించిన ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. యువత, విద్యార్థులు ఈ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు ఈ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని కోరారు. మాదకద్రవ్యాల మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం భావితరాల భవిష్యత్తుకు సంబంధించినదని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని అమీర్‌పేట మైత్రివనం వద్ద నిర్వహించిన ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డితో పాటు 2017లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త, సైయెంట్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డితో కలిసి వేదికను పంచుకున్నారు.
యువత భాగస్వామ్యం కావాలి
డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంతో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని నాగార్జున అన్నారు. గత రెండు రోజులుగా ఈ పాదయాత్రను గమనిస్తున్నానని, ఇందులో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలంటే సమాజంలోని అన్ని వర్గాల సహకారం అవసరమని నాగార్జున అభిప్రాయపడ్డారు. యువత చురుగ్గా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ లక్ష్య సాధన కోసం కిషన్‌రెడ్డి చేస్తున్న కృషిని అభినందించాలని, ఆయనకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని సూచించారు.
యువత మత్తుకు బానిసలు కాకుండా.. దేశాన్ని మేల్కొలిపే శక్తిగా ఎదగాలి – సినీనటుడు సాయికుమార్
యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా, దేశాన్ని మేల్కొలిపే శక్తిగా ఎదగాలని ప్రముఖ సినీనటుడు సాయికుమార్ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద చెప్పిన “లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి” అనే సందేశాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ 3వ రోజు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతే దేశానికి రేపటి పౌరులని, వారిలో అపారమైన శక్తి, సామర్థ్యాలు ఉన్నాయని అన్నారు. యువత మత్తులో మునిగిపోయి నిద్రపోకుండా, సూర్యుడిలా దేశాన్ని మేల్కొలిపేలా తమ శక్తిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
విద్యార్థి దశ ఎంతో విలువైనదని, ఆ దశలో సరైన నిర్ణయాలు తీసుకోవడం కీలకమని పేర్కొన్నారు. తల్లిదండ్రులను ప్రేమించాలని, గురువులను గౌరవించాలని, దైవాన్ని ప్రార్థించాలని సూచించారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ కొన్ని హద్దులు, నియమాలు ఉంటాయని, వాటిని దాటకుండా తల్లిదండ్రుల మాట వినాలని, గురువులు చూపిన మార్గంలో నడవాలని సాయికుమార్ అన్నారు. ఈరోజు విద్యార్థులుగా ఉన్నవారిలో నుంచే రేపు మెగాస్టార్లు, సూపర్‌స్టార్లు, వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకునే ప్రతిభావంతులు ఎదుగుతారని సాయికుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో నిర్వహిస్తున్న ఈ ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో, యువత భవిష్యత్తు కోసం, నషా ముక్త్ భారత్ మరియు డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణం కోసం సినీ ప్రముఖులంతా తమ వంతు మద్దతు అందిస్తున్నారని తెలిపారు.
వేదికపై బీవీఆర్ మోహన్‌రెడ్డి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి భారత ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో విశేష సేవలు అందించారు. సైయెంట్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఇంజినీరింగ్ సేవల రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దేశంలో ఉన్నతస్థాయి డిజైన్, తయారీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. విద్య, సామాజిక సంక్షేమ రంగాల్లోనూ ఆయన సేవలు అందిస్తున్నారు. ఈ సేవలకు గుర్తింపుగా 2017లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
1990వ దశకంలో ఐటీ సేవలు ఒక కొత్త వ్యాపార రంగంగా ఎదిగినట్లే, బీవీఆర్ మోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ సేవల రంగానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని నిర్వాహకులు పేర్కొన్నారు. దేశీయంగా ఉన్నతస్థాయి సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్, తయారీ సామర్థ్యాలను పెంపొందించడంలో ఆయన కృషి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఉందని వివరించారు.
