Telangana: మందు ముడితే చెంపదెబ్బలతో తరిమికొడతారు..ఈ గ్రామం రూల్స్ తెలిస్తే అవాక్కే..
గుడుంబా, గంజాయి, కళ్లు , మద్యం వీటికి ఆ గ్రామంలో ఎంట్రీ లేదు. ఆ మత్తుపదార్థాలకు బానిసై విచక్షణ కోల్పోతే సంసారం వీధిలో పడతుంది. కుటుంబం అగౌరవం పాలవుతుంది. భవిష్యత్ అందకారం అవుతుంది. అలాంటి తప్పులు జరగకూడదు అంటే ఆ మత్తుకు మా గ్రామంలోకి ఎంట్రీనే ఉండకూడదని నిర్ణయం తీసుకుంది ఆ గ్రామం. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే ఏం చేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం..

తరతరాల సంప్రదాయాలను తూచ తప్పకుండా పాటిస్తుంది ఆ గ్రామం. చూడటానికి చిన్న గ్రామంగా కనిపిస్తున్న కట్టుబాట్లు , ఆచార వ్యవహారాలను పాటించడంలో మాత్రం దేనికి తీసిపోదు. ఇక ఆ గ్రామంలో నియమ నిబందనలు సైతం అంతే కఠినంగా అమలవుతాయి. ఆకతాయి చేష్టాలకు ఆ గ్రామంలో చోటు లేదు. మందు , విందులు అస్సలే నడవవు. ఇక మత్తు పదార్థాలతో జల్సా చేస్తామంటే ఊరుకోరు. చెడు అలవాట్లను ఆ గ్రాస్థులు సహించరు. ఒక వేళ కాదు కూడదు.. ఆ ఏం చేస్తారు అని కట్టుబాట్లను అతిక్రమించారా.. గ్రామ బహిష్కరణే.. అలా ఇలా కూడా కాదు.. ఊరంతా చెంప దెబ్బలతో చెడాపెడా వాయించి ఊరు నుండి వెళ్లగొట్టెస్తారు. అంతటి కఠిన నిబందనలు అమలవుతున్న గ్రామం గురించి తెలుసుకోవాలంటే ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లాల్సిందే.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఓ చిన్న ఆదివాసీ గ్రామం తుమ్మగూడ. ఇక్కడంతా గోండులే నివసిస్తారు. పశుసంపద, వ్యవసాయమే ఆధారం. ఈ గూడెంలో 110 కుటుంబాలు ఉండగా జనాభా 626 మంది. ఈ 110 కుటుంబాలది ఒకే మాట, ఒకే బాట.. ఐక్యంగా జీవించాలనేది ఈ గ్రామ సిద్దాంతం. ఈ గ్రామంలో ఏడేళ్లుగా కఠిన నిబంధన అమలవుతుంది. మద్యం మత్తు జోలికి వెళ్లకూడదని ఏడేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని తూ.చా తప్పకుండా పాటిస్తున్నారు ఇక్కడి జనాలు. పొరపాటు మద్యం తాగినా ఆ మైకంలో గొడవలకు పాల్పడిన ఊరి నుండి గ్రామ బహిష్కరణ వేటు వేస్తున్నారు. అది కూడా ఊరందరు కలిసి చెంప దెబ్బల దండన వేసి ఊరు నుండి వెళ్లగొట్టాలని కఠిననిర్ణయం తీసుకున్నారు. గొడవలకు తావీయకుండా ఉండాలనే ఆలోచనతో ఈ కఠిన నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు అక్కడి గ్రామ పెద్దలు.
అంతే కాదు గౌరవ మర్యాదలతో మెలగాలని.. పెద్దలను గౌరవించాలని.. భార్యాపిల్లలు, తల్లితండ్రులతో మర్యాదతో నడుచుకోవాలని సూచిస్తున్నారు. కాదు కూడదని నిర్లక్ష్యం గా వహిస్తే దండన తప్పదంటున్నారు. ఊరిలోనే కాదు వేరే గ్రామాలకు వెళ్లినా ఇదే నియమ నిబందనలు పాటించాలని సూచిస్తున్నారు గ్రామ పెద్దలు. మద్యం తాగి గొడవలు చేసినట్టు తెలిసినా.. బయట తాగి ఊరిలోకి వచ్చిన శిక్ష తప్పదంటున్నారు. ఒక వేళ తప్పు చేస్తే శిక్ష అనుభవించి తీరాల్సిందే అంటున్నారు. గ్రామస్థులెవరైనా మద్యం తాగి ఎక్కడైనా గొడవ చేసినట్లు తెలిస్తే మొదట గూడెం పెద్దల బృందం సదరు వ్యక్తికి నచ్చచెబుతుంది. మొదటి తప్పుగా భావించి క్షమాపణ చెప్పిస్తుంది. మళ్లీ తప్పు చేయనని రాతపూర్వకంగా రాయించుకుంటోంది.
సదరు వ్యక్తి పెద్దల నిర్ణయానికి విరుద్ధంగా మళ్లీ తాగినట్లు తేలితే మొదటి కట్టుబాటు నిర్ణయమైన నెల రోజుల పాటు గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం, సాయంత్రం పూట ప్రత్యేక పూజలు చేయిస్తుంది. సదరు వ్యక్తిలో మార్పు రావాలని కోరుకుంటుంది. రెండోసారి తప్పు చేస్తే రూ.5,051 జరిమానా విధిస్తుంది. ఇక మూడోసారి మళ్లీ తాగి గొడవ చేస్తే గూడెంలోని 110 కుటుంబాల్లోని ఇంటికొకరు చొప్పున వచ్చి చెంప దెబ్బ కొట్టి గ్రామ బహిష్కరణ చేసే నియమాన్ని పాటిస్తోంది. ఈ మూడు నియమాలను ఏడేళ్లుగా అమలు చేస్తుంది. అయితే ఈ ఏడేళ్లలో ఒకరు ఇద్దరు నిబందనలు అతిక్రమించడంతో శిక్షలు అమలు చేశామని.. ఆ తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా శిక్ష అర్హులు కాలేదని అక్కడి పెద్దలు చెప్తున్నారు.
ఆంక్షలు అమలు చేసిన తొలి ఏడాదిలో కొందరు మద్యం తాగారని తేలడంతో.. పెద్దల సమక్షంలో క్షమాపణలతోనే సమిసిపోయిందని.. చెంపదెబ్బలు కొట్టేదాకా ఎవరూ నియమాన్ని అతిక్రమించలేదు. గ్రామస్థులంతా కలిసి తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం తుమ్మగూడ గ్రామంలో ప్రశాంతత నెలకొంది. ఈ కట్టుబాట్లతో గ్రామంలో ఎవరూ మద్యం జోలికి పోవట్లేదని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకే మాట ఒకే బాటగా సాగుతున్నామని.. ఈ నియమం ఊరు ఉన్నంత వరకు ఉంటుందని చెప్తున్నారు. ఎంతైనా ఆదివాసులు అంటేనే ఆచారాలకు.. నియమ నిబందనలకు.. కట్టుబాట్లకు పెట్టింది పేరని రుజువు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
