Telangana: గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..
మాంజా మనుషుల ప్రాణాలు తీస్తుంది. ఇప్పటికే దీని వల్ల ఎంతో మంది ప్రాణాలు పోగా.. మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తాజాగా మేడ్చల్ జిల్లాలో కీసరలో నిషేధిత నైలాన్ మాంజా యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. అసలు ఏం జరిగింది..? ఇప్పుడు అతడి పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం..

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ పతంగి ప్రియుల ఉత్సాహం ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. నిషేధిత నైలాన్ మాంజా కారణంగా మేడ్చల్ జిల్లా కీసరలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కీసరకు చెందిన జశ్వంత్ మల్లిఖార్జున నగర్ కాలనీ మీదుగా వెళ్తుండగా గాలిలో తెగిపన మాంజా అకస్మాత్తుగా అతని మెడకు చుట్టుకుంది. దారం పదునుగా ఉండటంతో జశ్వంత్ మెడ భాగం తీవ్రంగా తెగిపోయింది. రక్తస్రావం ఎక్కువగా కావడంతో గమనించిన స్థానికులు హుటాహుటిన అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని మెడకు 19కుట్లు పడ్డాయి. ప్రస్తుతం జశ్వంత్ ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది.
విచ్చలవిడిగా మాంజా విక్రయాలు
ఈ ఘటనతో జశ్వంత్ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీసర పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, రహస్యంగా చైనీస్ మాంజా విక్రయిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమ కొడుకులాగా మరెవరూ ఇబ్బంది పడకూడదని, వెంటనే పోలీసులు స్పందించి ఈ ప్రమాదకరమైన మాంజా విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు.
మాంజా ప్రమాదాల వెనుక కారణాలు
సాధారణ దారానికి భిన్నంగా చైనీస్ మాంజాను నైలాన్ లేదా సింథటిక్ దారంతో తయారు చేస్తారు. దీనికి గాజు పొడి లేదా మెటల్ కోటింగ్ ఉంటుంది. ఇది తెగదు, సరిగ్గా మెడకు తగిలితే కత్తిలా కోసివేస్తుంది. ఈ దారం చెట్లపై, వైర్లపై చిక్కుకుని ఉండటం వల్ల పక్షుల రెక్కలు తెగి చనిపోతున్నాయి. మెటల్ కోటింగ్ ఉండటం వల్ల కరెంటు తీగలకు తగిలినప్పుడు విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం కూడా ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, తెలంగాణ ప్రభుత్వం నైలాన్ మాంజా వాడకాన్ని, విక్రయించడాన్ని పూర్తిగా నిషేధించాయి. అయినా దొంగచాటుగా కొంతమంది ఈ దారాన్ని విక్రయిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
