ఈ చిత్రం వెనక ఉన్న చరిత్ర గురించి మీకు తెలుసా? .. ఇది ఎక్కడుందంటే?
రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్ళిన తర్వాత రామేశ్వరం దగ్గర నుంచి శ్రీలంక వెళ్లేందుకు శ్రీరాముడు సముద్రాన్ని దాటాల్సి వచ్చింది. అయితే అప్పుడు శ్రీరాముడు సముద్రుడిని దారి ఇవ్వాలని కోరగా అక్కడికి వచ్చింది శ్రీరాముడు అని తెలియక సముద్రుడు శ్రీరాముడిని హేళన చేస్తాడంట. అప్పుడు శ్రీరాముడు సముద్రునికి గర్వభంగాన్ని కలిగిస్తాడు అనేది పురాణాలలో చెబుతుంది. ఇప్పుడు అందుకు సంబంధించిన ఓ శిల్పం వైరల్‌గా మారింది. ఇంతకు అదెక్కడుందో తెలుసుకుందాం పదండి.

వల్లూరు మండలంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన దక్షిణ కాశీ, పంచనదీ క్షేత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ గోడపై ఉన్న శ్రీరాముని పరాక్రమం సముద్రిని గర్వభంగాన్ని చూపే కళాత్మక శిల్పం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ కుడ్య శిల్పంలో ఎడమవైపు శ్రీరామచంద్రుడు కుడి వైపు పైన ఆకాశంలో రాయిని ఎత్తుకొని ఉన్న వానరుడు, క్రింద తలపై రాయిని ఎత్తుకొని ఉన్న ఇంకొక వానరుడు కనిపిస్తాడు. అతని వెనకాల సముద్రుడు వారి ధర్మపత్ని అంజలి ఘటిస్తూ వారి వాహనం మొసలిపై కూర్చున్న విధంగా శిల్పం కనిపిస్తుంది. అయితే రావాణాసురుడి వద్ద బందీగా ఉన్న సీతమ్మను తీసుకొచ్చేందుకు శ్రీరాముడు సముద్రాన్ని దాటే పరిస్థితి వచ్చింది. అప్పుడు రాముడు దారి ఇవ్వమని సముద్రుడిని కొరగా.. వచ్చినది పరాక్రమవంతుడైన శ్రీరామచంద్రుడని తెలియక సముద్రుడు మూడు రోజులపాటు ఆయన్ను నిరీక్షించేటట్లు చేస్తాడు. దీంతో సముద్రుని అహంకారాన్ని అనచాలని, శ్రీరామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాలని భావించగా ఆ దెబ్బకు సముద్రుడు బెదిరిపోయి రాముడికి దారి ఇస్తానని విన్న వించుకున్నాడనేది పురాణం.
అయితే ఆ పనిని విశ్వ కర్మ కుమారుడైన నలుడుకి సముద్రుడు చెప్పగా వానరుల సహాయంతో 800 నుంచి 1200 కిలోమీటర్ల పొడవు గల సేతును కట్టడం ఐదు రోజుల్లో పూర్తి చేశారనేది చరిత్ర. ఈ కుడ్య శిల్పంలో శ్రీరామచంద్రుడు అత్యంత పరాక్రమంతో కుడి,ఎడమ కాలును ముందుకు వంచి కుడి కాలును వెనుకకు జరిపి నొక్కి పట్టి ఉంచే ఆసనంతో నిలుచుని ఎడమ చేయి శిఖరముద్రతో విల్లుపట్టి కనిపిస్తాడు. పైనున్న వానరుడు రెండు చేతులు పైకి ఎత్తి కుడి చేతిలో రాయిని పట్టుకొని కుడి కాలు ముందుకు, ఎడమ కాలు వెనుకకు వంచి ఆకాశంలో ఉన్నట్లుగా కనిపిస్తాడు.
అలాగే మొసలిపై సముద్రుడు .. వెనుక వారి ధర్మపత్ని వారి ఎడమ కాలును వంచి కూర్చుని, రెండు చేతులు జోడించి అంజలి ముద్రలో సముద్రుడు వారి ధర్మపత్ని ముఖాలలో భయ భక్తులున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీరు ఇరువురు తలపై మకుటాన్ని ధరించి పెద్ద చెవులకు పెద్ద లోలాకులు, రెండు చేతులకు ముంజేతి వలయాలు, రెండు కాళ్లకు కడియాలు, నడుము నుంచి మోకాళ్ల వరకు పట్టు వస్త్రాలు ఆ వస్త్రాలపై అద్భుతమైన ఆకారాలను చెక్కారు. ఈ కుడ్యశిల్పం కళా రహస్యం, వైభవం, నాటి శిల్పుల మేధస్సుకు, పురాతన గ్రంథాలను రాతిపై చెక్కిన అద్భుతం.
మరిన్ని అథ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
