Weather Alert: బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం.. భారీ వర్షాలు?
ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ప్రాంతమైన తూర్పు-భూమధ్యరేఖ హిందూ మహా సముద్రంలో మంగళవారం (జనవరి 6) అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. అదే ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం వాయు గుండంగా బలపడింది. ఈ మేరకు నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారినట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది..

అమరావతి, జనవరి 7: బుధవారం (జనవరి 7వ తేదీన) ఉదయం 8.30 గంటలకు ఆగ్నేయ బంగాళాఖాతంలో అంటే 4.8° ఉత్తర అక్షాంశం, 88.2° తూర్పు రేఖాంశం వద్ద అల్ప పీడనం వాయుగుండంగా బలపడింది. పోట్స్‌విల్లే (శ్రీలంక)కి తూర్పు-ఆగ్నేయంగా 740 కి.మీ., బట్టికలోవాకు తూర్పు ఆగ్నేయంగా 790 కి.మీ (శ్రీలంక), ట్రింకోమలీకి తూర్పు-ఆగ్నేయంగా 880 కి.మీ (శ్రీలంక) కారైకాల్ (తమిళనాడు)కి ఆగ్నేయంగా 1150 కి.మీ మరియు చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 1270 కి.మీ. (తమిళనాడు) దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఇది వచ్చే 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాత ప్రాంతానికి కదిలే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణం ఏ విధంగా ఉంటుందో తెలిపింది.
- ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాంలలో ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
- దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో ఈరోజు, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కూడా పొడి వాతావరణమే ఏర్పడే అవకాశం ఉంది.
- రాయలసీమలో ఈరోజు, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
కాగా రాగల 5 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు ఉండబోదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మీ ప్రాంతంలో వచ్చే 3 రోజుల వాతావరణం తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




