AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson : సంజూ శాంసన్ ఎంట్రీ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే.. అసలు విషయం బయటపెట్టిన గౌతమ్ గంభీర్

Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026లో సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవడం వెనుక ఉన్న దూకుడు వ్యూహాన్ని కోచ్ గౌతమ్ గంభీర్ వివరించారు. పవర్‌ప్లేలో గరిష్ట విధ్వంసం సృష్టించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జియో స్టార్‌తో జరిగిన చర్చలో గంభీర్ టీమిండియా సరికొత్త బ్యాటింగ్ ఫిలాసఫీని విడమర్చి చెప్పారు.

Sanju Samson : సంజూ శాంసన్ ఎంట్రీ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే.. అసలు విషయం బయటపెట్టిన గౌతమ్ గంభీర్
Gautam Gambhir, Sanju Samson
Rakesh
|

Updated on: Mar 15, 2026 | 6:29 PM

Share

Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు సాధించిన అద్భుత విజయం వెనుక ఉన్న అసలు సిసలైన మాస్టర్ ప్లాన్‌ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తాజాగా బయటపెట్టారు. టోర్నీ మధ్యలో సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవడం వెనుక ఉన్న కారణాలను ఆయన వివరించారు. ఈ నిర్ణయం ఏదో ఒక బౌలర్‌ను ఎదుర్కోవడానికో లేదా లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసమో తీసుకున్నది కాదని, కేవలం అగ్రెసివ్ బ్యాటింగ్ కోసమేనని గంభీర్ స్పష్టం చేశారు. జియో స్టార్‌తో జరిగిన చర్చలో గంభీర్ టీమిండియా సరికొత్త బ్యాటింగ్ ఫిలాసఫీని విడమర్చి చెప్పారు.

భారత టాప్ ఆర్డర్‌లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నారని, ఆ క్రమాన్ని మార్చడానికే సంజూను తెచ్చారని వస్తున్న వార్తలను గంభీర్ కొట్టిపారేశారు. “గత ఏడాదిన్నర కాలంగా మా ఆలోచన ఒక్కటే.. క్రీజులోకి వెళ్ళామా, విధ్వంసం సృష్టించామా అన్నట్లుగా ఆడాలి. పవర్‌ప్లేలో మరింత దూకుడుగా ఉండాలనే ఉద్దేశంతోనే సంజూని బరిలోకి దింపాం. నా దృష్టిలో క్వాలిటీ బ్యాటర్ ఏ రకమైన బౌలర్నైనా ఎదుర్కోగలగాలి. ఆరు ఓవర్లలోనే ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ తీయడమే మా లక్ష్యం” అని గంభీర్ చెప్పుకొచ్చారు. సంజూ శాంసన్ తనదైన రోజున మొదటి ఆరు ఓవర్లలోనే మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగలడని కోచ్ ధీమా వ్యక్తం చేశారు.

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి టాప్-3 బ్యాటర్లు ఉండి, ఆ తర్వాత సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్ వంటి హిట్టర్లు ఉంటే అంతకంటే బలమైన బ్యాటింగ్ లైనప్ ఇంకేముంటుందని గంభీర్ ప్రశ్నించారు. అలాగే సంజూకు జట్టులో చోటు దక్కిన విషయాన్ని ఎంతో క్యాజువల్‌గా చెప్పినట్లు గంభీర్ వెల్లడించారు. జింబాబ్వే మ్యాచ్‌కు ముందు జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సమయంలో.. రేపు నువ్వు ఆడుతున్నావు సంజూ అని చెబితే, సంజూ కూడా అంతే కూల్‌గా రానివ్వండి చూసుకుందాం అని బదులిచ్చినట్లు గంభీర్ గుర్తు చేసుకున్నారు. కోచ్-ప్లేయర్ లా కాకుండా ఒక స్నేహితుడిలా తాను ఆటగాళ్లతో ఉంటానని ఆయన తెలిపారు.

యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై వస్తున్న విమర్శలకు కూడా గంభీర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. 2014 ఐపీఎల్‌లో వరుసగా మూడు సార్లు డకౌట్ అయిన తన వ్యక్తిగత అనుభవాన్ని గుర్తు చేస్తూ అభిషేక్ కు ధైర్యం చెప్పారు. “నువ్వు ఫామ్‌లో లేవని జనం అంటారు, కానీ నువ్వు కేవలం పరుగులు మాత్రమే చేయలేకపోతున్నావు. క్రీజులో 20-30 బంతులు ఆడితే తప్ప ఎవరి ఫామ్‌ను జడ్జ్ చేయలేం. లోకం ఏమనుకుంటుందో నీకు అనవసరం, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న 30 మంది నీ గురించి ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం. మొదటి బంతికే సిక్స్ కొట్టాలనిపిస్తే ఏమాత్రం సంకోచం లేకుండా కొట్టేయ్” అని అభిషేక్‌కు గంభీర్ పిలుపునిచ్చారు. టీమిండియా సాధించిన ఈ ప్రపంచకప్ విజయంలో ప్రతి ఆటగాడిపై మేనేజ్‌మెంట్ కు పూర్తి నమ్మకం ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

Follow Us