AP Budget 2023-24: అన్నదాతలకు అండగా జగన్ సర్కార్.. వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు..

పలికేది భాగవతమట, పలికించె వాడు రామభద్రుడంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తన ఐదో బడ్జెట్‌లో అసెంబ్లీ ముందుంచారు. స్వామి వివేకానంద చూపిన మార్గంలో తమ ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు.

AP Budget 2023-24: అన్నదాతలకు అండగా జగన్ సర్కార్.. వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు..
Ys Jagan
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 20, 2023 | 3:50 PM

సంక్షేమం, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య రంగాలకు భారీ కేటాయింపులు ప్రతిపాదిస్తూ రెండు లక్షల 80 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రైతు లేనిదే రాజ్యం లేదని నమ్మిన ప్రభుత్వం తమదని ప్రకటించిన ఆర్థిక మంత్రి, అన్నదాతల ఆదాయం పెంచడంపై దృష్టి సారించినట్టు తెలిపారు. పలికేది భాగవతమట, పలికించె వాడు రామభద్రుడంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తన ఐదో బడ్జెట్‌లో అసెంబ్లీ ముందుంచారు. స్వామి వివేకానంద చూపిన మార్గంలో తమ ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు. మరో వైపు బడ్జెట్‌ను నిరసిస్తూ విపక్ష టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగి నినాదాలు చేపట్టారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ జోక్యం చేసుకొని బడ్జెట్‌ ప్రసంగానికి అడ్డుతగిలిన విపక్ష సభ్యులను సభ నుంచి పంపించాలని కోరారు. ఈ క్రమంలో 14 మంది టీడీపీ సభ్యులను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు.

ఆ తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ప్రభుత్వపు చివరి బడ్జెట్‌ ఇది కావడంతో కొత్త పన్నులేవి విధించకుండా సంక్షేమ పథకాలకు కేటాయింపులపైనే ఆర్థిక మంత్రి దృష్టి సారించారు. జీవనోపాధి, సామర్ధ్య పెంపుదల, సాధికారత, సామాజిక భద్రత, మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధి అనే నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకొని బడ్జెట్‌ కేటాయింపులు చేపట్టినట్టు బుగ్గన వివరించారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. రాష్ట్రంలో 62 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని ఆర్థిక మంత్రి తెలిపారు. రైతు లేనిదే రాష్ట్రం లేదని విశ్వసించే ప్రభుత్వం తమదని ప్రకటించారు. జలవనరులు, విద్యా, వైద్యం, ఆరోగ్య రంగాలు, పెన్షన్లకు భారీగా కేటాయింపులు జరిపారు. వ్యవసాయ రంగానికి రూ.11,589 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసా రూ.4,020 కోట్లు, నీటి వనరుల అభివృద్ధికి 11,908 కోట్ల రూపాయలు, వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కోసం 21,434.72 కోట్ల రూపాయలు కేటాయించారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ కోసం బ‌డ్జెట్‌లో రూ.1,212 కోట్లు కేటాయించారు. నగదు బదిలీ పథకాలకు మొత్తంగా బడ్జెట్‌లో 54 వేల 228.36 కోట్ల రూపాయలు కేటాయించారు. బీసీ సంక్షేమానికి 38,605 కోట్లను ప్రతిపాదించారు.

మహిళల కోసం..

మహిళల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి సభలో నవ్వులు పూయించారు ఆర్థిక మంత్రి బుగ్గన. మహిళ సాధికారతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. స్థూలవృద్ధిలో 11.43 శాతం వృద్ధితో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందని బుగ్గన తెలిపారు. దాదాపు గంటా 40 నిమిషాల సేపు బడ్జెట్‌ ప్రసంగం చేసిన బుగ్గన అనేక మంది ప్రముఖుల మాటలను ప్రస్తావించారు. రవీంద్రనాథ్‌ రాగూర్‌, రుడ్‌యార్డ్‌ కిప్లింగ్‌, లూయిస్‌ పాశ్చర్‌, అబ్దుల్‌ కలాం, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, అంబేడ్కర్‌, వంగారి మథాయ్‌ బెంజమిన్‌ డిస్రెలి, అమెరికా మాజీ అధ్యక్షులు థామస్‌ జెఫర్సన్‌, జాన్‌ ఎఫ్‌ కెనడీ మాటలను ఈ ప్రసంగంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..