Jammalamadugu: కూటమి శ్రేణుల్లో జోష్.. కడప- జమ్మలమడుగు స్థానాల మార్పు వర్కవుట్ అయ్యేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న ప్రతిపక్ష పార్టీలు, పక్కా వ్యుహం అమలు చేస్తున్నాయి. కడప- జమ్మలమడుగు స్థానాల్లో కుండమార్పిడి జరగనుంది. ఇందుకోసం మూడంచెల వ్యూహాన్ని అనుసరించనున్నారు టీడీపీ-బీజేపీ అభ్యర్థులు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న ప్రతిపక్ష పార్టీలు, పక్కా వ్యుహం అమలు చేస్తున్నాయి. కడప- జమ్మలమడుగు స్థానాల్లో కుండమార్పిడి జరగనుంది. ఇందుకోసం మూడంచెల వ్యూహాన్ని అనుసరించనున్నారు టీడీపీ-బీజేపీ అభ్యర్థులు.
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పొత్తుల్లో భాగంగా కడప ఎంపీ టికెట్ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న భూపేష్‌రెడ్డికిచ్చింది టీడీపీ అధిష్టానం. జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డికి టికెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. అయితే జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ ఆశించిన భూపేష్ అవసరమైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగానైనా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. దీనికి తోడు తనకు కడప ఎంపీ సీటు ఇస్తే బాగుంటుందని ఆది నారాయణ రెడ్డి ఇప్పటికే బీజేపీ అధిష్టానానికి సూచించారు. ఈ తరుణంలో కడప ఎంపీ స్థానం బీజేపీకి ఇచ్చి జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ టీడీపీ తీసుకోవడంపై సమాలోచనలు జరుగుతున్నాయి.
అయితే ఈ కుండమార్పిడి కోసం మూడంచెల వ్యూహాన్ని అనుసరించాలని భూపేష్ రెడ్డి- ఆది నారాయణ రెడ్డి నిర్ణయించుకున్నారు. వాస్తవానికి భూపేష్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడే. దీంతో బాబాయ్ – అబ్బాయ్ తొలుత కుటుంబాల మధ్య చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత పార్టీల అధిష్టానాలతో చర్చించనున్నారు. చివరకు అధికారిక ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నారు.
2004, 2009లలో జమ్మలమడుగు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు ఆది నారాయణరెడ్డి. అనంతరం వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2016, ఫిబ్రవరిలో టీడీపీలో చేరిపోయారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర పశుసంవర్ధక, సహకారశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2019లో బీజేపీలో చేరారు నారాయణ రెడ్డి. అప్పటి నుంచి ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
టీడీపీకి చెందిన భూపేష్ రెడ్డి కొంతకాలంగా జమ్మలమడుగులో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్‌లో క్యాడర్‌ను బలోపేతం చేసుకుని తన వ్యూహాలను అమలు చేస్తున్నారు. కొన్ని మండలాల్లో తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో భూపేష్ రెడ్డి రాజకీయంగా ఎదగాలని ఆదినారాయణ రెడ్డి కూడా కోరుకున్నారు. రెండు మూడు సందర్భాలలో ఆదినారాయణ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు.
కడప జిల్లాలో సత్తా చాటాలని టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి యోచిస్తుండగా, కడప ఎంపీ అభ్యర్థిగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఎంట్రీ ఇచ్చారు. దీంతో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డితో పోటీ పడబోతున్నారు వైఎస్ షర్మిల. ఈ తరుణంలో ఓట్లు చీలి తమకు లాభిస్తుందని టీడీపీ-బీజేపీ యోచిస్తోంది. కడపతో పాటు జమ్మలమడుగు స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ-బీజేపీ వ్యూహం రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే కుండమార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
కుండమార్పిడికి బాబాయ్ ఆదినారాయణ రెడ్డి, అబ్బాయ్ భూపేష్ రెడ్డి అంగీకరిస్తే మరో ఎంపీ సీటు బీజేపీకి పెరగనుంది. టీడీపీకి మరో అసెంబ్లీ సీటు దక్కనుంది. రెండు పార్టీలకూ మేలు జరిగే అవకాశం ఉండటంతో కూటమి శ్రేణుల్లో జోష్ నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..