Inspiring Story: చదువుకోవాలంటే కావాల్సింది సౌకర్యాలు కాదు..కృషి పట్టుదలే.. అందుకు సాక్ష్యం ఈ పోలీస్ ఆఫీసర్
చదువుకు ఉన్న గొప్పతనం ఏంటో తన జీవితమే ఒక ఉదాహరణ అంటున్నారు అనంతపురం జిల్లా అడిషనల్ ఎస్పీ హనుమంతరావు. ఓ స్కూల్ లో పిల్లలకు చదువు యొక్క గొప్పతననాన్ని వివరిస్తూ.. చిన్నప్పుడు తాను పడ్డ కష్టాలను చెప్పారు. చదువుకుంటే తప్ప భవిష్యత్ లేదని గ్రహించి.. బిక్షాటన చేసుకుని కడుపునింపుకునే తాను.. ఇవాళ ఈ స్థాయికి వచ్చానని పిల్లలకు స్ఫూర్తి నింపారు
ఇది కథ కాదు.. ఓ చిన్న పిల్లవాడు బిక్షాటన చేసి చదువుకుని అడిషనల్ ఎస్పీ స్థాయికి ఎదిగిన స్ఫూర్తివంతమైన నిజం.. ఆ అడిషనల్ ఎస్పీ జీవితం భావితరాల పిల్లలకు ఎంతో స్ఫూర్తి ఇస్తోంది.. అవును తల్లి, కొడుకు ఇద్దరూ ఇంటింటికీ వెళ్లి బిక్షాటన చేసిన రోజులవి.. తోటి పిల్లలు స్కూల్ కి వెళ్ళడం చూసి.. ఆ పిల్లవాడు స్కూల్ కి వెళ్ళి చదువుకోవాలనుకున్నాడు. కాని అడుక్కోడానికి వచ్చాడనుకుని స్కూల్ నుంచి బయటకు పంపించారు.. ఎందుకంటే ఆ పిల్లవాడి ఒంటి మీద బట్టలు మాసిపోయి ఉన్నాయి.. అందుకే స్కూల్ లో చేర్చుకోలేదు.. ఎలాగైనా స్కూల్ కి వెళ్ళి చదువుకోవాలి అన్న పట్టదల ఆ పిల్లాడి ఒంటి మీద మాసిన బట్టలు ఆపలేక పోయాయి.
అన్నం కోసం బిచ్చమెత్తుకుంటూ.. ఇళ్ళలో తీసేసిన బట్టలు అడిగి తెచ్చుకున్నారు. పగిలిన పలక ఎవరో ఇస్తే తీసుకుని.. ఎవరో దానం చేసిన బట్టలు వేసుకుని స్కూల్ ముందు నిలబడితే..అప్పుడు స్కూల్ లో చేర్చుకున్నారు. అంతటితో కష్టాలు తీరలేదు.. అడుక్కు తినేవాడు మా పక్కన కూర్చుకుని చదువుకోవడం ఏంటని అక్కడా వివక్ష ఎదుర్కొన్నాడు ఆ పిల్లవాడు. ఇల్లు ఇల్లు తిరిగి బిచ్చమెత్తుకుని.. స్మశానవాటికలో సమాధులకు గుంతలు తవ్వి కష్టపడి చదువుకున్న ఆ పిల్లవాడు. ఇవాళ అనంతపురం జిల్లా అడిషనల్ ఎస్పీ స్థాయికి ఎదిగాడు.
చదువుకు ఉన్న గొప్పతనం ఏంటో తన జీవితమే ఒక ఉదాహరణ అంటున్నారు అనంతపురం జిల్లా అడిషనల్ ఎస్పీ హనుమంతరావు. ఓ స్కూల్ లో పిల్లలకు చదువు యొక్క గొప్పతననాన్ని వివరిస్తూ.. చిన్నప్పుడు తాను పడ్డ కష్టాలను చెప్పారు. చదువుకుంటే తప్ప భవిష్యత్ లేదని గ్రహించి.. బిక్షాటన చేసుకుని కడుపునింపుకునే తాను.. ఇవాళ ఈ స్థాయికి వచ్చానని పిల్లలకు స్ఫూర్తి నింపారు. తాను చదువుకోవడం వల్లే ఇంటింటికీ తిరిగి అడుక్కున్న తన తల్లిని ఇవాళ గౌరవిస్తున్నారన్నారు అడిషనల్ ఎస్పీ హనుమంతరావు.
అడిషనల్ ఎస్పీ హనుమంతరావు పిల్లలతో పంచుకున్న తన జీవన పోరాటం అందరి కళ్ళలో నీళ్ళు తెప్పించాయి. ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారి తాను బిక్షాటన చేసే వాడిని అని వందల మంది ముందు చెప్పడానికి ఏమాత్రం సిగ్గు, మొహమాటం పడలేదు. ఎందుకంటే ఆ కష్టాల వెనకాలా ఓ పది మంది పిల్లలు మారాలి ఆన్న ఆలోచన. శోకం నిండిన జీవితాన్ని ఆనందమయంగా మార్చగలిగే శక్తి కేవలం చదువుకు మాత్రమే ఉంది అనే దానికి అడిషనల్ ఎస్పీ హనుమంతరావు జీవితమే ఓ నిలువెత్తు నిదర్శనం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..