Floods: తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం…

వాన తగ్గింది..కానీ వరద ఉధృతి అలజడి రేపుతోంది. ఎగువ నుంచి వస్తోన్న వరదలతో ఇటు గోదావరి అటు కృష్ణా పరివాహాక ప్రాంతాల్లో హై అలర్ట్‌ కొనసాగుతోంది. ఉప్పొంగుతోన్న వాగులు వంకలతో పంటలు నీట మునిగాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద బురద కష్టాలతో పల్లెలు కన్నీరు పెడుతున్నాయి.

Floods: తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం...
Flood Water
Follow us

|

Updated on: Jul 21, 2024 | 8:23 PM

తెలుగు రాష్ట్రాల్లో  వరద బీభత్సం హడలెత్తిస్తోంది. రంపచోడవరం  మన్యంలో  వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. అనేక గ్రామాలకు  రాకపోకలు స్తంభించిపోయాయి. అడ్డతీగల మండలంలో దుచ్చర్తిలో  ఓ గర్బీణిని 108 సిబ్బంది డోలీలో  మోసుకెళ్లాల్సి వచ్చింది.  దారిలో ఓ భారీ చెట్టు కుప్పకూలింది.దాన్ని తొలగించి మహిళను సకాలంలో హాస్పిటల్‌కు తరలించారు 108 సిబ్బంది, స్థానికులు.

గోదావరి  జిల్లాల్లో వరద ఉధృతి జనాన్ని భయపెడుతోంది. ఓవైపు పంటలన్నీ నీటి పాలయ్యాయి. మరోవైపు  వరద గండంతో  ప్రాణగండం తప్పదని కొన్ని గ్రామాల్లో ప్రజలు కలవరపడుతున్నారు. తట్టాబుట్టా సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.  అల్లూరి జిల్లాలో  వరద అలజడి రేపుతోంది. పెదబయలులో పొంగుతున్న వాగును దాటేందుకు బైక్‌తో ఇద్దరు యువకులు సాహసం చేశారు. అయితే నీటి ఉధృతికి బైక్‌ జారింది.  స్థానికులు గమనించి ఆదుకోవడంతో  ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.

ఖమ్మం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో.. 25 గేట్లు ఎత్తి 51వేల క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. అటు బేతుపల్లి, లంక సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. దుమ్ముగూడెం మండలం సంగెం బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఏజెన్సీలో పది గ్రామాలకు రాకపోకలు నిలిచాయి

వరంగల్, ఖమ్మం జిల్లాల్లో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. పెద్దవాగు గండితో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది.ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలతో అలర్ట్ అయ్యారు అధికారులు. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..