AP Weather Update: ఏపీ వాసులకు హెచ్చరిక..! మే నెలలో సుర్రుమనే ఎండలు.. వడగాల్పులు కూడా
ఈ ఏడాది పిలవని పేరంటానికి తగుదునమ్మా అని అకాల వర్షాలు వచ్చాయి. రైతుల కళ్లల్లో కన్నీళ్లు నింపాయి. ఏప్రిల్ నెలలో సగభాగం భాణుడి భగభగలు.. మరో సగభాగం వరుణుడి అకాల పలకరింపు.. వెరసి మే నెలలో ఎండలు ప్రచండంగా ఉండనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ)..
ఈ ఏడాది పిలవని పేరంటానికి తగుదునమ్మా అని అకాల వర్షాలు వచ్చాయి. రైతుల కళ్లల్లో కన్నీళ్లు నింపాయి. ఏప్రిల్ నెలలో సగభాగం భాణుడి భగభగలు.. మరో సగభాగం వరుణుడి అకాల పలకరింపు.. వెరసి మే నెలలో ఎండలు ప్రచండంగా ఉండనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మే నెలలో ఎండ తీవ్రత అధికంగా ఉండనున్నట్లు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు కూడా ఎక్కువగానే ఉంటాయని వెల్లడించింది. సాధారణంగా వేసవి మొత్తమ్మీద మే నెలలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ.. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే మే నెలను తలపించే ఎండలు, వడగాడ్పులు రాష్ట్రంలో అనేకచోట్ల కొనసాగాయి. వివిధ ప్రాంతాల్లో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి.
దీంతో ఏప్రిల్ నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే, మే నెలలో వేసవి తాపం ఎలా ఉండబోతోందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. ఈ క్రమంలో మే నెలలో ఎండలు, వడగాడ్పులు తీవ్ర ప్రభావం చూపుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మే నెలలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్రలో ఉష్ణతీవ్రతతో పాటు వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉండనుంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంత జిల్లాల్లో ఉష్ణతాపం కొనసాగుతుంది. ఐతే రాయలసీమలో మాత్రం వేసవి తీవ్రత ఒకింత తక్కువగా ఉంటుందని అంచనా వేసింది. పగతి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నా.. రాత్రి వేళల్లో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. ఐఎండీ అంచనాల ప్రకారం బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది.
మరోవైపు మే నెలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సైతం కురవనున్నాయి. అక్కడక్కడ పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంది. ఉష్ణతీవ్రత, వడగాడ్పులు, ఈదురుగాలులు, పిడుగులు సంభవించే వాతావరణం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.