AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mandous: భారీ వర్షాలకు తడిసి ముద్దవుతున్న తిరుగిరులు.. భక్తుల రాకపోకలపై పెను ప్రభావం..

తమిళనాడులోని మహాబలిపురం వద్ద తీరం దాటిన మాండౌస్ తుపాను.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చెన్నై మహానగరంలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు...

Mandous: భారీ వర్షాలకు తడిసి ముద్దవుతున్న తిరుగిరులు.. భక్తుల రాకపోకలపై పెను ప్రభావం..
Rains In Tirumala
Ganesh Mudavath
|

Updated on: Dec 10, 2022 | 3:13 PM

Share

తమిళనాడులోని మహాబలిపురం వద్ద తీరం దాటిన మాండౌస్ తుపాను.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చెన్నై మహానగరంలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వాతావరణ పరిస్థితులు గందరగోళంగా మారడంతో విమానాలను రద్దు చేశారు. చెన్నైతోపాటు 5 ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మాండౌస్‌ తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు తిరుగిరులు తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షాలకు గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు అలర్ట్ అయ్యారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో భక్తుల రాకపోకలను నిలిపివేశారు. పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను మూసివేశారు. భారీ స్థాయిలో కురుస్తున్న వర్షాలకు తిరుమలలోని అన్ని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఏఎన్‌సీ ప్రాంతంలో భారీ వృక్షం విరిగిపడింది. ఈ ఘటనలో ఓ కార్మికురాలికి స్వల్ప గాయమైంది. సమాచారం అందుకున్న అధికారులు.. ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు.. మాండౌస్ తుపాను తీవ్రత చెన్నైలో ఎక్కువగా ఉంది. ఈదురు గాలుల ధాటికి చెన్నైలో ఓ సెల్ ఫోన్ టవర్ కుప్పకూలింది. ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఒంగోలులో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జల్లులతో కూడిన వర్షం పడుతోంది. కొత్తపట్నం, ఒంగోలు, సింగరాయకొండ, జరుగుమల్లి, నాగులుప్పలపాడు మండలాల్లోని సముద్రతీర ప్రాంతంలో సముద్రం భయానకంగా మారింది. సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం దగ్గర ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. తుపాను కారణంగా ఒడ్డుకు రాలేక సముద్రంలోనే పడవను లంగరువేసి ఉంచారు మత్స్యకారులు. వీరు వేటపాలెం మండలం రామాపురానికి చెందిన వారుగా గుర్తించారు.

కాగా.. మాండౌస్ తుపాను ప్రభావంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్  క్లిక్ చేయండి..