Kurnool: బాబోయ్ బాహుబలి కొండచిలువ.. ఇదేంది ఇంత ఉంది…
కర్నూలు నగరంలోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ ఆవరణలో భారీ కొండచిలువ కలకలం రేపింది. సుమారు 14 అడుగుల పొడవు, 30 కిలోలకుపైగా బరువున్న కొండచిలువను స్నేక్ క్యాచర్ పట్టుకుని, చంపకుండా అడవిలో విడిచిపెట్టాడు. ఈ భారీ కొండచిలువను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు.

కర్నూలు నగరంలోని సీతారాం నగర్‌లో ఉన్న ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ ఆవరణలో భారీ కొండచిలువ కనిపించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. బాహుబలిలా పెద్దదైన ఈ కొండచిలువ సుమారు 14 అడుగుల పొడవు, 30 కిలోలకుపైగా బరువు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అకస్మాత్తుగా కొండచిలువ కనిపించడంతో కాలనీవాసులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ప్రింటింగ్ ప్రెస్ ఆవరణలో కొండచిలువ సంచరిస్తున్నట్లు సమాచారం వేగంగా కాలనీ మొత్తం వ్యాపించింది. దీంతో స్థానికులు వెంటనే పాములు పట్టే నిపుణులకు సమాచారం అందించారు. కొద్దిసేపట్లోనే స్నేక్ క్యాచర్ సంఘటనా స్థలానికి చేరుకుని, అప్రమత్తంగా కొండచిలువను అదుపులోకి తీసుకున్నాడు. ఎలాంటి ప్రమాదం జరగకుండా, కొండచిలువను ఒక ప్రత్యేక సంచిలో బంధించి అక్కడి నుంచి తరలించారు. పట్టుబడిన కొండచిలువను చంపకుండా సమీప అడవి ప్రాంతంలో విడిచిపెట్టినట్లు స్నేక్ క్యాచర్ తెలిపారు. ఈ ఘటనతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ప్రింటింగ్ ప్రెస్ ఆవరణలో భద్రతా లోపాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ ఆవరణలో ఎప్పటినుంచో పాములు, తేళ్లు వంటి విషపురుగులు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అడవిలా పెరిగిన పొదలు, చెత్త పేరుకుపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాల భద్రత దృష్ట్యా ప్రింటింగ్ ప్రెస్ పరిసరాలను పూర్తిగా శుభ్రం చేసి, క్లీన్ డ్రైవ్ నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లోనూ ఇలాంటి ప్రమాదకర జీవులు కనిపించడం నగరవాసుల్లో భయాన్ని కలిగిస్తోంది. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
