JEE Main 2026 Verification: మీరూ జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేశారా? ఆ పత్రం అప్‌లోడ్‌కు ఇదే చివరి ఛాన్స్..
జేఈఈ మెయిన్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో అప్‌లోడ్ చేసిన ఫోటోలకు, అధికారిక గుర్తింపు కార్డుల్లో ఉన్న ఫోటోలకు మధ్య పోలిక సరిపోవాలి. ఒకవేళ ఏదైనా వ్యత్యాసం అంటే ఫొటో మిస్ మ్యాచ్ ఉన్న అభ్యర్థులు గెజిటెడ్ అధికారుల నుంచి గుర్తింపు ధృవీకరణ తప్పనిసరిగా చేసుకోవాలి..

హైదరాబాద్, జనవరి 4: జేఈఈ మెయిన్ 2026 రాత పరీక్షలు మరో రెండు వారాల్లో ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అభ్యర్థులకు కీలక ప్రకటన జారీ చేసింది. అభ్యర్ధులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో అప్‌లోడ్ చేసిన ఫోటోలకు, అధికారిక గుర్తింపు కార్డుల్లో ఉన్న ఫోటోలకు మధ్య పోలిక సరిపోవాలి. ఒకవేళ ఏదైనా వ్యత్యాసం అంటే ఫొటో మిస్ మ్యాచ్ ఉన్న అభ్యర్థులు గెజిటెడ్ అధికారుల నుంచి గుర్తింపు ధృవీకరణ తప్పనిసరిగా చేసుకోవాలి. ఇప్పటికే అందుకు అవకాశం ఇచ్చిన ఎన్టీయే తాజాగా ఈ గడువును పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. ఈ ప్రకటన మేరకు జనవరి 15, 2026వ తేదీ వరకు ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకునేందుకు గడువు పొడిగించింది.
ఎందుకీ ఐడెంటిటీ వెరిఫికేషన్ చేస్తున్నారంటే?
జేఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్ ఆన్‌లైన్ దరఖాస్తులో భాగంగా కొందరు అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ఫొటోలు, ఆధార్ రికార్డుల్లో ఉన్న ఫొటోలకు చాలా వ్యత్యాసం ఉన్నట్లు ఎన్టీఏ గుర్తించింది. అలాగే ఆధార్ కాకుండా ఇతర గుర్తింపు కార్డులను సమర్పించిన వారిలో ఇదే సమస్య ఉన్నట్లు గుర్తించింది. దీంతో సంబంధిత ధృవీకరణ కార్డుల్లో ఉన్న ఫొటోలను తప్పనిసరిగా ధృవీకరణ చేసుకోవాలి. ఇలా చేసిన అధికారిక ధృవీకరణ కార్డుని PDF ఫార్మాట్‌లో జనవరి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి అవకాశం కల్పించింది. అయితే ఎన్టీయే.. అభ్యర్థుల రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడిలకు పంపిన లింక్ ద్వారా మాత్రమే ఈ ప్రక్రియ పూర్తి చేయవల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే గైడ్‌లైన్స్ జారీ చేసింది.
ఎవరి నుంచి ధృవీకరణ పొందాలి?
ఇందుకు గతంలో కేవలం ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ సంతకం మాత్రమే అడిగారు. అభ్యర్థుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న ఎన్టీయే గెజిటెడ్ 1 ఆఫీసర్లు అంటే తహసీల్దార్లు, రెవెన్యూ ఆఫీసర్లు, ఎస్‌డీఎం, డీఎం.. వీరిలో ఎవరైనా ఈ పత్రాన్ని ధృవీకరించవచ్చని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఇక NRI అభ్యర్థులు భారత రాయబార కార్యాలయ గెజిటెడ్ అధికారుల సంతకం తీసుకుంటే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన ఐడెంటిటీ కార్డుకు సంబంధించిన ఒరిజినల్ ఐడీ కార్డుని పరీక్ష రోజున ఎగ్జాం సెంటర్‌కు ఫిజికల్ వెరిఫికేషన్ కోసం తమతోపాటు అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఏవైనా సందేహాలు, ఇబ్బందులు ఎదురైతే NTA హెల్ప్‌లైన్ నంబర్లు 011-40759000 లేదా 011-69227700లను సంప్రదించవచ్చు. లేదంటే jeemain@nta.ac.inకి కూడా ఈమెయిల్ పంపవచ్చు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ 2026 ఆన్‌లైన్ ఐడెంటిటీ వెరిఫికేషన్ వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




