Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gannavaram: సిట్టింగ్‌ ఎమ్మెల్యేది వ్యూహాత్మక మౌనమేనా? గన్నవరం ఎందుకింత గరంగరం?

నాలుగ్గోడల మధ్య నలిగిన వర్గపోరు ఇప్పుడు మైక్‌ ముందు తొడగొట్టేదాకా వచ్చింది. పార్టీ మారి పెత్తనం చేస్తున్న సిట్టింగ్‌కి సవాల్‌ చేశారు సొంతపార్టీనేత. బలప్రదర్శనతో తన బలగాన్ని చూపించారు. ఎమ్మెల్యేతో పాటు పార్టీ నాయకత్వంపైనా విమర్శలు చేశారు. అసమ్మతి నేత కండువా మార్చబోతున్నారా? పాత ప్రత్యర్థులే కొత్త జెండాలతో పోటీపడబోతున్నారా? ఉమ్మడి ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు శత్రువుకి శత్రువు మిత్రుడన్నట్లు అక్కడ ఈక్వేషన్‌ మారిపోయిందా? సిట్టింగ్‌ ఎమ్మెల్యేది వ్యూహాత్మక మౌనమేనా? గన్నవరం ఎందుకింత గరంగరం?

Gannavaram: సిట్టింగ్‌ ఎమ్మెల్యేది వ్యూహాత్మక మౌనమేనా? గన్నవరం ఎందుకింత గరంగరం?
Vallabhaneni Vamsi vs Yarlagadda Venkat Rao
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 14, 2023 | 5:30 PM

గన్నవరం, ఆగస్టు 14:  దాపరికం లేదు. దాచడానికేం లేదు. అంతా ఓపెన్‌. ఇప్పటిదాకా గన్నవరం వైసీపీలో నాలుగ్గోడల మధ్య నడిచిన ఆధిపత్యపోరు.. ఇప్పుడు బ్యానర్లు కట్టి స్టేజీఎక్కేసింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై డైరెక్ట్‌ ఫైట్‌కి దిగారు వైసీపీ నేత యార్లగడ్ల వెంకట్రావ్‌. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సీటు తనకేనన్న ధీమాతో ఉన్న వంశీకి ఓపెన్‌ ఛాలెంజ్ చేశారు. ఆరునూరైనా నూరుఆరైనా గన్నవరంనుంచి బరిలో నిలుస్తున్నానని ఎనౌన్స్‌ చేశారు యార్లగడ్ల. వంశీ వ్యతిరేకులు, పార్టీలోని అసమ్మతినేతలతో యార్గగడ్ల ఆత్మీయ సమావేశం అన్నప్పుడే అందరికీ అర్ధమైపోయింది ఆయన బాంబుపేల్చబోతున్నారని. అదే జరిగింది. యార్లగడ్ల ఆత్మీయసమావేశం బలప్రదర్శనగా మారింది. గన్నవ‌రంలో వంశీ కంటే వైసీపీలో త‌న‌కే ఎక్కువ కేడ‌ర్ ఉంద‌ని చూపించుకునే ప్రయత్నం చేశారు యార్లగడ్డ. ఎమ్మెల్యే వ‌ల్లభనేని వంశీపై మాటలతో విరుచుకుపడ్డారు. అదే సమయంలో పార్టీ అధినాయకత్వం తీరును కూడా తప్పుపట్టటంతో యార్లగడ్ల వైసీపీని వీడబోతున్నారన్న ప్రచారానికి బలం చేకూరింది.

అధినేతను అభ్యర్థిస్తున్నాను అంటూనే పార్టీలో కష్టపడే కార్యకర్తలు, నిజాయితీ ఉన్న నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆత్మీయ వేదిక సాక్షిగా గట్టిగా గొంతెత్తారు యార్లగడ్ల. పార్టీ కోసం క‌ష్టపడ్డవవారిపై కేసులు అలాగే ఉన్నాయనీ.. టీడీపీ నుంచి వ‌చ్చిన ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులివ్వడాన్ని ప్రశ్నించారు. పార్టీలో మొద‌ట్నించీ ఉన్న దుట్టా రామ‌చంద్రరావుకు ఎమ్మెల్సీ అర్హత లేదా అంటూ ప్రశ్నించి…ఆత్మీయ సమావేశానికి హాజరుకాకపోయినా ఆ అసంతృప్త నేత మద్దతు తనకేనని చెప్పకనే చెప్పారు యార్లగడ్ల. ఇప్పటిదాకా వల్లభనేని వంశీని యార్లగడ్డ, దుట్టా వ్యతిరేకిస్తున్నా ఆ అసమ్మతి అంతర్గతంగానే ఉండిపోయింది. కానీ ఇప్పుడు అనుచరవర్గాన్ని కూడగట్టి యార్లగడ్ల పెట్టిన మీటింగ్‌తో ఆయన తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధపడ్డారని.. పార్టీకి కూడా క్లారిటీ వచ్చేసింది.

వైసీపీలోనే ఉంటూ వంశీపై రెబల్‌గా పోటీచేసే అవకాశం లేదు. పార్టీలో కొనసాగే ఉద్దేశమే ఉంటే అధినేత వ్యవహారశైలిని అంత బాహాటంగా తప్పుపట్టే ఛాన్సుండదు. అందుకే యార్లగడ్ల పార్టీ వీడేందుకు సిద్ధపడే అంత తీవ్రంగా స్పందించారన్న చర్చ జరుగుతోంది. పార్టీలో ఇప్పటికే వంశీ ఉన్నారు.ఆయ‌న్ని కాద‌ని యార్లగడ్డకి వైసీపీ అధిష్ఠానం సీటు ఇచ్చే ప‌రిస్థితి దాదాపు లేనట్లే. పార్టీ ముందు ఇప్పుడు రెండే ఆప్షన్స్‌. టికెట్‌ హామీతో యార్గగడ్లని బుజ్జగించడం. లేదంటే ఆయన్ని పార్టీనుంచి త‌ప్పించ‌డం. వైసీపీ నాయకత్వం రెండో ఆప్షనే తీసుకుంటే యార్లగ‌డ్డ ఎటువైపన్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. యార్లగ‌డ్డ గ‌న్నవ‌రంలో పోటీ చేయాలంటే టీడీపీకి వెళ్లాల్సిందే. టీడీపీ ఆయనకు ఆ హామీ ఇస్తుందా.. టీడీపీలో సీటు వ‌స్తే యార్లగడ్ల గెలిచే అవ‌కాశం ఉంటుందా? అందుకే ఆయన బలప్రదర్శనకు దిగారా అన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఈమధ్య రామచంద్రాపురంలో కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యేతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు పార్టీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌. మంత్రి వేణుగోపాలకృష్ణపై పోటీకి సిద్ధమని ప్రకటించారు. చివరికి పార్టీ అధిష్ఠానం జోక్యంతో పిల్లి సుభాష్‌ కాస్త మెత్తబడ్డారు. ఇప్పుడు గన్నవరం వైసీపీలో అసమ్మతి జ్వాల ఎగసిపడటంతో.. పార్టీ దాన్నెలా చల్లారుస్తుందోనన్న చర్చ జరుగుతోంది. అటు వల్లభనేనికి చెక్‌ పెట్టేందుకు గట్టి అభ్యర్థిని దించే ప్రయత్నాల్లో ఉంది టీడీపీ. అందులోభాగంగా ఇప్పటికే నాలుగైదు పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అక్కడి వైసీపీలో వర్గపోరుతో టీడీపీ వ్యూహం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. యార్లగడ్ల బలమైన అభ్యర్థి అవుతారని పార్టీ భావిస్తే లోకేష్‌ పాదయాత్రలో ఆయన సైకిల్‌ ఎక్కొచ్చన్న ప్రచారం బలంగా ఉంది.

గన్నవరంలో వైసీపీ అభ్యర్థిగా 2014 లో దుట్టా, 2019లో యార్లగడ్డ పోటీచేశారు. గత ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోయారు యార్లగడ్డ. టీడీపీనుంచి గెలిచిన వంశీ వైసీపీ గూటికి చేరటం, తమకు ప్రాధాన్యం తగ్గిపోవటంతో పార్టీ పాత నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. వంశీ అప్పట్లో దొంగ ఓట్లు, రిగ్గింగ్‌తోనే గెలిచారన్నది యార్లగడ్ల ఆరోపణ. ఈసారి దుట్టా మద్దతు కూడా తనకేనన్న అంచనాతో ఉన్నారాయన. ఇప్పటికే ఆ ఇద్దరూ రెండుమూడుసార్లు భేటీకావటంతో వంశీకి వ్యతిరేకంగా కీలకనేతలు ఏకమవుతున్నట్లే కనిపిస్తోంది. పార్టీ రియాక్షన్‌ని బట్టి తన రాజకీయ భవిష్యత్‌పై యార్లగడ్ల కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. టీడీపీకి ప్రధాన టార్గెట్లుగా ఉన్నవారిలో వల్లభనేని కూడా ఉండటంతో.. గన్నవరం వైసీపీలో సంక్షోభాన్ని ప్రధాన ప్రతిపక్షం తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.