Konaseema: పండగ సీజన్, వరదలతో పెరిగిన అరటి ధర.. రైతులకు మోదం.. వినియోగదారులకు ఖేదం
తాజాగా కోనసీమ జిల్లాలోని అరటి రైతుల పంట పండింది. జిల్లాలోని పి.గన్నవరం, అంబాజీ పేట మార్కెట్ సహా పలు ప్రాంతాల్లో భారీగా అరటి ధరలు పెరిగాయి.

Konaseema: అరటిపండ్లను హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్ట స్థానం ఉంది. పండగలు, పర్వదినాల్లో శుభకార్యాల్లో అరటిపండ్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. అంతేకాదు అరటి పేదవారికి సైతం అందుబాటులో ఉండే పండు.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.. ఇంత విశిష్టస్థానం ఉన్నా.. అరటి పండించే రైతు మాత్రం కన్నీరు పెడుతూనే ఉంటాడు. అయితే తాజాగా కోనసీమ జిల్లాలోని అరటి రైతుల పంట పండింది.
జిల్లాలోని పి.గన్నవరం, అంబాజీ పేట మార్కెట్ సహా పలు ప్రాంతాల్లో భారీగా అరటి ధరలు పెరిగాయి. అరటి గెల ఒకొక్కటి సుమారు రూ. 700లు పలుకుతోంది. దీంతో అంబాజీపేట అరటి మార్కెట్ అరటి రైతులతో కళకళలాడుతోంది. అరటి ధర పెరగడంతో.. మార్కెట్ కు భారీగా రైతులు, వ్యాపారులు తరలి వస్తున్నారు. వాస్తవానికి గత నెల రోజులుగా అధిక ధరలు పలుకుతూనే ఉన్నాయి. శ్రావణమాసం, వరలక్ష్మి వ్రతం కావడంతో అరటి ధరలు భారీగా పెరిగాయి. అయితే ఇప్పుడు రెండు రోజులలో వినాయక చవితి పండుగ రానుండడంతో ఆ ధరలు మరింత పెరిగాయి.
పూజకు ఉపయోగించే కర్పూరపు రకం గెల ఒకటి 700 నుండి 900 వరకు పలుకుతొండగా.. చక్రకేళి, పచ్చ చెక్కరకేళి, బుషవలి వంటి రకాల అరటి గెలలు రూ.600 లు పలుకుతున్నాయి. ఇటీవల లంకల గ్రామాల్లో రెండుసార్లు ముంచెత్తిన వరదల కారణంగా అరటి పంట దిగుబడి తగ్గింది. దీంతో అరటి ఉత్పత్తి లేక ధరలు పెరిగాయి. ధరలు పెరగడంతో రైతులు, వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే సమయం చూసి రేట్లు పెంచేస్తున్నారని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అంబాజీపేట ,రావులపాలెం, రాజమండ్రి మార్కెట్స్ నుంచి ఇతర జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాలకు అరటి గెలలు ఎగుమతులవుతాయి.




Reporter: Satya, TV9 Telugu
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




