Andhra Pradesh: రాష్ట్ర ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్.జగన్ (CM Jagan) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వాడుక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి...

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్.జగన్ (CM Jagan) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వాడుక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తించుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. తెలుగు సాహిత్యాన్ని, తెలుగు భాష తీయదనాన్ని సామాన్యుడికి చేర్చిన ఘనత ఆయకే సొంతమని కొనియాడారు. ఈ మేరకు సీఎం జగన్ ట్విట్టర్ (Twitter) లో ట్వీట్ చేశారు. తెలుగు భాష వికాసానికి గిడుగు రామ్మూర్తి అందించిన సేవలు మర్చిపోలేనివి. తెలుగు భాషలో గ్రాంథిక వాదాన్ని తొలగించి, వ్యవహారిక వాదానికి శ్రీకారం చుట్టిన మహా మేధావి ఆయన. 1863 ఆగస్టు 29న ఆయన జన్మించారు. చరిత్ర విభాగంలో అధ్యాపకుడిగా పని చేశారు. సంప్రదాయక విద్య కంటే ఆధునిక విద్యలో విశాల దృష్టి అవరమని చెప్పారు. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు పరభాషా వ్యామోహంలో పడిపోతున్నారు. తెలుగులో రాయడం, చదవడం, మాట్లాడడాన్ని మర్చిపోతున్నారు. దీంతో సొంత గడ్డపైనే తెలుగు పరాయి భాషగా మిగిలిపోయింది. తెలుగు భాష యాసలో పలు రకాలున్నాయి. వీటిలో తెలంగాణ యాస ప్రత్యేకమైనది. ఆ భాషకున్న శక్తితోనే కవులు, రచయితల సాహిత్యం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోసింది.
తెలుగు భాష నిఘంటువులు, గద్య చింతామణి, నిజమైన సంప్రదాయం, వ్యాసావళి వంటి గ్రంథాలను ఆయన రాశారు. ఇవి తెలుగు భాష విస్తృతి పెరగడానికి ఎంతో సహాయపడ్డాయి. 1919లోనే మొట్టమొదటి తెలుగు వ్యవహారిక భాషా పత్రికను గిడుగు రామ్మూర్తి స్థాపించారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు వంటి సాహితీవేత్తలతో కలిసి అదే ఏడాది ఆంధ్రాభాష ప్రవర్తక సమాజాన్ని స్థాపించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మాతృ భాషలో బోధన కొనసాగిస్తూ తెలుగు భాషను పరిరక్షించాలని భాషాభిమానులు, సాహితీవేత్తలు కోరుతున్నారు. ప్రాథమిక చదువులు తల్లి భాషలో సాగితేనే విద్యార్థులు విషయాన్ని త్వరగా అర్థం చేసుకుంటారని, దీని ద్వారా వారు సంపూర్ణ వికాసం సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడుతున్నారు.




వాడుకభాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు భాష తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రామ్మూర్తి పంతులు గారు తెలుగుభాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా నిలిచారు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2022
కాగా.. ఆగస్టు 29న వ్యవహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని అధికారికంగా నిర్వహించాలని పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ వెల్లడించారు. గ్రాంథిక భాషలో కఠినంగా ఉన్న తెలుగు వచనాన్ని రామ్మూర్తి వ్యవహారిక భాషలోకి తీసుకొచ్చారని చెప్పారు. భాషలోని అందాన్ని, వెసులుబాటును లోకానికి అందజేసిన ఘనత ఆయన సొంతమని హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



