Weather Report: చలి పంజా.. వణుకుతున్న తెలంగాణ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను చలిగాలులు వణికిస్తున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. దట్టమైన పొగమంచుతో వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఐఎండీ 7 జిల్లాలకు ఆరెంజ్, 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లోనూ చలి తీవ్రత కొనసాగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణ రాష్ట్రాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో దట్టమైన పొగమంచు కారణంగా విజిబులిటీ తగ్గి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. సుమారు 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల లోపు కొనసాగుతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లెలో 6.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏడు జిల్లాలకు కోల్డ్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో డిసెంబర్ 26 వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, హనుమకొండ, కరీంనగర్, వరంగల్‌తో సహా 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉదయం వేళ పొగమంచు కురిసే అవకాశం ఉందని, గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28, 13 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ బులెటిన్‌లో పేర్కొంది. అటు ఏపీలోనూ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతున్నాయి. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగనుందని వాతావరణశాఖ వెల్లడించింది. వచ్చే 5 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పడిపోతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఏపీలో కోస్తా, రాయలసీమ, యానంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదుకానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని మన్యం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోయాయి. చలికి ఏజెన్సీ వాసులు గజగజలాడుతున్నారు. అల్లూరి జిల్లా పాడేరు ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అరకులో 6, మినుములూరులో 8 పాడేరు 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు దివిసీమను చలి వణికించేస్తోంది. కృష్ణాజిల్లా అవనిగడ్డ ప్రాంతాన్ని మంచు కమ్మేసింది. భయంకరమైన చలికి ప్రజలు ఉదయాన్నే బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రహదారిపై 30-40 మీటర్ల ముందున్న వాహనాలు కూడా సరిగ్గా కనిపించడం లేదు. ఇటు.. అన్నమయ్య జిల్లాలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. బాకరాపేట హైవేపై దగ్గర పొగ మంచు కారణంగా రాకపోకలకు ఇబ్బందికరంగా మారాయి. శ్రీసత్యసాయి జిల్లా కదరి వాసులు చలితో వణికిపోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Peddi: పెద్దితో పోటీ.. అంత ఈజీ కాదు
TOP 9 ET News: బాహుబలి-2 రికార్డ్‌ను బద్దలు కొట్టిన ధురంధర్
కొత్త ఏడాదిలోనూ బంగారం ధర.. పైపైకే అంచనావేసిన ఆర్థిక సంస్థలు
ప్రియురాలి పేరుతో ఇల్లు కొని.. తల్లి పేరుతో రిజిస్ట్రేషన్..
శిథిలావస్థకు చేరడంతో బడిగా మారిన గుడి..
వాటి కోసం ఎలుగుబంటిగా మారిన సర్పంచ్.. చివరికి ఏమైందంటే
బాబోయ్.. పాములా కుబుసం విడిచిన మహిళ.. ఇది ఎలా సాధ్యం
ప్రపంచ అద్భుతం.. 160 అంతస్థుల జెడ్డా టవర్
ఇలాంటి బ్రతుకు.. బ్రతికిన ఒకటే.. సచ్చినా ఒకటే.. తండ్రి
ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ పిడిగుద్దులు.. కారణం

