Heart Attack Symptoms: సైలెంట్ కిల్లర్ హార్ట్ అటాక్.. ఉదయం పూట ఈ 6 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!
ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో 30 శాతం గుండె జబ్బుల వల్లే జరుగుతున్నాయి. గుండెపోటు అనేది ముందస్తు హెచ్చరికలు లేకుండా వచ్చే ప్రమాదం అని చాలామంది భావిస్తారు. కానీ నిజానికి మన శరీరం కొన్ని సంకేతాలను ముందుగానే పంపుతుంది. ముఖ్యంగా ఉదయం నిద్రలేచిన సమయంలో కనిపించే కొన్ని మార్పులు రాబోయే పెద్ద ముప్పుకు సూచికలు కావచ్చు. ఆ ప్రాణాపాయ సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె కండరాలకు రక్తప్రసరణ ఆగిపోయినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో ‘మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్’ అంటారు. సరైన సమయంలో చికిత్స అందకపోతే గుండె కండరాలు శాశ్వతంగా దెబ్బతినడమే కాకుండా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఉదయం వేళల్లో రక్తపోటు, రక్తకణాల్లో వచ్చే మార్పుల వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేచిన తర్వాత కనిపించే ఆరు ముఖ్యమైన హెచ్చరికలు ఇవే..
ఛాతీలో అసౌకర్యం ఉదయాన్నే ఛాతీలో ఒత్తిడి, పిండినట్లు ఉండటం లేదా మంటగా అనిపిస్తే దాన్ని సాధారణ గ్యాస్ సమస్యగా భావించవద్దు. ఈ నొప్పి మెడ, దవడ, వెనుక భాగం లేదా చేతులకు వ్యాపిస్తున్నట్లు అనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
అసాధారణ అలసట నిద్రపోయి లేచిన తర్వాత కూడా విపరీతంగా నీరసంగా ఉండటం లేదా ఏ పని చేయలేనంత అలసటగా అనిపించడం గుండెపోటుకు ఒక ప్రధాన సంకేతం. గుండెకు ఆక్సిజన్ డిమాండ్ పెరిగినప్పుడు శరీరం ఇలాంటి అలసటకు గురవుతుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ, నిద్రలేవగానే ఆయాసంగా అనిపిస్తే అది గుండె వైఫల్యానికి సూచన కావచ్చు. రక్తనాళాల్లో పూడికలు ఉన్నప్పుడు గుండె రక్తాన్ని పంపింగ్ చేయడానికి ఇబ్బంది పడటంతో శ్వాస అందనట్లు అనిపిస్తుంది. పురుషుల కంటే మహిళల్లో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది.
చల్లని చెమటలు ఎలాంటి శ్రమ చేయకపోయినా ఉదయాన్నే ఒళ్లంతా చెమటలు పట్టడం, ముఖ్యంగా చల్లని చెమటలు రావడం ఆందోళనకరమైన విషయం. రక్తప్రసరణలో అడ్డంకులు ఏర్పడినప్పుడు శరీరం చూపే ఒత్తిడి ప్రతిచర్య ఇది.
కళ్లు తిరగడం హఠాత్తుగా కళ్లు తిరగడం లేదా తల తేలికైనట్లు అనిపించడం గుండె నుంచి మెదడుకు రక్తప్రసరణ తగ్గుతోందని చెప్పడానికి ఒక గుర్తు. ఛాతీ నొప్పితో పాటు ఈ లక్షణం ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు.
వికారం చాలామంది ఉదయం పూట వాంతి వచ్చినట్లు ఉండటాన్ని జీర్ణ సమస్యగా అనుకుంటారు. కానీ గుండె సంబంధిత ఒత్తిడి వల్ల కూడా వికారం కలుగుతుంది. ముఖ్యంగా ఆహారం తీసుకున్న తర్వాత కూడా ఈ సమస్య కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలి.
గుండెపోటు అనేది ఎప్పుడూ ఛాతీలో తీవ్రమైన నొప్పితోనే రావాలని లేదు. ఇలాంటి చిన్న చిన్న సంకేతాలను గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి.
