Andhra Pradesh: ఒక్క మెసేజ్.. 45 బైకులు.. దొంగ సామ్రాజ్యాన్ని బయటపెట్టిన ఈ-చలాన్..
ఒక ఈ చలాన్ మెసేజ్ ద్వారా కర్నూలు పోలీసులు భారీ బైక్ దొంగల ముఠాను ఛేదించారు. పోతుల జాన్ అనే దొంగ 45 బైక్‌లను చోరీ చేసి అమ్మాడు. దొంగిలించిన బైక్‌పై పడిన ఈ చలాన్‌తో అతడి గుట్టు రట్టు అయ్యింది. పోలీసులు జాన్‌ను అరెస్టు చేసి, 45 దొంగిలించిన బైకులను స్వాధీనం చేసుకున్నారు.

ఓ చిన్న ట్రాఫిక్ ఈ-చలాన్ మెసేజ్ ఒక కరుడుగట్టిన బైక్ దొంగ యొక్క మొత్తం సామ్రాజ్యాన్ని బయటపెట్టింది. తీగలాగితే డొంక కదిలినట్లుగా ఈ ఒక్క క్లూ ద్వారా పోలీసులు ఏకంగా 45 దొంగిలించిన బైకులను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా కక్కలపల్లి పంచాయతీ పరిధిలోని చంద్రబాబు నగర్‌కు చెందిన పోతుల జాన్.. ఐటీఐ చదువుకుని ఎలక్ట్రీషియన్‌గా, డెకరేటర్‌గా పనిచేశాడు. అయితే జల్సాలకు అలవాటుపడిన జాన్, డబ్బు సంపాదించడం కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు.
దొంగతనం చేసిన ప్రాంతంలో పట్టుబడితే మర్యాద పోతుందనే ఉద్దేశంతో జాన్ అనంతపురం నుండి బస్సులో కర్నూలుకు వచ్చేవాడు. ముఖ్యంగా కర్నూలు ప్రభుత్వాసుపత్రి పార్కింగ్ ప్రాంతంలో ఎక్కువ బైకులు ఉన్న చోట వాటిని చోరీ చేసేవాడు. దొంగిలించిన బైకులను తిరిగి అనంతపురం లేదా సమీప ప్రాంతాల్లో రూ.20 వేల నుండి రూ.50 వేలకు తాకట్టు పెట్టడం లేదా అమ్మేసేవాడు. సుమారు పది రోజుల క్రితం ఒక బైక్ పోవడంతో ఆ ఒరిజినల్ ఓనర్ కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ దర్యాప్తు జరుగుతుండగానే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.
దొంగిలించిన బైక్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి దాన్ని ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తూ నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులు ఆ బైక్‌పై ఈ-చలాన్ వేశారు. ఈ చలాన్ మెసేజ్ బైక్ కొన్న వ్యక్తికి కాకుండా రిజిస్టర్ అయి ఉన్న ఒరిజినల్ బైక్ యజమానికి వెళ్లింది. తన బైక్ చోరీకి గురైనా దానిపై చలాన్ రావడంతో యజమాని వెంటనే త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ క్లూ ఆధారంగా ప్రభుత్వాసుపత్రిలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ ఫుటేజీలో జాన్ పలుమార్లు బైకులు చోరీ చేసినట్లు స్పష్టంగా గుర్తించారు.
45 బైకులు సీజ్
జాన్ వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అతడి స్వగ్రామానికి వెళ్లి అరెస్టు చేశారు. అతడిని విచారించగా, ఎక్కడెక్కడ బైకులను అమ్మేశాడు, తాకట్టు పెట్టాడు అనే వివరాలు బయటపడ్డాయి. పోలీసులు ఆ సమాచారం ఆధారంగా మొత్తం 45 దొంగిలించిన బైకులను స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఒక ఈ-చలాన్ మెసేజ్ ద్వారా ఇంత పెద్ద బైకుల దొంగతనం బయటపడటంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిందితుడు జాన్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపినట్లు కర్నూలు పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








