AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Fraud: చనిపోయిన వ్యక్తి కుటుంబాలను వదలని సైబర్ నేరగాళ్లు.. ఏకంగా బీమా సొమ్ము వచ్చిందంటూ..!

చనిపోయిన వ్యక్తికి బీమా సొమ్ము శాంక్షన్ అయింది.. కొంత డబ్బు అకౌంట్‌లో డిపాజిట్ చేయాలంటూ మోసానికి తెగబడ్డారు సైబర్ నేరగాళ్లు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. అసలే ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి విషాదంలో ఉన్న కుటుంబాలను సైతం సైబర్ నేరగాళ్లు వదలడం లేదు.

Cyber Fraud: చనిపోయిన వ్యక్తి కుటుంబాలను వదలని సైబర్ నేరగాళ్లు.. ఏకంగా బీమా సొమ్ము వచ్చిందంటూ..!
Cyber Crime
Nalluri Naresh
| Edited By: |

Updated on: Jul 10, 2024 | 8:53 PM

Share

చనిపోయిన వ్యక్తికి బీమా సొమ్ము శాంక్షన్ అయింది.. కొంత డబ్బు అకౌంట్‌లో డిపాజిట్ చేయాలంటూ మోసానికి తెగబడ్డారు సైబర్ నేరగాళ్లు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. అసలే ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి విషాదంలో ఉన్న కుటుంబాలను సైతం సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. చనిపోయిన వ్యక్తికి ఇన్సూరెన్స్ డబ్బు మంజూరు అయింది. ఆ మొత్తం అకౌంట్‌లో జమ కావాలంటే మీరు కొంత డబ్బు డిపాజిట్ చేయాలంటూ మృతుడి కుటుంబ సభ్యులకు మాయ మాటలు చెప్పి బురిడీ కొట్టించారు సైబర్ నేరగాళ్లు.

ఉరవకొండ నియోజకవర్గంలోని బెళుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన రైతు తిప్పేస్వామి (44) ఇటీవలే గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు తిప్పే స్వామికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. రైతు తిప్పేస్వామి ఆకస్మిక మృతితో తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో ఆ ఊరి సర్పంచ్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. నేను డీఎస్పీని మాట్లాడుతున్నాను.. అంటూ అవతలి వ్యక్తి తనను తాను పరిచయం చేసుకున్నాడు. మీ గ్రామానికి చెందిన రైతు మరణానంతరం కుటుంబానికి ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయల భీమా సొమ్ము మంజూరు అయిందని, రెండు విడతలుగా సొమ్ము విడుదల అవుతుందని గ్రామ సర్పంచ్‌ని నమ్మబలికాడు.

వెంటనే మృతి చెందిన రైతు తిప్పేస్వామి కుటుంబ సభ్యులతో ఫోన్ లో తనతో మాట్లాడించాలని సర్పంచ్‌కు చెప్పాడు. దీంతో గ్రామ సర్పంచ్ మృతుడు తిప్పేస్వామి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి ఫోన్‌లో సదర్ నకిలీ డీఎస్పీతో మాట్లాడించాడు. కుటుంబ సభ్యులతో సదరు నకిలీ డీఎస్పీ ఫోన్‌లో మాట్లాడుతూ… ఆ డబ్బు విడుదల కావాలంటే రూ.18,500 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. తమతో మాట్లాడుతున్న వ్యక్తి నిజంగానే డీఎస్పీ నే అనుకున్న తిప్పే స్వామి కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్ రామిరెడ్డి సైతం సైబర్ నేరగాళ్ల మాయమాటలకు ఉచ్చులో పడ్డారు. అప్పుడే అంత్యక్రియలకు, ఇతర కార్యక్రమాలకు ఉన్న డబ్బు అంతా ఖర్చయిపోయిందని, తమ వద్ద డబ్బు లేదని తిప్పే స్వామి కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే ఆ కుటుంబానికి ఉపయోగపడుతుందని భావించిన సర్పంచ్ రామిరెడ్డి మానవతా దృక్పథంతో పదివేల రూపాయలు సాయం చేశాడు. మిగిలిన మొత్తాన్ని మృతుడు తిప్పే స్వామి సోదరుడి అకౌంట్ నుండి మొత్తం రూ. 18,500 అవతలి వ్యక్తి సూచించిన మొబైల్ నెంబర్(9611156511) కు ఫోన్ పే చేశారు. ఫోన్ పే ద్వారా డబ్బులు వసూలు చేసిన మరు నిమిషంలోనే సదరు నకిలీ డీఎస్పీ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అయింది. ఇతర నెంబర్ల నుంచి కూడా ట్రై చేసినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితులు మోసపోయామని తెలిసి భోరుమన్నారు. అసలే కుటుంబ పెద్దను కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న తమను ఇలా సైబర్ నేరగాళ్లు మోసం చేయడం పట్ల రైతు తిప్పే స్వామి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కోసం ఆఖరికి సైబర్ నేరగాళ్ళు ఎంతకు తెగించారని అనుకుంటున్నారు గ్రామస్తులు. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..