Andhra Pradesh: పెట్టుబడులే లక్ష్యంగా వడివడిగా సీఎం అడుగులు.. తాజాగా

ఓవైపు పెట్టుబడుల ఆకర్షణ.. మరోవైపు రాష్ట్ర అర్థిక స్థితిగతుల అంచనాపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పలు కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించడంతో పాటు.. ఆర్థికశాఖపై రివ్యూ నిర్వహించారు. ఏపీకి పెట్టుబడులపై ఆశాభావం వ్యక్తంచేశారు సీఎం చంద్రబాబు.

Andhra Pradesh: పెట్టుబడులే లక్ష్యంగా వడివడిగా సీఎం అడుగులు.. తాజాగా
Chief Minister N. Chandrababu Naidu With BPCL CMD G. Krishna Kumar
Follow us

|

Updated on: Jul 10, 2024 | 7:40 PM

బీపీసీఎల్‌ ఛైర్మన్‌, ఎండీ కృష్ణకుమార్‌‌తో పాటు సంస్థ ప్రతినిధులతో సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై చర్చించారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దాదాపు 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మచిలీపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ ఏర్పాటుచేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. వాటికి కొనసాగింపుగా బీపీసీఎల్ ప్రతినిథులతో చంద్రబాబు భేటీ అయ్యారు. విందు కూడా ఇచ్చారు.

ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 4 నుంచి 5 వేల ఎకరాలు అవసరం ఉంటుందని కంపెనీ ప్రతినిథులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అందుకు అససరమైన భూముల కేటాయింపుతో పాటు అన్ని రకాలుగా సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన పూర్తి ప్రణాళికతో 90 రోజుల్లో రావాలని కంపెనీ ప్రతినిధులను చంద్రబాబు కోరారు. అక్టోబర్ నాటికి ఫీజిబిలిటీ రిపోర్ట్‌తో వస్తామని బీపీసీఎల్ ప్రతినిధులు సీఎంకి వివరించారు. ఈ విషయాలను తన ఎక్స్ ఖాతాలో కూడా చంద్రబాబు షేర్ చేశారు.

ఇక విన్‌ఫాస్ట్ కంపెనీ ప్రతినిధులతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వియత్నాంలో మంచి పేరున్న సంస్థే ఈ విన్‌ఫాస్ట్. ఈ సంస్థ సీఈవో పామ్ సాన్ చౌ తో పాటు సంస్థ ప్రతినిథులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా సీఎం వారికి వివరించారు. ఎలక్ట్రానిక్ వాహనాలు, బ్యాటరీ తయారీ ప్లాంట్‌ను ఏపీలో నెలకొల్పాలని చంద్రబాబు కోరారు. ప్లాంట్‌కు అవసరమైన భూమి, ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామనీ.. ప్రభుత్వం తరుపున అన్ని విధాలా సహకరిస్తామనీ స్పష్టంచేశారు. ఈ వివరాలను సైతం ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు సీఎం చంద్రబాబు.

మరోవైపు ఆర్థికశాఖపైనా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఉన్న అప్పులు, ఆదాయాలపై అధికారులను ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తం 14లక్షల కోట్ల వరకు ఉన్నాయని ఆర్థికశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పెండింగ్‌ బిల్లులు ఎంత ఉన్నాయనే అంశంపైనా సీఎం చర్చించారు. శాఖల వారీగా వివరాలు ఇవ్వాలని ఇప్పటికే అధికారులను సీఎం ఆదేశించారు. అన్ని శాఖల సమగ్ర రిపోర్ట్‌తో శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వ సిద్ధమవుతోంది. అదే సమయంలో బడ్జెట్ రూపకల్పనపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థికశాఖ ప్రతిపాదించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..