Andhra Pradesh: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. అప్పటిలోపు ప్రతి ఒక్కరికీ ఇళ్లు..
2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్లు లేని పేదవాడు ఉండకూడదనేదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నాయుడుపేట వేదికగా చంద్రబాబు ఒకేసారి 2.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కేవలం ఇళ్లు ఇవ్వడమే కాకుండా సౌర విద్యుత్, ఉచిత గ్యాస్ వంటి ఆధునిక వసతులతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలనతో పాటు ప్రతి పేదవాడికి ఆత్మగౌరవంతో కూడిన నివాసాన్ని అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా శనివారం నాయుడుపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో నిర్మించిన 2,50,893 ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పార్కులు, అంతర్గత రోడ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీల వంటి మౌలిక సదుపాయాలతో ఈ గృహ సముదాయాలను నిర్మించడం విశేషం.
2029 నాటికి అందరికీ ఇళ్లు
2029 నాటికి రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడదన్నదే తమ సంకల్పమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత పాలకులు ఐదేళ్లలో కేవలం 6.5 లక్షల ఇళ్లు మాత్రమే కడితే.. తమ ప్రభుత్వం ఈ 21 నెలల్లోనే 5.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అప్పగించిందన్నారు. రానున్న కాలంలో మరో 4.5 లక్షల ఇళ్లను నిర్మిస్తామన్న సీఎం.. ఈ ఏడాది జూన్ నాటికి 2 లక్షలు, సెప్టెంబర్ నాటికి మరో 1.60 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
సౌర శక్తితో ఉచిత విద్యుత్..
పేదలపై విద్యుత్ భారం తగ్గించేందుకు ప్రతీ ఇంటిపైనా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీనివల్ల పేదలకు ఉచితంగా విద్యుత్ అందడమే కాకుండా విద్యుత్ ఆదా చేసే ఉపకరణాలను అందించేందుకు ఈఎస్ఎస్ఎల్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మొత్తం 10 లక్షల ఇళ్లకు ఈ ఉపకరణాలను అందించాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు.
సంక్షేమంలో సూపర్ హిట్..
దీపం 2.0 స్కీమ్ ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో పైపుల ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. స్త్రీశక్తి ద్వారా మహిళలకు, దివ్యాంగ శక్తి ద్వారా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. వచ్చే ఏడాది నాటికి 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, 2029 నాటికి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని తెలిపారు.
అమరావతికి చట్టబద్ధత.. పోలవరం పూర్తి
గత పాలకులు మూడు ముక్కలాటతో రాజధానిని ధ్వంసం చేశారని విమర్శించిన సీఎం, అమరావతికి చట్టబద్ధత కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేశామని తెలిపారు. అలాగే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. ‘‘సుపరిపాలన అందించడమే నా ధ్యేయం. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేలా వ్యవస్థను గాడిలో పెట్టాం. అయితే ప్రజలకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. నాయుడుపేటలో రిజిస్ట్రేషన్ విభాగం సేవలు సరిగా లేవని ఫిర్యాదులు వచ్చాయి. ఏప్రిల్ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాను’’ అని అధికారులను హెచ్చరించారు.
మత్స్యకారులకు భరోసా
స్థానిక మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడతామని, ఇతర ప్రాంతాల వారు వచ్చి వేట సాగించకుండా నిఘా పెంచేందుకు రెండు ప్రత్యేక బోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.20 వేలకు పెంచినట్లు గుర్తు చేశారు.
