Andhra: వానరం అయితేనేం.. అచ్చం మనిషిలానే ఆలోచిస్తుంది.. వీడియో చూస్తే మైండ్ బ్లోయింగ్..
భక్తులు దేవుడికి నైవేథ్యం పెడతారు.. అయితే, కొన్ని సందర్భాల్లో వానరాలకు ఆహారం పెట్టకపోయినా.. ఏమైనా తినే పదార్థాలు చూసినా.. కొన్ని చోట్ల భక్తుల చేతుల్లోనుంచి లాగేసుకుంటాయి. కానీ ప్రకాశం జిల్లా సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ఓ వానరం వింత ప్రవర్తన భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ వానరం భక్తుల చేతుల్లో నుంచి తినుబండారాలు లాక్కోదట.. ప్రేమగా ఇస్తే మొహమాటపడుతూ తీసుకుంటుందట.. ఆ తరువాత ఎంతో ఇష్టంగా దేవుని ప్రసాదంలా నిదానంగా తినేస్తుందట.. ప్రస్తుతం ఈ వానరం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి క్షేత్రం వద్ద ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సింగరకొండ క్షేత్రం కోతులకు నిలయం అన్న సంగతి తెలిసిందే.. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఇచ్చే ప్రసాదాలను ఇక్కడి కోతులు ఎంతో ఇష్టంగా తింటుంటాయి. అవసరమనిపిస్తే పైనబడి లాగేసుకుంటాయి. అయితే ఓ కోతి మాత్రం మిగతా కోతుల్లా కాకుండా అచ్చం మనిషిలా ప్రవర్తిస్తోందట.. భక్తులు ఇస్తే తప్ప ప్రసాదాలను లాక్కోదట.. ఇలా ఓ భక్తుడు ఇచ్చిన ఒక పెద్దసైజు గారె సంపాదించిన కోతి దాన్ని ఎంతో ఇష్టంగా, నిదానంగా తింటుంటే కొంతమంది భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
దేవాలయ ప్రహరీ గోడపై దర్జాగా కూర్చుని, మనుషుల తరహాలోనే ఆ గారెను రెండు చేతులతో పట్టుకుని ఎంతో శుభ్రంగా ఆరగిస్తున్న దృశ్యాన్ని అక్కడి భక్తులు తమ కెమెరాల్లో బంధించారు.
వైరల్ అవుతున్న వీడియో..
ఈ వీడియోలో కోతి గారెను తింటున్న తీరు చూస్తుంటే.. భక్తులు పెట్టిన నైవేద్యాన్ని ఆ హనుమంతుడే వానరం రూపంలో నేరుగా స్వీకరిస్తున్నాడా అన్నట్లుగా ఉంది. సాధారణంగా కోతులు పండ్లు, ప్రసాదాల కోసం అల్లరి చేస్తుంటాయి. కానీ ఈ కోతి మాత్రం ఎంతో నిమ్మలంగా, ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా తన విందును ముగించడం విశేషం.. సింగరకొండ క్షేత్రంలో ఇలాంటి దృశ్యాలు చూడటం చాలా ఆనందంగా ఉందంటున్నారు భక్తులు.. స్వామివారి సన్నిధిలో మూగజీవాలు కూడా ఎంతో స్వేచ్ఛగా ఆహారాన్ని ఆరగిస్తున్నాయని భక్తులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ‘గారె తింటున్న కోతి’ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరోవైపు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు వన్యప్రాణులకు ఆహారం ఇచ్చే సమయంలో భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. వాటిని రెచ్చగొట్టకూడదని ఆలయ అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
