నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో త్వరలో 15 వేల ప్రభుత్వ ఉద్యోగాలు!
తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త తెలిపారు. రాష్ట్రంలో త్వరలో 15 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. మరోవైపు పీఎస్‌ఆర్ యువనేస్తం పేరుతో నిరుద్యోగ యువతకు ఏడాదిపాటు ఉచిత ఆన్‌లైన్ శిక్షణతోపాటు పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందించనున్నారు. ఇప్పటికే లక్ష మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి..

హైదరబాద్, అక్టోబర్ 29: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కీలక అప్‌డేట్. రాష్ట్రంలో త్వరలో 15 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మరోవైపు నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా పీఎస్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘పీఎస్‌ఆర్ యువనేస్తం’ పేరుతో ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ అందించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే లక్ష మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ అందించి, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పీఎస్‌ఆర్ యువనేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. ఆర్‌సీ ఎగ్జామ్స్ సంస్థ సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల యువత ఆన్‌లైన్ ద్వారా శిక్షణ పొందే అవకాశం కల్పించారు.
ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునేందుకు ఇప్పటికే లక్ష మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని మంత్రి తెలిపారు. ఎంతమంది అభ్యర్థులు వచ్చినా ఏడాదిపాటు శిక్షణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. ప్రైవేటు సంస్థల్లో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకోవాలంటే అభ్యర్థులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక్కో అభ్యర్థి వ్యక్తిగతంగా ఇలాంటి శిక్షణ పొందేందుకు సుమారు రూ.లక్ష వరకు ఖర్చవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీనికి అదనంగా పుస్తకాలు, ఇతర అధ్యయన సామగ్రి కోసం మరో రూ.14 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు అవుతుందని వివరించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాణ్యమైన శిక్షణ పొందలేని నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని పీఎస్‌ఆర్ యువనేస్తం కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఆన్‌లైన్ శిక్షణతోపాటు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందించనున్నారు.
2016లో ఖమ్మంలో 2,300 మంది అభ్యర్థులకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ అందించినట్లు మంత్రి గుర్తుచేశారు. వారిలో 462 మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. గతంలో సాధించిన ఫలితాల స్ఫూర్తితోనే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యపై కూడా మంత్రి కీలక విషయం వెల్లడించారు. దీపావళిలోగా ఈ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమ్మతించినట్లు తెలిపారు. దీంతో ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల్లో ఆశలు నెలకొన్నాయి. మరోవైపు ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో మంత్రి తన పుట్టినరోజు వేడుకలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించుకున్నారు. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవగా, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆర్‌సీ ఎగ్జామ్స్ సంస్థ సహకారంతో పీఎస్‌ఆర్ యువనేస్తం శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
