నిరుద్యోగులకు భారీ జాబ్ అలర్ట్.. TGPSC నుంచి 1395 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు
రాష్ట్ర అటవీశాఖలో 1,395 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించిన వివరాల ప్రకారం, నోటిఫికేషన్ అనంతరం దరఖాస్తులకు నెల రోజుల గడువు, పరీక్షల సన్నద్ధతకు మరో రెండు నెలల సమయం కల్పించనున్నారు. పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరగనున్నాయి. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడికానున్నాయి..

హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర అటవీశాఖలో ఖాళీగా ఉన్న 1395 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఈ నియామకాల ద్వారా అటవీశాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం నుంచి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు అందిన మూడు నెలల్లోగా పరిపాలనాపరమైన ప్రక్రియను పూర్తి చేసి ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఛైర్మన్ తెలిపారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు నెల రోజుల గడువు ఇవ్వనున్నారు. పరీక్షలకు సిద్ధమయ్యేందుకు మరో రెండు నెలల సమయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల నియామక పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్షల (CBRT) విధానంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్ష తేదీలను ఒకసారి ఖరారు చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయబోమని స్పష్టం చేశారు. నియామక ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు కమిషన్ పలు సంస్కరణలు అమలు చేస్తున్నట్లు వివరించారు. రాతపరీక్ష పూర్తయిన మూడు వారాల్లోగా తుది ఫలితాలను ప్రకటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ తెలిపారు. నియామక ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించి, అభ్యర్థులకు వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రారంభ తేదీ, చివరి తేదీ, పరీక్ష తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వెల్లడికానున్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నోటిఫికేషన్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకోవాలి.




