AP Politics: కూటమిలో బీజేపీ చేరికపై క్లారిటీ వచ్చేసినట్టేనా?.. రసవత్తరంగా మారుతున్న ఏపీ రాజకీయాలు!

ఏపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతూ ... రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ప్రధాన పార్టీలు వేస్తున్న పాచికలు.. కాపువంటి కీలక సామాజిక వర్గాల్లో చీలికలు కారణమవుతున్నాయి. మరికొన్ని వర్గాలు అస్థిత్వ పోరాటానికి సిద్ధమయ్యేలా చేస్తున్నాయి. ఇక, టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరిక దాదాపు ఖరారవడంతో.. పొలిటికల్‌ సిట్యుయేషన్‌ మరింత స్పీడుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

AP Politics: కూటమిలో బీజేపీ చేరికపై క్లారిటీ వచ్చేసినట్టేనా?.. రసవత్తరంగా మారుతున్న ఏపీ రాజకీయాలు!
Big News Big Debate
Follow us

|

Updated on: Mar 07, 2024 | 7:07 PM

ఎన్నికలకు సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు… దేనికదే ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతుండటంతో ఏపీ రాజకీయం నాటకీయ పరిణామాలకు వేదికవుతోంది. కొన్నిరోజులుగా కాపులే కేంద్రంగా హీటెక్కుతున్న స్టేట్‌ పాలిటిక్స్‌.. ఇప్పుడు మరో టర్న్‌ తీసుకున్నాయి. కాపునేత ముద్రగడ పద్మనాభంతో ఎంపీ మిథున్‌రెడ్డి సహా పలువురు కాపునేతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మంచిరోజు చూసుకొని సీఎం జగన్‌ సమక్షంలో ముద్రగడ వైసీపీలో చేరుతారని చెప్పారు మిథున్‌రెడ్డి. ముద్రగడకు వైసీపీలో సముచిత స్థానం ఉంటుందన్నారు.

వైసీపీలో ముద్రగడ చేరికతో… కోస్తా కాపుల్లో చీలిక వచ్చినట్టు కనిపిస్తోంది. లేఖలతో ప్రశ్నలు సంధిస్తున్నా… ఇప్పటికీ జనసేనకే మద్దతంటున్నారు హరిరామజోగయ్య. పెద్దలంతా తలా ఒక పార్టీకి మద్దతు ప్రకటిస్తుండటంతో.. అసలు కాపులు ఎటువైపు అనే చర్చ జరుగుతోంది. అయితే, ముద్రగడ, హరిరామజోగయ్య వెంట కాపులు ఎవరూ లేరన్న కాపునాడు… తాము అన్ని పార్టీలకు అతీతమని ప్రకటించింది. అమలాపురంలో డిక్లరేషన్‌ విడుదల చేసింది.

అటు, రాయలసీమలో బలిజలు అస్థిత్వ పోరాటానికి సిద్ధమవుతున్నారు. తిరుపతిలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించిన ఆ వర్గం నేతలు… తిరుపతి ఎమ్మెల్యే సీటును స్థానిక బలిజలకే కేటాయించాలని జనసేన హైకమాండ్‌ను డిమాండ్‌ చేశారు. స్థానికేతరులకు ఇస్తే సహకరించబోమని స్పష్టం చేశారు.

మరోవైపు, టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీ దాదాపుగా ఖాయమైపోయింది. ఢిల్లీ వెళ్లిన పవన్‌, చంద్రబాబు బీజేపీ పెద్దలతో తుదిచర్చలు జరపనున్నారు. ఆ తర్వాత ఏపీలో బీజేపీ పోటీచేయనున్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలపై స్పష్టత రానుంది. ఇప్పటికే రాష్ట్రబీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. హైకమాండ్‌కు నివేదిక సమర్పించారు. అయితే, ఏపీలో బీజేపీ వ్యవహారంపై వ్యంగాస్త్రాలు సంధించారు పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల. పార్టీల వ్యూహప్రతివ్యూహాలతో రోజుకో మలుపుతిరుగుతున్న ఏపీ రాజకీయం.. మున్ముందు ఎలాంటి టర్న్‌ తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..