Vizag: గుండె నిండా బాధతో పరీక్ష రాసి వచ్చి… కన్నీటితో తండ్రికి కడసారి వీడ్కోలు..!
విశాఖలో ఓ ఇంటర్ విద్యార్థిని ఇంట్లో విషాదం జరిగింది. తండ్రి మృతి చెందడంతో... ఆ బాధను గుండెల్లో నింపుకొని ఇంటర్ ఎగ్జామ్ రాసిన కుమార్తె, తిరిగొచ్చి తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. తండ్రికి అంత్యక్రియలు నిర్వహించే బాధ్యత తనదే అని, పరీక్షకు వెళ్లనని చిన్నకుమార్తె పట్టుబట్టింది. అయితే...

భార్య భర్తలు, ఇద్దరు కూతుళ్లు.. విధి ఆ కుటుంబాన్ని చిన్నచూపు చూసింది. లారీ డ్రైవర్ కు కుటుంబాన్ని నెట్టుకొస్తున్న కుటుంబ తండ్రికి క్యాన్సర్ సోకింది. ఇద్దరు పిల్లల్లో పెద్ద కూతురు మానసిక స్థితి సరిగా ఉండదు. అయినా కుటుంబాన్ని కష్టంతో నెట్టుకొచ్చాడు. చిన్న కూతురు చదివి పెద్దదై ఉద్యోగం సంపాదించి కుటుంబానికి ఆసరాగా ఉండాలనుకుంది. ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం లేచి పరీక్ష కోసం బయలుదేరుదామా అని అనుకునేసరికి.. తండ్రి ఇక ఈ లోకంలో లేడని వార్త ఆమెను తీవ్రంగా కలిసి వేసింది. కన్నీటిని దిగమింగి పరీక్ష రాసి ఆ తర్వాత తండ్రికి కడసారి వీడ్కోలు పలికింది.
విశాఖ నగరంలోని హనుమాన్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు వాళ్ళ లారీ డ్రైవర్ సోమేశ్. అతనికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించి కుటుంబాన్ని పోషించాడు. పిల్లలను పెద్దవారిని చేశాడు. పెద్దకూతురు మానసికంగా అంత పరిపక్వత లేకపోవడంతో.. చంటి పిల్లలా కాపాడుకున్నాడు. చిన్న కూతురుని చదివించాడు. చిన్న కూతురు ఢిల్లీశ్వరి అన్నీ తానై పేరెంట్స్‌కు చేదోడు వాదోడుగా నిలిచింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది చిన్న కూతురు. పరీక్షలు మొదలవడంతో ప్రిపేర్ అవుతోంది. ఉదయాన్నే పరీక్షకి వెళ్దామని అనుకున్న ఆమెకు.. మరోసారి విధి పరీక్ష పెట్టింది. అనారోగ్యంతో మంచం పట్టిన తండ్రి.. ప్రాణాలు కోల్పోయాడు.
ఇద్దరూ కూతుళ్లే ..! అక్క మానసిక స్థితి బాలేదు. తనే అంత్యక్రియలు తండ్రికి చేయాలి. మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరు కావాలి. జీవితానికి బాటలు వేసే పరీక్ష కంటే.. తనకు జీవితం ప్రసాదించిన తండ్రికి చివరి కార్యక్రమాలు చేయడమే ముఖ్యం అనుకుంది. పరీక్ష రాసేందుకు వెళ్లనని పట్టుబట్టడంతో.. స్థానికులు నచ్చ చెప్పారు. పరీక్ష అయ్యేవరకు అంత్యక్రియలు ఆపుదామని చెప్పి.. ఆమెను ఎగ్జామ్ సెంటర్‌కు పంపించారు. పరీక్ష రాసి వచ్చేవరకు తండ్రి మృతదేహం తీసుకెళ్లబోమని చెప్పడంతో.. బాధతో పరీక్షా కేంద్రానికి వెళ్ళింది. గుండె నిండా ఆవేదనతోనే… పరీక్ష రాసి తిరిగి ఇంటికి వచ్చింది. తండ్రికి అన్ని తనై అంత్యక్రియలు చేసి కన్నీటి వీడ్కోలు పలికింది. ఆమె తండ్రి ఆఖరి వీడ్కోలు పలుకుతూ బోరున విలపిస్తున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




