Bhimavaram: ‘అయితే ఆయన.. లేదంటే నేను’… పులపర్తికి భీమవరం చిక్కుతుందా
పొత్తులో భీమవరం స్థానాన్ని జనసేన బలంగా కోరుకుంటోంది. మొన్నటిదాకా టీడీపీలో ఉండి టికెటిస్తే జనసేనలో చేరాలనుకుంటున్న పులపర్తికి.. రెండు పార్టీలనుంచి స్పష్టమైన సంకేతాలైతే లేవు. అయితే భీమవరంలో తనకు సహకరించాలని పవన్ కోరారని, ఒకవేళ పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చెయ్యకపోతే తనకు అవకాశమివ్వాలని కోరినట్లు చెబుతున్నారు పులపర్తి.

పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు. ఇప్పుడు ఈ మాజీ ఎమ్మెల్యే చుట్టే తిరుగుతోంది భీమవరం రాజకీయం. పులపర్తి భీమవరం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు పులపర్తి. సిటింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కి కాకుండా కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయిన పులపర్తి.. ప్రజారాజ్యం అభ్యర్థి కనకరాజు సూరిపై 22వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలు మారటంతో 2014లో టీడీపీలోకొచ్చారు. వైసీపీనుంచి బరిలోకి దిగిన పాత ప్రత్యర్థి గ్రంథిపై 13వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు పులపర్తి. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మూడోసారి పోటీ చేసి ఓడిపోయిన పులపర్తి.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొత్త వ్యూహంతో పావులు కదుపుతున్నారు.
2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భీమవరం నుంచి పోటీకి దిగారు. వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్, టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు ప్రత్యర్థులుగా నిలిచారు. త్రిముఖపోటీలో చివరికి వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. పవన్‌కల్యాణ్ రెండోస్థానంలో నిలిస్తే.. పులపర్తి రామాంజనేయులు మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఈసారి కూడా పవన్‌కల్యాణ్ భీమవరంనుంచి పోటీచేస్తారని భావించినా అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే పులపర్తి జనసేన అధినేతతో భేటీ కావటంతో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. పాత సెంటిమెంట్‌తోనే మరోసారి భీమవరంలో గెలవాలనుకుంటున్నారు పులపర్తి. టీడీపీలోనే ఉన్నా కొన్నేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారు. ఇటీవల జనసేన అధినేత ఇంటికి వెళ్లి ఆయనతో పులపర్తి భేటీకావడం భీమవరం పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈసారి భీమవరం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీలో ఉంటానని సీనియర్ సంకేతాలివ్వటంతో నియోజకవర్గ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
పొత్తులో భీమవరం స్థానాన్ని జనసేన బలంగా కోరుకుంటోంది. మొన్నటిదాకా టీడీపీలో ఉండి టికెటిస్తే జనసేనలో చేరాలనుకుంటున్న పులపర్తికి.. రెండు పార్టీలనుంచి స్పష్టమైన సంకేతాలైతే లేవు. అయితే భీమవరంలో తనకు సహకరించాలని పవన్ కోరారని, ఒకవేళ పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చెయ్యకపోతే తనకు అవకాశమివ్వాలని కోరినట్లు చెబుతున్నారు పులపర్తి. అయితే మాజీ ఎమ్మెల్యే వ్యూహంపై మిత్రపక్షపార్టీల్లో చర్చ మొదలైంది. ఎలాగైనా ఈసారి పవన్‌కల్యాణ్‌ని భీమవరంలో గెలిపించేందుకు ఇన్నాళ్లూ కష్టపడి పనిచేశామంటోంది అక్కడి జనసేన కేడర్. అధినేతకోసమే తామంతా పనిచేస్తున్నామని, వేరే ఎవరికి టికెటిచ్చినా సహకరించేది లేదని ముందే చెబుతున్నారు జనసేన కార్యకర్తలు. కొందరు నాయకులైతే పులపర్తికి అవకాశం ఇవ్వొద్దని అధినేతను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పులపర్తి మాత్రం అయితే ఆయన లేదంటే నేను అన్న నమ్మకంతో ఉన్నారు. పార్టీ మారకపోయినా తాడేపల్లిగూడెం జెండా సభలో వేదికపై ఆయన జనసేన నేతల సైడే కూర్చున్నారు.
పులపర్తి వ్యూహంతో పార్టీ అధినేతపై.. భీమవరం జనసేన నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. పడ్డచోటే నిలబడి తొడగొట్టాలంటున్నారు. కొందరు జనసేన కార్యకర్తలు పవన్ భీమవరంనుంచే పోటీ చెయ్యాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోపక్క పులవర్తి తీరుపై టీడీపీ నాయకులు, పార్టీ తమ్ముళ్లు కూడా అసహనంతో ఉన్నారు. రామాంజనేయులు ఇన్నాళ్లూ టీడీపీలో ఉండి పార్టీ బలోపేతానికి ఏమాత్రం సహకరించలేదన్నది టీడీపీ నేతల ఆరోపణ. పులపర్తి టీడీపీలోనే కొనసాగాలని మరికొందరు సూచిస్తున్నారు. ఈ పరిణామాలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారు. భీమవరం నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




