YSRCP: ఏపీపై తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్.. వైసీపీ, టీడీపీ నేతల వాదనలేంటి..
తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై పడింది.. తెలంగాణలో అధికారంలోకి వచ్చే పార్టీ ఆంధ్రాలో గెలుపోటములు నిర్దేశిస్తుందనే చర్చ ఎన్నికలకు ముందు నుంచీ సాగుతుంది. ఇప్పుడు ఫలితాల తర్వాత హస్తం హవా కొనసాగడం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోరుగా చర్చ మొదలైంది.
తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై పడింది.. తెలంగాణలో అధికారంలోకి వచ్చే పార్టీ ఆంధ్రాలో గెలుపోటములు నిర్దేశిస్తుందనే చర్చ ఎన్నికలకు ముందు నుంచీ సాగుతుంది. ఇప్పుడు ఫలితాల తర్వాత హస్తం హవా కొనసాగడం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోరుగా చర్చ మొదలైంది. తెలంగాణలో బీసీ సీఎంల పల్లవి.. జనసేన-బీజేపీల కలయిక.. ఇలా ప్రతి అంశాన్ని ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటూ రాజకీయ రచ్చ ఎక్కువైంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలు కావడం.. పొలిటికల్ గానూ అక్కడ.. ఇక్కడ పోటీ చేసే పార్టీలు ఉండటం.. ఏపీకి చెందిన సెటిలర్లు కూడా ఎక్కువగా ఉండటంతో తెలంగాణ తో పాటు ఏపీలోనూ ఈ ఎన్నికలపై జోరుగా చర్చ జరిగింది. వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో ఏపీ నాయకులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కొందరికి బంధుత్వాలు కూడా ఉన్నాయి. దీంతో తెలంగాణ ఎన్నికలపై ఎక్కువ ఆసక్తి చూపించారు ఏపీ ప్రజలు, రాజకీయ నాయకులు.
ప్రధానంగా జనసేన-బీజేపీలు కలిసి తెలంగాణలో బరిలోకి దిగడం.. కాంగ్రెస్ కు చంద్రబాబు పరోక్షంగా సపోర్ట్ చేసారంటూ తీవ్రంగా చర్చ సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేన.. తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీకి వెళ్లడం ద్వారా అపఖ్యాతి పాలయిందని చర్చ జరుగుతుంది. మరోవైపు తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోవడం వెనుక కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడమే కారణం అనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. టీడీపీ ఓటు బ్యాంకుతో పాటు సెటిలర్ల ఓట్లు కాంగ్రెస్ కు వేసేలా చంద్రబాబు పరోక్షంగా సహకరించారని చర్చ జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో అక్కడక్కడా టీడీపీ శ్రేణులు కూడా జెండాలు పట్టుకొని రోడ్లపై కనిపించాయి. హైదరాబాద్ లోని రేవంత్ రెడ్డి నివాసంతో పాటు గాంధీభవన్ కు పసుపు జెండాలతో వెళ్లిన కార్యకర్తలు సంబరాల్లో పాల్గొన్నారు. ఒకప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించడంతో టీడీపీ కేడర్ కూడా ఉత్సాహంలో ఉంది.
తెలంగాణ రిజల్ట్స్ తో ఏపీలో తమకు లాభం అంటున్న టీడీపీ
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపడితే.. ఏపీలో తెలుగుదేశం పార్టీకి రూట్ క్లియర్ అవుతుందని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. అనుకున్నట్లుగానే బీఆర్ఎస్ ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో తెలుగుదేశం పార్టీకి ఏపీలో కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిపోయి సుమారు పదేళ్లు కావస్తుంది. అయినా ఒక రాష్ట్ర రాజకీయాలు మరొక రాష్ట్ర రాజకీయాలపై బాగానే ప్రభావం చూపుతుంటాయి. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ సమయంలో హైదరాబాద్ తో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో చేసిన ఆందోళనలు కూడా ఎన్నికలపై ప్రభావం చూపించాయని తెలుగుతమ్ముళ్ల వాదన. చంద్రబాబు అరెస్ట్ తో సెటిలర్ల ఓట్లను కొల్లగొట్టడంలో కాంగ్రెస్ సక్సెస్ అయిందంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ ను సానుభూతిగా చూపిస్తూ కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చకోవడంలో విజయం సాధించిందంటున్నారు. తెలంగాణలో బీఆర్ ఎస్ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. వాస్తవంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత సంక్షేమానికి పెద్ద పీట వేసి రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేసినా.. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది బీఆర్ఎస్. దీంతో ఈసారి ఎన్నికల ఫలితాలు మొత్తం తారుమరయ్యాయి. ఇదే పరిస్థితి ఏపీలో కూడా రిపీట్ అవుతుందని అంచనా వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో సైతం బీఆర్ ఎస్ కు వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో ఓటమి తప్పలేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికార పార్టీపై అన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత ఉందని.. దాన్ని ఓటు రూపంలో ప్రజలు చూపిస్తారని చెప్పుకొస్తున్నారు టీడీపీ నేతలు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించారో.. అదే పద్దతిలో ఆంధ్రప్రదేశ్ లో కూడా తాము ముందుకెళ్తామంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామంటున్నారు.
ఏపీ-తెలంగాణను విడివిడిగా చూడాలంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధప్రదేశ్ పై ఉండదంటున్నారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. రెండు రాష్ట్రాలను వేర్వేరుగా చూడాలని.. అక్కడ రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులకు పోలిక లేదంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అందించామని.. అన్ని రకాల పదవుల్లో సామాజిక సాధికారత దిశగా ముందుకు వెళ్లడంతోనే అన్ని వర్గాలు తమకు అనుకూలంగా ఉన్నాయంటున్నారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉన్నామని చెప్పుకునే స్థానాల్లో బీఆర్ ఎస్ కు ఎక్కువ సీట్లు రావడాన్ని కూడా వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. పొరుగు రాష్ట్రం కావడంతో బీఆర్ఎస్ తో ఎలాంటి గొడవలు లేకుండా ముందుకెళ్లామని.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీపడలేదని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. అయినా తెలంగాణ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అనే లెక్కలు వేసే పనిలో పడింది వైసీపీ.
NO FAKE NO BOTJUST ORIGINAL
డిజిటల్ రంగంలో అన్ని రికార్డులను బద్దలు కొట్టిన #TV9Telugu pic.twitter.com/nBSqWBMn6R
— TV9 Telugu (@TV9Telugu) December 5, 2023
No.1 న్యూస్ నెట్‌వర్క్.. No.1 ఎలక్షన్ కవరేజ్.. డిజిటల్ రంగంలో రికార్డులు బద్దలు కొట్టిన టీవీ9 తెలుగు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..