West Godavari: ఆక్వా చెరువులో విష ప్రయోగాల కలకలం.. రెండు నెలల్లోనే రూ. కోటీ 40 లక్షల నష్టం..
West Godavari District: పగ ప్రతీకారాలతో రగిలిపోతున్న కొందరు, తమ ప్రత్యర్ధుల వ్యాపారాలపై విష ప్రయోగానికి దిగుతున్నారు. అతన్ని ఆర్ధికంగా కోలుకోనీయకుండా చేసి వికృత ఆనందాన్ని పొందాలని చూస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా రామన్నపాలెంలో సాగిరాజు కృష్ణంరాజు రైతుకు చెందిన ఆక్వా చెరువులో విషప్రయోగంకు దిగారు. ఏడు ఎకరాల్లో వేసిన..
పశ్చిమ గోదావరి జిల్లా, ఆగస్టు 31: రొయ్యల సాగులో పోటీతత్వాన్ని పక్కన పెట్టి, పగతో రగలి పోతున్నారు. సాగులో పోటీ పడి శభాష్ అనిపించుకోకుండా, ఇతరులపై విషం కక్కుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల ఆక్వా చెరువు సాగులో పెరిగిన విష సంస్కృతి బుసలు కొడుతోంది. ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు చెరువుల్లో విషం కలుపుతున్నారు కొందరు ప్రబుద్ధులు. తమ కంటే అధిక లాభాలను పొందుతున్నవారి రొయ్యల చెరువల్లో విష ప్రయోగం జరిపి, ఆర్ధికంగా దెబ్బ తీసేలా చూస్తుండడం ఆ రంగం రైతులను కలవర పెడుతోంది.
పగ ప్రతీకారాలతో రగిలి పోతున్న కొందరు, తమ ప్రత్యర్ధుల వ్యాపారాలపై విష ప్రయోగానికి దిగుతున్నారు. ఈ మేరకు ప్రత్యర్థులను ఆర్థికంగా కోలుకోనీయకుండా చేసి వికృత ఆనందాన్ని పొందాలని చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రామన్న పాలెంలో సాగిరాజు కృష్ణంరాజు రైతుకు చెందిన ఆక్వా చెరువులో విష ప్రయోగంకు దిగారు. మొత్తం ఏడు ఎకరాల్లో వేసిన రొయ్యలు అన్నీ మృత్యువాత పడడంతో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది.
ఆక్వా రైతుగా ఉన్న సాగిరాజు కృష్ణంరాజు.. ప్రతీ రోజూ చెరువు దగ్గరకు వచ్చి రొయ్యల సాగును చూసుకుని ఇంటికి వెళ్తుండేవాడు. కానీ గురువారం ఉదయం వచ్చి చెరువును చూసే సరికి అందులోని రొయ్యలు అన్నీ మృత్యువాత పడి ఉండడంతో కలవరం చెందాడు. కారణం ఏమై ఉంటుందని పరిసరాల్లో వెతకగా ఎలుకల మందు కలిపిన సంచిని గుర్తించాడు. వాటి ఆధారంగా తాను అనుమానిస్తున్న చిన బాబు అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 10 టన్నుల వరకు రొయ్యలు మృతి చెందడంతో రైతు కృష్ణంరాజు ఈ ఒక్క నెలలోనే రూ. 40 లక్షలు నష్టపోయాడు.
అయితే ఇలా జరగడం ఇదే తొలి సారి కాదని, గత నెలలో కూడా ఇదే విధంగా జరిగింది అంటున్నాడు కృష్ణంరాజు. అప్పుడు ఏకంగా కోటి రూపాయల వరకు నష్టపోయాని తెలిపాడు. కాగా, ఆక్వా రంగం అంటేనే కోట్లలో వ్యాపారం ఉంటుంది. ఒకరు ఎదగడాన్ని మరొకరు జీర్ణించుకోలేక పోతున్నారు. పగలు ప్రతీకారాలు పెంచుకుని ఇతరులకు నష్టం వాటిల్లేలా చేయాలని ప్రయత్నిస్తున్నారు. వ్యాపారం అంటే పోటీ తత్వం ఉండాలి కానీ, ఇలా ఒకరిపై ఒకరు కక్షలతో రగిలిపోయి వ్యాపారాలను దెబ్బతీసుకునేలా ప్రవర్తించడం సరికాదని స్థానికులు అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..