ఏపీలో లోకల్ ఎలక్షన్ పంచాయితీ.. నేడు సుప్రీంకోర్టులో కీలక వాదనలు..అందరిలో ఇదే ఉత్కంఠ
ఏపీ స్థానిక ఎన్నికల విషయం ఇవాళ తేలిపోనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ మధ్య నెలకొన్న వివాదం చివరకు సుప్రీం కోర్టుకు చేరింది. రెండు రాజ్యాంగబద్దమైన సంస్థల మధ్య నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో
ఏపీ స్థానిక ఎన్నికల విషయం ఇవాళ తేలిపోనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ మధ్య నెలకొన్న వివాదం చివరకు సుప్రీం కోర్టుకు చేరింది. రెండు రాజ్యాంగబద్దమైన సంస్థల మధ్య నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఎలాంటి తీర్పు రాబోతుందనేది ఆసక్తిని రేపుతోంది. ఎస్‌ఇఈ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగాఉంది. మరోవైపు ప్రభుత్వం యంత్రాంగం నుంచి సహాయ నిరాకరణ ఎదురువుతోంది. ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు మధ్య ఘర్షణ ఏర్పడిన నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు సుప్రీం కోర్టు ఏ నిర్ఱయం తీసుకోనుంది అనే అంశం ఉత్కంఠను రేపుతోంది.
ఈరోజు ఏం జరగబోతోంది? అందరిలో ఇదే ఉత్కంఠ. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా? రెడ్ లైట్ పడుతుందా? ఢిల్లీ చేరిన ఎపిసోడ్‌లో ఏం జరగబోతోంది? ప్రస్తుతానికి ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. పార్టీలు మాత్రం మాటలకు మరింత పదును పెట్టాయి. నామినేషన్లు వేస్తామంటూ టీడీపీకి చెందిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సూటిగా చెప్పేశారు.
కరోనా నుంచి రక్షణ పొందేందుకు చేపట్టిన టీకా కార్యక్రమం పూర్తికాకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ఉద్యోగుల వాదన. బలవంతంగా తమతో ఎన్నికలు నిర్వహించడం అంటే రాజ్యాంగం ప్రసాదించిన హక్కుకు భంగం కల్గించడమే అంటున్నారు. ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్ కూడా జారీ కావడంతో.. చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య నెలకొన్న వివాదం.. పెద్ద యుద్ధాన్నే తలపిస్తోంది. పంచాయతీ ఎన్నికలు ఎటు దారి తీయనున్నాయి. ట్విస్టులు, గందరగోళాల మధ్య ఏం తేలబోతుందనేది సస్పెన్స్‌గా మారింది. పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరడంతో.. అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందన్నది టెన్షన్‌ను క్రియేట్ చేస్తోంది. ఎవరి వాదనలతో వాళ్లు సిద్ధమయ్యారు.
పార్లమెంట్‌తో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ప్రతి ఐదేళ్లకోసారి కచ్చితంగా ఎన్నికలను నిర్వహించే అధికారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఉంది. దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం లేదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 329 స్పష్టం చేస్తోంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల, నిర్వహణ వరకూ అంతా ఆర్టికల్ 329(B)కి లోబడి ఉంటుంది. 1992లో తీసుకు వచ్చిన రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 243K ప్రకారం రాష్ట్ర స్థాయిలో ఎన్నికల కమిషన్ల ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 324 కూడా దాదాపుగా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇందుకు అనుగుణగానే ఏపీలో మార్చిలోపు స్థానిక ఎన్నికలను పూర్తి చేసేందుకు జనవరి 8న ఉత్తర్వులు జారీ అయింది.
పంచాయతీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 8న జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. దాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు అప్పీలు చేయగా సీజే, జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఏకసభ్య ధర్మాసనం తీర్పును కొట్టేసి, ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. ఇప్పుడు దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది.
రాష్ట్రంలో గత రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్థానిక ఎన్నికలను పూర్తి చేసేందుకు ఎన్నికల కమిషన్ సిద్దమైంది. ఇందు కోసం తనకు ఉన్న అధికారాలను ఉపయోగించుకుంటోంది. గతంలో భారత ఎన్నికల సంఘానికి, హర్యానా రాష్ట్రానికి సైతం ఇదే తరహా ఘర్షణ ఏర్పడినప్పుడు సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. ఎన్నికలు నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్‌కే ఉంటుంది. అయితే కమిషన్‌కు ఏమైనా దురుద్దేశ్యాలున్నట్లు భావిస్తే సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని తీర్పు ఇస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న ఈ కేసులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.