Andhra Pradesh: ‘జమిలి’కి ఓకే.. కేంద్రంతో పాటే ఎన్నికలకు..! త్వరలో సీఎం జగన్ కీలక సమావేశం
AP Politics: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడు నెలలు ఉంది. అయినా ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైపోయింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ చంద్రబాబు పదేపదే చెప్పుకొస్తున్నారు.
అమరావతి, సెప్టెంబర్ 05: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడు నెలలు ఉంది. అయినా ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైపోయింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ చంద్రబాబు పదేపదే చెప్పుకొస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చినప్పుడు కూడా ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ జోరుగా ప్రచారం చేసింది. ముందస్తు ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారని.. ప్రభుత్వాన్ని రద్దు చేస్తారంటూ ప్రచారం చేసారు. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా ముందస్తు ఎన్నికలుంటాయని కేడర్‌కు చెప్పుకుంటూ వస్తుంది. మరోవైపు, భారతీయ జనతాపార్టీ మాత్రం ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. అయితే, ప్రతిపక్షాలు చేస్తున్న ముందస్తు ప్రకటనలపై అప్పట్లోనే వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. వచ్చే జనవరిలో మరిన్ని పథకాలు అమలుచేయడంతో పాటు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా ఐదేళ్లపాటు అన్ని కార్యక్రమాలు అమలుచేస్తామని చెప్పారు. అయితే, తాజాగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జమిలీ ఎన్నికలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అనుకూలంగా ఉన్నట్లు తెలిసింది. లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిపాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దానికి అంగీకారం తెలపనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత సీఎం జగన్ కీలక సమావేశం..
దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇప్పటికే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణ, జమిలీ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్‌తో వేసిన కమిటీతో జమిలీ ఎన్నికలు తప్పవా అనే చర్చ మొదలైంది. అయితే, కోవింద్ కమిటీ రిపోర్ట్ ప్రకారం రాజ్యాంగంలో చట్టసవరణలు చేసి జమిలీ ఎన్నికలకు వెళ్లేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఏపీలో ఏం చేయాలనే దానిపై ఇప్పటికే వైఎస్సార్సీపీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. జమిలీ ఎన్నికలపై ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించారు. జమిలీ ఎన్నికల విషయంలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయన్నారు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామృష్ణారెడ్డి. ఆ ప్రశ్నలపై స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ లో జమిలీ ఎన్నికలపై కసరత్తు జరగాలని చెప్పారు. అందరితో చర్చించిన తర్వాత జమిలీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలన్నారు. జమిలి ఒక్కటే అన్నిటికీ పరిష్కారం కాదంటూనే.. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడం మంచి పరిణామం అన్నారు సజ్జల. దీంతో జమిలీ ఎన్నికలకు ప్రభుత్వం అనుకూలంగా ఉందనేలా సజ్జల వ్యాఖ్యానించినట్లు అర్ధమైంది. వాస్తవంగా వచ్చే ఏప్రిల్ నెలలో అసెంబ్లీతో పాటు లోక్ సభకు సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2014, 2019లో లోక్ సభతో పాటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఒకవేళ కేంద్రం గనుక జమిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపితే.. దానికి వైసీపీ కూడా అంగీకారం చెబుతుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే దానికి తగ్గట్లుగా పార్టీ కూడా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత కీలక సమావేశం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
లోక్ సభతో పాటే ఎన్నికలకు వెళ్తే విజయావకాశాలపై వైసీపీ సమీక్ష
జమిలీ ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే లోక్ సభతో పాటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే, నిర్ణిత గడువు కంటే ముందుగానే ఎన్నికలకు వెళ్తే గెలుపు అవకాశాలు ఎంతమేరకు ఉంటాయనే దానిపై ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు చర్చించుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలతో పాటు కేడర్ మొత్తం సుమారు ఏడాదిన్నరగా ప్రజల్లోనే ఉంటూ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్వయంగా ప్రజలను ఇంటింటికి వెళ్లి కలవడం, వారి సమస్యలపై అప్పటికప్పుడే స్పందించడంతో వైసీపీ వైపు ప్రజల్లో పూర్తి సానుకూలత ఉందంటున్నారు ఆపార్టీ నేతలు.70 శాతం మంది ప్రజలు తమవైపే ఉన్నారని చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధం అని ప్రకటించకపోయినా ఎన్నికలకు పూర్తి సన్నద్దంగా ఉన్నామనే సంకేతాలను ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. ఇటీవల జరిగిన సర్వేలు, ఇతర నివేదికలు కూడా వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉండటంతో తిరిగి అధికారంలోకి వచ్చి తీరుతామనే అభిప్రాయంతో ఉన్నారు పార్టీ పెద్దలు. వై నాట్ 175 అంటున్న సీఎం జగన్.. దానికి తగ్గట్టుగానే ఏడాది నుంచి కసరత్తు చేస్తున్నారు. దీంతో జమిలీ ఎన్నికలు వచ్చి ఏపీకి కూడా ముందస్తు ఎన్నికలు జరిగినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదంటున్నారు పార్టీ నేతలు. మొత్తానికి జమిలీ ఎన్నికల ప్రచారంతో ఏపీలో అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..