AP Curfew: ఏపీలో కర్ఫ్యూ ఈ నెలాఖరు వరకు పొడిగింపు.. మరికొన్ని కీలక నిర్ణయాలు
ఏపీలో కరోనా కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఫలితాలు రావాలంటే నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని....
ఏపీలో కరోనా కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఫలితాలు రావాలంటే నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో అధికారులు, మంత్రులతో చర్చించిన అనంతరం సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5వ తేదీన ఏపీలో కర్ఫ్యూ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే కేసులు మాత్రం కంట్రోల్ అయిన పరిస్థితి లేదు. దీంతో కర్ఫ్యూను మరింత టైట్ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. వాలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కర్ఫ్యూ సందర్భంగా ఇప్పుడు ఉన్న నియమ, నిబంధనలు అమలు అవుతాయని తెలిపారు. కాగా కరోనాతో తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లల్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. వారి పేరు మీద బ్యాంకుల్లో డబ్బులు వేసి.. వచ్చే వడ్డీతో వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా చూసేలా ప్రతిపాదనలు ఉండాలన్నారు. అలాగే బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలని సీఎం జగన్ నిర్ణయించారు.
2 వారాల్లో.. 2 శాతం పాజిటివ్ రేట్ తగ్గుదల: కృష్ణా జిల్లా కలెక్టర్
కృష్ణా జిల్లాలో గత రెండు వారాల్లో రెండు శాతం పాజిటివ్ రేట్ తగ్గుదల ఉందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. కరోనా నియంత్రణకు జిల్లాలోని 14,96,181 ఇళ్లను సర్వే టీమ్స్ సందర్శించడం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. గత రెండు రోజులుగా 4లక్షల 93 వేల 734 (33 శాతం) ఇళ్ల నుంచి సమాచారం సేకరించగా.. వాటిలో 4,111 మంది కుటుంబాల్లో జ్వరం, కొవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నవారిని గుర్తించామన్నారు. జిల్లాలో మొత్తం 4,506 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 7,01,371 మందికి వాక్సినేషన్ వేసామన్నారు.
Also Read: మొదలైన “స్పుత్నిక్ వి” వ్యాక్సిన్ పంపిణీ… దేశంలో టీకా కొరత తీరనుందా?