Dwaraka Tirumala: బోరుబావిలో పడ్డ బాలుడు.. 5 గంటలు నరకయాతన.. ఓ స్థానిక యువకుడు తెగించి..
ఆడుకుంటూ వెళ్లి ఓ బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డాడు. 30 అడుగుల లోతులో చిక్కుకున్నాడు. ఓ 5 గంటల పాటు లోపల నుంచి అరుస్తూనే ఉన్నాడు. కానీ ఆ కేకలు ఎవరికీ వినిపించడం లేదు.
Andhra Pradesh: బాలుడికి పెను ప్రమాదం తప్పింది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ 9 ఏళ్ల బాలుడిని స్థానికులు సాహసం చేసి ప్రాణాలతో కాపాడారు. సుమారు 5 గంటల పైనే అందులో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆ బాలుడు.. చివరకు స్థానిక యువుకుడి సాహసంతో ప్రమాదం నుంచి మృత్యుంజయుడిలా బయటపడ్డాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోలనుకుంట(Gundugolanukunta)లో చోటు చేసుకుంది.గుండుగోలనుకుంటకు చెందిన 9 ఏళ్ల పూర్ణజశ్వంత్ బుధవారం సాయంత్రం తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. అయితే ఆ సమీపంలో ఎన్నో ఏళ్లుగా పూడుకుపోయిన 400 అడుగుల లోతు గల ఓ బోరుబావి ఉంది. ఆ బోరుబావిపై చెత్తాచెదారం పేరుకుపోయి ఆ రంధ్రం కనిపించకుండా ఉండడంతో బాలుడు జస్వంత్ కర్ర కోసం అటుగా వెళ్లాడు. బోరుబావిని గమనించకపోవడంతో ప్రమాదవశాత్తు అందులో జారి పడిపోయాడు.30 అడుగుల లోతులో ఓ రాయిపై చిక్కుకున్నాడు. అయితే తల్లిదండ్రులు ఎంతసేపటికి తన కుమారుడు జశ్వంత్ కనిపించకపోయేసరికి బంధువులు ఇళ్ళు, చుట్టుపక్కల ప్రదేశాల వెతకడం ప్రారంభించారు. చివరకు రాత్రి 9 గంటల సమయంలో బోరు బావిలో నుంచి కేకలు వేస్తున్న జశ్వంత్ జాడను స్థానికులు గుర్తించారు. దీంతో హుటాహుటిన బోరుబావి వద్దకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని తాళ్ళ సహాయంతో బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అది వీలుకాక పోవడంతో స్థానిక యువకుడు సురేష్ తన నడుముకి తాడు కట్టుకొని బోరుబావిలో దిగి బాలుడి నడుముకి ఆ తాడు కట్టి పైకి లాగాడు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన బాలుడు జశ్వంత్ ఆరోగ్యంగా ఉన్నాడు. సమాచారం అందుకున్న భీమడోలు ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. సుమారు 5 గంటల పైనే బోరుబావిలో ఉన్న బాలుడు జశ్వంత్ ప్రాణాలతో బయటపడటంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పటికే ఎన్నో పసి ప్రాణాలను బోరు బావులు బలి తీసుకున్నాడు. తెరిచి ఉన్న బోరు బావుల వల్ల జరిగే ప్రమాదాల గురించి గతంలో టీవీ9 గొంతెత్తింది. అధికారులు సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయినా ఇప్పటికీ కొందరిలో మార్పు రాకపోవడం గమనార్హం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..