Andhra University: కీలక కోర్సులకు మంగళం పాడుతున్న ఆంధ్రా యూనివర్సిటీ.. కారణమదేనా..!
Andhra University: ఉత్తరాంధ్రకు ఐకాన్ విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం. ఎంతో మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీలో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు.
Andhra University: ఉత్తరాంధ్రకు ఐకాన్ విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం. ఎంతో మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీలో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అలాంటి యూనివర్సిటీకి ఇప్పుడు సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ సమస్య విద్యార్థుల అడ్మిషన్ల పైన, కోర్సుల పైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విధిలేని పరిస్థితుల్లో కోర్సులను రద్దు చేసే పరిస్థితికి దారితీస్తోంది. కిందటేడాది జియాలజీలో బీఎస్సీ, ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సును రద్దు చేసిన యూనివర్శిటీ.. ఈ ఏడాది అదే పంథాలో నడుస్తోంది. హిస్టరీ, ఆర్కియాలజీ, సంస్కృతం, ఫిలాసఫీ, జర్నలిజం, ఉమెన్ స్టడీస్ తదితర విభాగాల్లోని దాదాపు పది కోర్సులను ఈ యేడాది రద్దు చేసింది. జువాలజీ విభాగంలో కేవలం ఇద్దరు ప్రొఫెసర్లు మాత్రమే ఉండటం.. ఈ నెలాఖరికి ఒకరు రిటైర్ అవుతుండటంతో ఆ విభాగంలోని ఎమ్మెస్సీ ఫిషరీస్ కోర్సును మెరైన్ లివింగ్ రిసోర్స్ విభాగంకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. ఎంహెచ్ఆర్ఎం విభాగంలో ఒకప్పుడు పదిమంది ప్రొఫెసర్లు ఉంటే ఇప్పుడు కేవలం ఒక ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారు. దీంతో గతంలో విద్యార్థుల నుండి వచ్చిన డిమాండ్ మేరకు ఆర్ట్స్ కోర్సుగా ఉన్న ఎంహెచ్ఆర్ఎంను కామర్స్‌లో ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ కిందికి ట్రాన్స్ఫర్ చేశారు.
అయితే కోవిడ్ నేపథ్యంలో ఈ ఒక్క ఏడాది మాత్రమే కొన్ని కోర్సులను తాత్కాలికంగా ఆపామని, దీన్ని ‘ఫ్రీజింగ్’ కింద పరి గణించాలేగానీ.. రద్దు చేశామని అనకూడదని అంటున్నారు యూనివర్సిటీ అధికారులు. వాటిని దూరవిద్యలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్ చెబుతున్నారు.
ప్రస్తుతం యూనివర్సిటీలో 962 మంది ప్రొఫెసర్లు ఉండాల్సి ఉండగా.. కేవలం 227 మంది ప్రొఫెసర్ల తోనే నెట్టుకొస్తోంది యూనివర్సిటీ యాజమాన్యం. 462 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ.. వాటి నియామకానికి కోర్టు కేసులు ప్రతిబంధకంగా వున్నాయి. మరోవైపు నిధుల కొరత కారణంగా తప్పదనుకున్న కోర్సులకు మినహా పెద్దగా ఒప్పంద ఆచార్యుల నియామకానికి పాలకమండలి ఆసక్తి చూపడం లేదు. అయితే మరికొన్ని నెలల్లో కోర్టు వివాదాలు పరిష్కారమయ్యే అవకాశముందని ప్రొఫెసర్ల నియామకాలు చేపడతామని రిజిస్ట్రార్ చెబుతున్నారు. గతంలో మాదిరిగా వసతి గృహాల్లో ఎక్కువ సంఖ్యలో వసతి కల్పించలేని పరిస్థితి ఉన్న౦దున కొన్ని విభాగాల్లో తగిన సంఖ్యలో ఆచార్యులు లేని కోర్సులను గుర్తించి తాత్కాలికంగా నిలిపివేశామ౦టున్నారు. ప్రొఫెసర్ల నియామకం జరిగాక వచ్చే విద్యా సంవత్సరానికి కొన్ని కోర్సులను మళ్లీ అందుబాటులోకి తెస్తాం అని అంటున్నారు.
మొత్తానికి యూనివర్శిటీలో కోర్సుల రద్దు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగ విరమణతో అయ్యే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయడంలో గత కొంత కాలంగా అంతులేని తాత్సారం చేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వందలాది మంది పేద విద్యార్థులు ఇక్కడి కోర్సుల్లో చేరి తమ ఉజ్వల భవిష్యత్తుపై ఆశలు పెట్టుకుంటారు. పోటీ పరీక్షలకు సమాయత్తం అవుతుంటారు. ఇప్పుడు ఏకంగా కోర్సులే ఎత్తేస్తే ఆ మేరకు అవకాశాలు కోల్పోయినట్లేనని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also read:
Corona Virus: ‘జూ’లో కరోనా వైరస్ కల్లోలం.. ఏడు పక్షులు, సింహం మృతి.. ఎక్కడంటే..
Viral Video: జిరాఫీని మట్టుబెట్టిన సింహం.. వేటలో అద్భుత ట్విస్ట్.. చివరికి ఏమైందంటే.!