Srisailam Treasures: శ్రీశైలంలో భారీగా గుప్త నిధులు.. తామ్ర శాసనాల్లో విలువైన సమాచారం.. అందుకే రసహ్యంగా ఉంచారా?
Srisailam Treasures: శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకే ప్రాంగణంలో కొలువైనది శ్రీశైలంలో మాత్రమే. అందుకే శ్రీశైలానికి నాభి స్థలం అని పేరు. శక్తి పీఠాలకు, జ్యోతిర్లింగాలకు ప్రపంచవ్యాప్తంగా..
Srisailam Treasures: శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకే ప్రాంగణంలో కొలువైనది శ్రీశైలంలో మాత్రమే. అందుకే శ్రీశైలానికి నాభి స్థలం అని పేరు. శక్తి పీఠాలకు, జ్యోతిర్లింగాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పవిత్రత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే. అలాంటి శ్రీశైలంలో అతి పురాతన కాలం నాటి బంగారు వెండి నాణెములతో పాటు ఎంతో విలువైన సమాచారం ఉన్న తామ్ర శాసనాలు లభిస్తుండటం సంచలనంగా మారింది. శ్రీశైలం ఏ కాలానికి చెందినది అనే దానికి సంబంధించి ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవు. క్రీస్తు పూర్వమే శ్రీశైలం ఉన్నట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. యుగయుగాల చరిత్ర ఉన్న శ్రీశైలంలో ఇప్పుడు నిధులు దొరకడం అనేది అత్యంత చర్చనీయాంశంగా మారింది.
విలువైన తామ్రశాసనాలు లభ్యం.. పూర్వ కాలంలో ఋషులు, మహర్షులు శ్రీశైలంలో ఉండి రోజుల తరబడి తపస్సు చేసేవారట. ఆ తపస్సు చేసేందుకు ఏర్పాటు చేసుకున్నవే పంచ మటాలు. ఈ పంచమఠాలను పునర్నిర్మించేందుకు దేవస్థాన అధికారులు అన్ని రకాల అనుమతులతో జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. ముందుగా గంటా మఠం పనులు మొదలు పెట్టారు. పనులు జరుగుతుండగా చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పనులు జరుగుతుండగానే ఒక్కొక్కటిగా అప్పటి బంగారు వెండి వజ్రాలతో పాటు తామ్ర శాసనాలు కూడా పెద్ద ఎత్తున లభ్యమయ్యాయి. తామ్ర శాసనాలలో ఉండే సమాచారం అద్భుతమైనదిగా, ఎంతో విలువైనదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. వివిధ భాషలతో పాటు తెలుగు లిపి కూడా తామ్ర శాసనాలలో ఉందట. ఆలయానికి ఎవరెవరు ఎక్కడ ఎక్కడ ఆస్తులు ఇచ్చారు, అవి ఎక్కడ ఉన్నాయి అనే సమాచారం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. జీర్ణోద్ధరణ పనులలో లభ్యమైన బంగారు, వెండి నాణేలను మాత్రం అధికారులు బహిర్గతం చేశారు. వాటిని భద్ర పరిచినట్లు కూడా ఆలయ అధికారులు వివరించారు.
గుప్తనిధుల వేటగాళ్ల ఫోకస్.. కాగా, నిధులు దొరికిన విషయం పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో శ్రీశైలంపై గుప్తనిధుల వేటగాళ్ల కన్ను పడినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంటా మఠంలో నిధులు దొరికిన తరువాత శ్రీశైలంలో అర్ధరాత్రి వేళ ఆలయంపై డ్రోన్ కెమెరాలు చక్కర్లు కొట్టాయి. ఈ డ్రోన్ కెమెరాలు ఎందుకు వచ్చాయి అనే దానిపై అప్పట్లో ఆందోళన వ్యక్తం అయినప్పటికీ ఇంతవరకు ఆ పని ఎవరు చేశారనేది తేల్చలేకపోయారు. అదే సమయంలోనే మల్లమ్మ కన్నీరు ఆలయం వెనుక ఉండే విశ్వామిత్ర ఆలయంలో పురాతన శివలింగాన్ని పెకిలించి వేశారు. పెద్ద గోతులు తవ్వారు. ఇక్కడికి అతి సమీపంలోనే జనసంచారం ఉన్నప్పటికీ ఎవరు చేశారనే దానిపై ఇంతవరకూ స్పష్టత లేదు. దీనిపై ఫిర్యాదు అందినప్పటికీ పోలీసులు తేల్చలేక పోయారు. గుప్త నిధుల కోసమే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీశైలంపై గుప్తనిధుల వేటగాళ్ల కన్నుపడిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుప్తనిధుల కోసం తవ్వకాలు కానీ ఇతరత్రా జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామనిచ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆలయ ఈవో తెలిపారు.
మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టాలి.. ఇదిలాఉంటే.. పంచమఠాల జీర్ణోద్ధరణ పనులలో లభ్యమైన పురాతన బంగారం, వజ్రాలు, వెండి నాణేలను మ్యూజియంలో భద్రపరచాలని, భావితరాలకు సమాచారం అందించాల్సిన వాటి గురించి గోప్యత వద్దని స్థానికులు సూచిస్తున్నారు. అంతేకాకుండా గుప్తనిధుల వేటగాళ్ల దాడులు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. శ్రీశైలంలో ప్రస్తుతం లభ్యమైన నిధులతో.. భవిష్యత్తులో ఎక్కడ ఎక్కడ నిధులు లభ్యం కాబోతున్నాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also read: