Ayodhya: అయోధ్య రామయ్యకు ధర్మవరం నేతన్నల అపూర్వ కానుక.. రామాయణ ఘట్టాలు ప్రతిబింబించేలా
అయోధ్యలో రూపుదిద్దుకుంటున్న రామ మందిరానికి అద్భుత హంగులు చేకూర్చేందుకు దేశంలో ప్రతీ ఒక్కరూ తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టువస్త్రాలకు ఖ్యాతిగాంచిన ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కళాకారులు శ్రీరాముడి కోసం అపురూప పట్టు వస్త్రాన్ని తయారు చేశారు. ఐదుగురు...
అయోధ్యలో రూపుదిద్దుకుంటున్న రామ మందిరానికి అద్భుత హంగులు చేకూర్చేందుకు దేశంలో ప్రతీ ఒక్కరూ తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టువస్త్రాలకు ఖ్యాతిగాంచిన ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కళాకారులు శ్రీరాముడి కోసం అపురూప పట్టు వస్త్రాన్ని తయారు చేశారు. ఐదుగురు చేనేత కళకారులు దాదాపు నాలుగు నెలలపాటు శ్రమించి ఒక అపూర్వ వస్త్రాన్ని తయారు చేశారు. మగ్గంపై సహజ రంగులతో తయారు చేసిన ఈ వస్త్రాన్ని ఎవరైనా సరే చూస్తూ ఉండిపోవాల్సిందే. దాదాపు 160 అడుగులు అంటే సుమారు 49 మీటర్ల ఈ వస్త్రం ఆరు చీరల పొడవు ఉంటుంది.
ఈ వస్త్రం అంచులను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అంచుకు రెండు వైపులా రామాయణంలోని అపూర్వ ఘట్టాలను నేశారు చేనేత కళాకారులు. దశరథ మహారాజును శ్రవణ కుమారుడు శపించడం మొదలు లంక నుంచి సీతారాములు అయోధ్యకు చేరిన పట్టాభిషేకం వరకు రామాయణంలో 400 కీలక ఘట్టాలను ఈ వస్త్రంపై ఎంతో అపురూపంగా నేశారు. కళ్లకు కట్టినట్టుగా కనిపించే ఈ అపురూప దృశ్యాలను అలా కళ్లప్పగించి చూడాల్సిందే. అంతే కాదు ఈ వస్త్రం మధ్య భాగంలో 13 భాషల్లో జై శ్రీరామ్ అని రామకోటిని నేసారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, గుజరాతీ, ఒడియాతో పాటు సింహళ భాషలో నేసిన జైశ్రీరామ్ అక్షరాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. దీని కోసం వీరు దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. దీనిని అయోధ్య రాముడికి బహుకరించేందుకు ఈ చేనేత కళాకారాలు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే అంతకు ముందే.. ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఈ వస్త్రాన్ని చూపాలని నేతన్నలు భావిస్తున్నారు. ప్రధాని చేతుల మీదుగా ఈ వస్త్రాన్ని అయోధ్య రాముడికి అందించాలన్నది ఈ కళాకారుల కోరిక. అయోధ్యలోని రామమందిరం వచ్చే సంక్రాంతి నుంచి భక్తుల దర్శనార్థం ప్రారంభం కానుంది. ఈ లోపే ఈ అపురూప వస్త్రాన్ని ఆ సీతారాముడి సన్నిధికి చేర్చాలని ధర్మవరం చేనేత కళాకారుల భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..