Visakhapatnam: ఆస్తి కోసం తల్లిదండ్రులను వేధిస్తున్న కొడుకులు.. ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చిన వైజాగ్ సీపీ
తమ పిల్లలే తమను వేధిస్తున్నారంటూ పలువురు తల్లిదండ్రులు నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి కన్నీరు పెట్టిన అవేదనాభరిత స్టోరీ ఇది. వారి ఆవేదన విన్న కమిషనర్ చలించి పోయారు. కన్న బిడ్డలు ఇలా కూడా ఉంటారా? కని పెంచి పెద్దవారిని చేసి, ప్రయోజకులను చేసిన కన్న తల్లి తండ్రులని అస్తి కోసం సొంత పిల్లలే కొడతారా? చంపేయాలని చూస్తారా? అని ఈ విషయాన్ని జీర్ణించుకోలేని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవి శంకర్ అయ్యన్నార్.. నేరుగా అలాంటి దౌర్భాగ్యపు కొడుకులను చూడాలని..
విశాఖపట్నం, నవంబర్ 29: తమ పిల్లలే తమను వేధిస్తున్నారంటూ పలువురు తల్లిదండ్రులు నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి కన్నీరు పెట్టిన అవేదనాభరిత స్టోరీ ఇది. వారి ఆవేదన విన్న కమిషనర్ చలించి పోయారు. కన్న బిడ్డలు ఇలా కూడా ఉంటారా? కని పెంచి పెద్దవారిని చేసి, ప్రయోజకులను చేసిన కన్న తల్లి తండ్రులని అస్తి కోసం సొంత పిల్లలే కొడతారా? చంపేయాలని చూస్తారా? అని ఈ విషయాన్ని జీర్ణించుకోలేని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవి శంకర్ అయ్యన్నార్.. నేరుగా అలాంటి దౌర్భాగ్యపు కొడుకులను చూడాలని అనుకున్నారు. వారికి బుద్ది వచ్చేలా చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అలాంటి దురాగతాలకు పాల్పడితే తల్లితండ్రులు ఎంత మానసిక వ్యధకు గురవుతారో స్వయంగా పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో నేరుగా వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు భరోసా కల్పించారు.
విశాఖ నగర పోలీస్ కమిషనర్ తాజాగా నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 56 ఫిర్యాదులురాగా అందులో 4 ఫిర్యాదులు మాత్రం.. వృద్దులను వారి కుటుంబ సభ్యులు పలు విషయాలలో వేధిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. వృద్ధుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించిన సీపీ స్వయంగా నిన్న రాత్రి ఆర్అర్ వెంకటాపురం, రామజోగిపేట పిర్యాదుదారుల ఇంటికి స్థానిక స్టేషన్ ఎస్.హెచ్.ఓ లతో పాటుగా వెళ్లి విచారణ జరిపారు. వాస్తవాలను తెలుసుకొని, వారి కుటుంబసభ్యులతో మాట్లాడి , సమస్యను త్వరితగతిన పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకి ఆదేశాలను జారీ చేశారు.
ఆస్తి పత్రాలు లాక్కుని, భోజనం కూడా పెట్టకుండా నా కొడుకు, కోడలు తరిమేశారు.. ఓ తండ్రి ఆవేదన
ఆర్.ఆర్ వెంకటాపురం అరిలోవకు చెందిన 79 యేళ్ల వృద్ధుడు మర్చెంట్ నేవీలో ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ చేసారు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పదవీవిరమణలో వచ్చిన డబ్బుతో ఇల్లు కొన్నాడు. అందరూ కలిసి సంతోషంగా ఉండేవారు. అయితే గత కొంతకాలంగా ఆస్తుల విషయమై కొడుకు తండ్రిని తరచూ హింసించసాగాడు. ఇంటి నుంచి బయటకి పంపేయడంతో అతని కుమార్తెలు ఆ వృద్ధుడిని ఆదరించారు. కొన్ని రోజుల తర్వాత బాగా చూసుకుంటామని చెప్పి అతని కుమారుడు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లాడు. గతంలాగే ఆస్తి కోసం వేధిస్తూ భోజనం కూడా పెట్టకుండా తండ్రిని హింసించ సాగారు. కొడుకు కోడలు కలిసి వృద్ధుడిపై కత్తితో దాడి చేసి, ఇంటి పత్రాలు, స్థల పత్రాలు, RD పుస్తకాలు, 3 లక్షల నగదు తీసుకొని ఇంటి నుంచి గెంటేశారు. వృద్ధుడి కుమార్తెలు అడగటానికి ఇంటికి వెళ్తే వాళ్ళని కూడా బెదిరించారు. దీంతో చేసేది లేక వృద్ధుడు స్పందనలో ఫిర్యాదు చేశాడు.
కొడుకే ఐదు సార్లు హత్యాయత్నం చేశారు.. మరో తండ్రి ఆవేదన
రామజోగి పేటకు చెందిన 78 యేళ్ల వృద్దుడికి ఆరుగురు సంతానం. వారిలో ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. పెయింటర్‌గా పని చేస్తూ సంపాదించినా డబ్బుతో పిల్లలను చదివించి, పెళ్లిళ్లు చేశాడు. కొంతకాలం క్రితం భార్య చనిపోవడంతో కొడుకులు, కోడళ్ళతో కలిసి ఒకే ఇంట్లో నివసించసాగారు. అయితే ఇంటిని తమ పేరుపై రాయాలని కొడుకులు ఎన్నో రకాలుగా హింసించసాగారు. వేధింపులకు గురి చేస్తున్నారని, ఐదుసార్లు చంపటానికి ప్రయత్నించారని తెల్పుతూ తండ్రి ఎన్నోసార్లు ఫిర్యాదు చేయాలనుకున్నాడు. కానీ పరువు పోతుందని ఇన్నిరోజులు పిర్యాదు చెయ్యలేదని తెలిపాడు. ఈ క్రమంలో నవంబర్ 20న మరోమారు తండ్రితో ఘర్షణ పడి చితక్కొట్టారు. కుమార్తెలు వచ్చి ఇదేంటని ప్రశ్నించడంతో బెదిరింపులకు దిగారు. దీంతో ఆ వృద్ధుడు స్పందనలో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదులను విన్న సీపీ నేరుగా వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులకు వార్నింగ్ ఇచ్చారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చారు.
తల్లి తండ్రులను వేధిస్తే మూడు నెలల జైలు
సీనియర్ సిటిజన్‌ల నిర్వహణ సంక్షేమం చట్టం 2007 – U/S 24 కింద తల్లిదండ్రులను, వృద్ధులను మానసికంగా, ఆర్ధికంగా, శారీరకంగా గురిచేస్తే.. మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.ఐదు వేల జరిమానా లేదా రెండు విధిస్తారు. పోలీస్ కమిషనర్ స్వయంగా ఫిర్యాదుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి, సమస్యలను పరిష్కరించడం చర్చణీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.