Team India: సఫారీలతో మ్యాచ్ ఓడినప్పుడు ఆ సాంగ్ వినిపించారు.. అక్కడే మనోళ్లు రెచ్చిపోయారు..
టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పలు విషయాలు వెల్లడించారు. రోహిత్ శర్మ తప్పుకున్నాక తన కెప్టెన్సీ, గౌతమ్ గంభీర్ వ్యూహరచన, జట్టుగా గెలవడంపై దృష్టి, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత పుంజుకున్న తీరును వివరించారు. ఆ వివరాలు ఇలా..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించి మూడోసారి కప్పును కైవసం చేసుకుంది. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్‌ను అందించిన మూడో కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించారు. ఫైనల్ ముగిసినప్పటి నుంచి ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్న ఆయన, మెగా టోర్నీలో పలు కీలక అంశాలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను కెప్టెన్ అవుతానని ఊహించలేదని సూర్యకుమార్ వెల్లడించారు. రోహిత్ శర్మ తప్పుకున్న తర్వాత కెప్టెన్సీ తనకు వస్తుందని అసలు అనుకోలేదని ఆయన తెలిపారు. ఏడాదిన్నర క్రితం శ్రీలంక పర్యటనకు వెళ్లడానికి వారం రోజుల ముందు బీసీసీఐ కార్యదర్శి జై షా తనను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు చెప్పారని సూర్యకుమార్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే కోచ్ గౌతమ్ గంభీర్‌తో మాట్లాడి, ప్రపంచకప్ గెలవడమే ఏకైక లక్ష్యంగా ఒక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశామని తెలిపారు. ఆటగాడిగా, కెప్టెన్‌గా ప్రపంచకప్ గెలిస్తే అది చాలా గొప్ప విషయమవుతుందని అప్పుడే భావించానని, ఇప్పుడు అదే నిజం కావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
అప్పటి నుంచి తమ బ్రాండ్ క్రికెట్‌ను మార్చాలని నిర్ణయించుకున్నామని సూర్యకుమార్ వివరించారు. వ్యక్తిగత ప్రదర్శనల కంటే జట్టుగా గెలవడమే ముఖ్యమని అందరికీ స్పష్టం చేశామన్నారు. చాలామంది తమ జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లలో దూకుడుగా ఆడుతుందని, కానీ ఐసీసీ ఈవెంట్‌లలో మాత్రం జాగ్రత్త పడుతుందని విమర్శించేవారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ విమర్శలను కూడా మార్చేయాలని నిర్ణయించుకొని, ఐసీసీ ఈవెంట్‌లలో కూడా దూకుడే మంత్రంగా బరిలోకి దిగామని సూర్యకుమార్ స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం తమ జట్టును పూర్తిగా మార్చేసిందని సూర్యకుమార్ చెప్పుకొచ్చారు. తమ ఆటగాళ్ల ప్రదర్శనపై ఎప్పుడూ సందేహాలు లేకపోయినా, సఫారీ టీమ్ తమను బాగా దెబ్బ కొట్టిందని ఆయన అంగీకరించారు.
ఆ ఓటమి తర్వాత తదుపరి ప్రతి మ్యాచ్‌ను నాకౌట్‌గా భావిస్తూ వచ్చామని తెలిపారు. టోర్నీలోని తొలి నాలుగు మ్యాచుల్లో తమ ప్రదర్శన కోచ్ గౌతమ్ గంభీర్‌కు సంతృప్తిని ఇవ్వలేదని, ఆయనలో అసహనం స్పష్టంగా కనిపించిందని సూర్యకుమార్ చెప్పారు. అయితే, ఆ తర్వాత తమ బ్యాటింగ్ స్కోర్‌లు చూసి గంభీర్ ముఖంలో చిరునవ్వు వచ్చిందని తెలిపారు. ఫైనల్‌కు ముందు గంభీర్ తమతో మాట్లాడుతూ, “మీరు గెలవాల్సింది ఇది మాత్రమే. 100 మ్యాచ్‌లు నెగ్గినా ఎవరూ గుర్తుపట్టుకోరు. కానీ ఫైనల్‌లో కప్పు గెలిస్తే అంతకుమించి వేరేది ఉండదు” అని చెప్పి తమలో అపారమైన స్ఫూర్తిని నింపారని సూర్యకుమార్ పేర్కొన్నారు. ప్రపంచకప్ ట్రోఫీని కెప్టెన్‌గా అందుకోవడం కంటే గొప్ప క్షణం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఓటమి తర్వాత, తమ వీడియో అనలిస్ట్ “సాహోరే బాహుబలి” పాటతో ప్రత్యేకంగా 10 నిమిషాల రీల్ తయారు చేసి చూపించారని, అది తమలో అపారమైన స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేసిందని సూర్యకుమార్ వెల్లడించారు. ఆ తర్వాతే తమ ప్రదర్శన పూర్తిగా మారిపోయిందని, అది విజయం వైపు నడిపించిందని ఆయన ముగించారు.
ఇది చదవండి: ఆపరేషన్ అక్కర్లేదు.. 15 రోజులు ఇలా చేస్తే పైల్స్ రోగం మళ్లీ రానే రాదు..
